Balaga Geetha Lakshmi: ఆటల్లోనూ అదరగొడుతున్నారు
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:00 AM
ప్రభుత్వాధికారిగా బిజీగా ఉంటూనే... ఒకవైపు క్రీడల్లో రాణిస్తూ, మరోవైపు సామాజిక సేవలో పాలుపంచుకుంటున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బలగా గీతాలక్ష్మి. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ అయిన ఆమె ఇటీవల...
ప్రభుత్వాధికారిగా బిజీగా ఉంటూనే... ఒకవైపు క్రీడల్లో రాణిస్తూ, మరోవైపు సామాజిక సేవలో పాలుపంచుకుంటున్న బహుముఖ ప్రజ్ఞాశాలి బలగా గీతాలక్ష్మి. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ అయిన ఆమె ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటారు. ఎంచుకున్న రంగం ఏదైనా తనదైన ముద్ర వేస్తున్న ఆమె ‘నవ్య’తో మాట్లాడారు.
‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా అర్తమూరు గ్రామం. మా నాన్నగారు స్వామినాయుడు హిందీపండిట్. అమ్మ అనసూయ గృహిణి. చిన్న వయసునుంచి చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకున్నాను. మా నాన్నగారి ప్రోత్సాహమే దీనికి కారణం. విద్యార్థినిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఖోఖో, లాంగ్ జంప్ పోటీల్లో పాల్గొన్నాను. 2000లో డీఎస్‌సీకి ఎంపికై, 2009 వరకూ ఉపాధ్యాయురాలుగా పని చేశాను. ఆ తరువాత గ్రూప్-2కు ఎంపికై... సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టాను. ఉద్యోగ బాధ్యతల వల్ల కొన్నాళ్లపాటు క్రీడలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ మూడేళ్ల క్రితం మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ప్రవేశించి, వరుసగా పతకాలు సాధిస్తున్నాను. 2024లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు పతకాలు గెలిచాను. తాజాగా గుంటూరులో నిర్వహించిన 45వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్ జంప్, డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో మూడు స్వర్ణ పతకాలు (45 ఏళ్ల ప్లస్ విభాగం) సాధించాను. క్రీడలతో పాటు పర్వతారోహణ అంటే నాకు ఎంతో ఇష్టం. కష్టమైనప్పటికీ పట్టుదలతో ప్రయత్నించాను. మొదట తూర్పు కనుమల్లో ఎత్తయిన 5,540 అడుగుల జిందఘఢ శిఖరాన్ని ఎక్కాను. 2024 అక్టోబర్‌లో హిమాలయాల్లో 12,110 అడుగుల చంద్రశిల శిఖరాన్ని, 2025 ఏప్రిల్‌లో 11,830 అడుగుల ఎత్తయిన దయారాబుగేల్ పర్వతాన్ని అధిరోహించాను. జాతీయ స్థాయితో పాటు, ఏషియన్ మాస్టర్స్ గేమ్స్‌లో సైతం పతకాలు సాధించాలన్నది నా లక్ష్యం.

సామాజిక సేవలో...
ప్రస్తుతం అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నాను. నేను బాధ్యతలు తీసుకొనే సమయానికి మా కార్యాలయం దయనీయ స్థితిలో ఉండేది. దాన్ని చక్కగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. కార్యాలయ ఆవరణలో మొక్కలు పెంచి, చిన్న పార్కును అభివృద్ధి చేశాం. రిజిస్ట్రేషన్లకు వచ్చేవారు కూర్చోవడానికి దాతల సాయంతో బల్లలు, వారు చదువుకోవడానికి పుస్తకాలతో చిన్న లైబ్రరీ ఏర్పాటు చేశాను. వాటిని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే రాజు స్వయంగా పరిశీలించి, నన్ను అభినందించారు. సామాజికంగానూ నాకు వీలైన సేవ చేస్తున్నాను. సేవా సంస్థలతో కలిసి చోడవరంతో పాటు వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాల నిర్వహణ, వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు వాటిలో కొన్ని. కళాశాల్లో విద్యార్థినులతో సమావేశాలు జరిపి, మోటివేషన్ క్లాసుల ద్వారా పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో వివరిస్తున్నాను.
వేపాడ జోజి, చోడవరం

వ్యాయామం తప్పనిసరి
నేను ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశాను. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాను. నా భర్త చంద్రరావు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పదో తరగతి, అబ్బాయి ఆరో తరగతి చదువుతున్నారు. మహిళలు ఇంటిపనిలో, వంటపనిలోనే కాదు, అన్ని రంగాల్లో రాణించగలరు. దానికి కావలసిందల్లా ప్రణాళిక, సమయపాలన. సమయాన్ని అనవసరమైన విషయాలకు వృథా చేయకుండా... ప్రతి పనినీ ప్రణాళిక ప్రకారం చేస్తూ వెళ్లాలి. అంతేకాదు... మహిళలందరూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. దానివల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడంతో పాటు, ఏకాగ్రత పెరుగుతుంది.’’
ఇవీ చదవండి: