లోక రక్షకుడు
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:45 AM
‘‘ఆధ్యాత్మిక ఆనందం అనంతమైనది. శాశ్వతమైనది. మానవ జీవిత లక్ష్యం మోక్షం. దాన్ని సాధించేవరకూ మానవులకు జనన మరణాలు తప్పవు. ‘పునరపి జననం, పునరపి మరణం’ అనే ఈ చక్రం...
మెహెర్‌బాబా
‘‘ఆధ్యాత్మిక ఆనందం అనంతమైనది. శాశ్వతమైనది. మానవ జీవిత లక్ష్యం మోక్షం. దాన్ని సాధించేవరకూ మానవులకు జనన మరణాలు తప్పవు. ‘పునరపి జననం, పునరపి మరణం’ అనే ఈ చక్రం కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. మనస్సు ఒక్కసారే జన్మిస్తుంది. ఒక్కసారే మరణిస్తుంది. అంటే మనస్సుకు మరో జన్మ ఉండదు.
కాబట్టి నిరంతరం భగవన్నామస్మరణలో గడపాలి. దేవుడు ఎల్లవేళలా మీ ఎదుటే ఉన్నాడన్న ఎరుకతో ప్రవర్తించాలి’’ అని ప్రబోధించిన మహనీయుడు అవతార్ మెహెర్‌బాబా. తాను మానవ రూపధారినైన భగవంతుడిననీ, తాను ప్రత్యేకంగా ఎలాంటి మతం స్థాపించడానికి రాలేదనీ, అన్ని మతాలూ ఒక్కటేననీ, తన మతం ప్రేమ అనీ ప్రకటించారు.
మహారాష్ట్రలోని పుణేలో 1894 ఫిబ్రవరి 25న మెహెర్‌బాబా జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మేర్వాన్. పుణేలోని దక్కన్ కాలేజీలో చదువుకున్నారు. ఒక రోజు కళాశాలనుంచి ఆయన తిరిగి వస్తూ ఉండగా... వృద్ధురాలైన బాబాజాన్ ఆయన నుదుటిమీద ముద్దాడింది. దాంతో మేర్వాన్ ప్రపంచ చైతన్యం కోల్పోయారు. సద్గురువుగా మారారు. హజ్రత్ బాబాజాన్, షిరిడీ సాయిబాబా, ఉపాసినీ మహారాజ్, నారాయణ్ మహారాజ్, తాజుద్దీన్ బాబా తదితరులు మేర్వాన్‌ను సమస్త మానవాళిని ఆదుకొనే అవతార పురుషునిగా, భగవంతుని స్వరూపంగా కొనియాడారు. షిరిడీని మేర్వాన్ దర్శించుకున్నప్పుడు ‘ఓ పర్వర్థిగార్’ (ఓ లోకరక్షకా) అని షిరిడీబాబా ఆయనను సంబోధించారు. అనంతరం మేర్వాన్‌ను ఆయన శిష్యులు మెహెర్‌బాబా... అంటే ‘దయగల తండ్రి’ అని పిలవడం ఆరంభించారు. 1925 జూలై 10 నుంచి భౌతిక దేహం వదిలేవరకూ... నలభై నాలుగు ఏళ్ళపాటు మెహెర్‌బాబా కఠిన మౌన వ్రతంలో ఉన్నారు.
దేశంలో తొలిసారిగా...
1920వ దశకంలోనే పేదలకు కుష్టు రోగులకు సేవలు అందించడం కోసం ఉచిత వైద్యశాలను మెహెరాబాద్‌లో ఆయన స్థాపించారు. తరచూ కుష్టు రోగుల పాదాలు కడిగి, శిరస్సు వంచి పాదాభివందనం చేసి, కొంత డబ్బు, నూతన వస్త్రాలు ఇచ్చి పంపేవారు. 1925 మార్చిలో హజ్రత్ బాబాజాన్ పేరిట మెహెరాబాద్‌లోనే ఆశ్రమ పాఠశాలను ఆయన ప్రారంభించారు. అస్పృశ్యత తీవ్రస్థాయిలో ఉన్న ఆ కాలంలో... అన్ని కులాలు, మతాలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారు. 50 శాతం సీట్లను దళితులకు కేటాయించారు. స్కూలు యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. అలాంటి పాఠశాల ఆనాడు మన దేశంలో ఎక్కడా లేదు. మహాత్మాగాంధీ కూడా అప్పటికి అస్పృశ్యతా నివారణ కార్యక్రమాలు ఎక్కడా చేపట్టలేదు. అలాగే యావత్ మానవాళి కోసం 1952 నవంబర్‌లో, 1953 ఆగస్టులో విశేషమైన ప్రార్థనలు చేశారు. ఆ ప్రార్థనలు‘ దేవుడు ఒక్కడే’ అనే సత్యాన్ని చాటుతాయి. అలాగే మానవాళిని మేలుకొలపడానికి అనేక ప్రవచనాలు చేశారు. ‘భగవద్వచనం’, ‘సర్వం-శూన్యం’ తదితర గ్రంథాలను మౌనదీక్షలో ఉన్నప్పుడే రచించారు.
ఏడు రోజులైనా తరగని వర్చస్సు
మెహెర్‌బాబా 1969 జనవరి 31న దేహత్యాగం చేశారు. ఆయన దేహాన్ని ఫిబ్రవరి ఏడోతేదీ వరకూ... ఏడు రోజుల పాటు భద్రపరిచి ఉంచారు. దానికి దగ్గరగా వరిపొట్టు చల్లిన ఐసు గడ్డలను ఏర్పాటు చేశారు.. ఫిబ్రవరి ఒకటిన అంత్యక్రియలు నిర్వహించాలని, లేకపోతే బాబా దేహంలో మార్పులు వస్తాయని వైద్యులు సూచించారు. కానీ తాము వచ్చేవరకూ బాబా భౌతిక కాయాన్ని ఉంచాలని విదేశాల్లో ఉన్న బాబా అనుయాయులు అనేకమంది అభ్యర్థించడంతో... ఏ రోజుకారోజు అన్నట్టు వాయిదా పడుతూ వచ్చింది. పార్సీయుడైన మెహెర్‌బాబా జన్మదినం జోరాస్టర్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఏడు కావడం విశేషం. ఆ ఏడు రోజులూ ఆయన ముఖవర్చస్సు పచ్చని పసిడికాంతులు వెదజల్లుతూనే ఉంది. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లా కేంద్రానికి అయిదు కిలోమీటర్ల దూరంలోని మెహెరాబాద్‌లో... చిన్న కొండపైన మెహెర్‌బాబా సమాధి ఉంది. దాన్ని తన స్వీయ పర్యవేక్షణలో... 1930వ దశకంలో మెహెర్‌బాబా స్వయంగా నిర్మించారు. ఆయన 57వ అమరతిథి వార్షికోత్సవాలు శనివారం జరగనున్నాయి.
డాక్టర్ మల్లాది కృష్ణానంద్,
9959553218
వ్యతిరేకి... విధేయుడయ్యాడు!
మెహెరాబాద్ ఆశ్రమ పాఠశాలలో ఢాకే ఫాల్కర్ ఉపాధ్యాయునిగా పనిచేసి, ఆ తరువాత ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘‘టీచర్‌గా చేరడానికి ముందు రెండు షరతులు పెట్టాను. మిమ్మల్ని భగవంతుడిగా అంగీకరించననీ, నెలకు మూడొందల జీతం ఇప్పించాలనీ నేరుగా బాబాకే చెప్పాను. ఆయన అంగీకరించారు. అయితే ఒక రోజు... ‘మెహెర్‌బాబా సాక్షాత్తూ భగవంతుడు’ అని ప్రతిజ్ఞచేసి, ఆయనకు నమస్కరించాల్సిందిగా ఉపాధ్యాయులందరినీ స్కూలు మేనేజర్ ఆదేశించాడు. ఒక్కొక్కరూ ఆ ప్రకారం ప్రతిజ్ఞ చేశారు. నా వంతు వచ్చింది. నేను చేయనని చెప్పాను. మేనేజర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఆ మాట బాబా చెవిన వేశాడు. ‘‘నాకు, ఢాకేకు మధ్య ఉన్నది యజమాని, ఉద్యోగి సంబంధం మాత్రమే. కాబట్టి ఢాకే గురించి పట్టించుకోవద్దు’’ అని మేనేజర్‌ను బాబా హెచ్చరించారు. ‘‘ఏదో ఒక రోజు అతను నన్ను భగవంతుడిగా అంగీకరిస్తాడు’’ అన్నారు. అదే నిజమయింది’’ అని ఢాకే తన స్వయంగా రాసుకున్నారు. మెహెర్‌బాబా శిష్య బృందంలో ఢాకే ఒక ముఖ్య కార్యకర్తగా మారారు. ఇలా బాబాను వ్యతిరేకించినవారు ఎందరో ఆయనలోని దైవత్వాన్ని తెలుసుకొని, సంపూర్ణంగా విధేయులు అయ్యారు.
రేపు మెహెర్‌బాబా అమరతిథి
ఇవి కూడా చదవండి..
సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..
కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..