నేటి అలంకారం శ్రీ బాలాత్రిపురసుందరీదేవి
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:51 AM
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా... నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని నవరాత్రుల సందర్భంగా వివిధ రూపాల్లో కొలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు...
దేవీ నవరాత్రులు
నేటి అలంకారం
శ్రీ బాలాత్రిపురసుందరీదేవి
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా... నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన ఆ తల్లిని నవరాత్రుల సందర్భంగా వివిధ రూపాల్లో కొలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు కొలువుదీరిన క్షేత్రాలతో పాటు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి పూజ, ఆరాధన ఈ దసరా రోజుల్లో అత్యంత వైభవంగా సాగుతాయి. ఈ సందర్భంగా దుర్గాదేవి అలంకార విశేషాలు, సమర్పించే నైవేద్యాల వివరాలు రోజూ ‘నవ్య’ పాఠకుల కోసం...
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజున శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అవతారంలో విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. బాలాత్రిపుర సుందరీదేవి చతుర్భుజాలతో ఉంటుంది. జపమాల, పుస్తకం ధరించి, అభయ, వరద హస్తాలతో కరుణిస్తుంది. కలువ పువ్వులో ఆసీనురాలై, సమస్త శుభాలను ప్రసాదించే దివ్యమంగళ రూపంతో మూడేళ్ల బాలికలా ఆమె కనిపిస్తుందని పురాణాలు వర్ణించాయి. షోడశ విద్యలకు ఆమె అధిష్ఠాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ‘లలితా త్రిశ తి’ పారాయణ చేస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైంది. శ్రీబాలామంత్రాన్ని సమస్త దేవీమంత్రాల్లో అత్యున్నతమైనదిగా ప్రధానమైనదిగా భావిస్తారు. శ్రీవిద్యోపాసకులకు ఉపదేశించే మొదటి మంత్రం ఇదే. మహాత్రిపురసుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలోని తొలి ఆమ్నాయంలో తొలి దేవత బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని చెబుతారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం బాలాత్రిపురసుందరీదేవి. ఈ అమ్మవారిని పూజిస్తే సర్వ సంపందలూ కలుగుతాయనీ, మనోవికారాలు తొలగిపోతాయనీ భక్తుల విశ్వాసం.
నైవేద్యం: పాయసం, పులగం
అలంకరించే చీర రంగు: లేత గులాబీ రంగు
అర్చించే పూల రంగు: అన్ని రకాలూ
పారాయణ: లలితా త్రిశతి
ఇవి కూడా చదవండి..
భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి