Asymmetrical Jewellery Trend: అసెమిట్రికల్ ఆభరణాలదే ట్రెండ్..
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:28 AM
అసెమిట్రికల్ ఆభరణాలు... పేరుకు తగ్గట్టు ఆభరణంలో పరస్పర విరుద్దమైన డిజైన్లు కూర్చి ఉంటాయి. లేదంటే ఓ పక్క డిజైన్‌తో మరోపక్క సాధారణంగా కనిపిస్తుంటాయి. భిన్నమైన పెండెంట్స్...
అసెమిట్రికల్ ఆభరణాలు... పేరుకు తగ్గట్టు ఆభరణంలో పరస్పర విరుద్దమైన డిజైన్లు కూర్చి ఉంటాయి. లేదంటే ఓ పక్క డిజైన్‌తో మరోపక్క సాధారణంగా కనిపిస్తుంటాయి. భిన్నమైన పెండెంట్స్, పొట్టీ పొడుగు డాంగ్లింగ్స్ వేలాడుతూ ఆకర్షణీయంగా ఉంటాయి. అన్ని రకాల మోడరన్ దుస్తుల మీద సొగసుగా నప్పుతుండడంతో మహిళలు వీటిపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. కొత్తగా వింత డిజైన్లతో రూపొందించిన సింగిల్ హారాలు, లేయర్డ్ చెయిన్లు, చోకర్లు, సింపుల్ నెక్లెస్‌లు, రకరకాలు జుంకాలు సరసమైన ధరలకే లభ్యమవుతుండడంతో యువత పోటీలు పడి మరీ వీటిని కొంటున్నారు.
ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలోనే ఇలా ఆకారంలో సారూప్యత లేని ఆభరణాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందమైన లాకెట్ ఉండే లావలియర్ చెయిన్‌లా కాకుండా రెండు లేదా అంతకు మించి భిన్నమైన పెండెంట్స్ అమర్చిన పొడవైన గొలుసులు, పొట్టీ పొడుగు డ్రాప్స్‌తో అందమైన సిల్హౌట్‌లా కనిపించే చోకర్లకు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆదరణ తగ్గలేదు. రత్నాలు, రంగురంగుల బీడ్స్ పొదిగిన పెండెంట్లను గొలుసు లేదా చోకర్‌కు వేలాడేలా కాకుండా ఓ పక్కగా జతచేసిన డిజైన్లు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒక పక్క నల్ల పూసలు అల్లి మరో పక్క బంగారు గుండ్లు జతచేసి అందమైన పెండెంట్‌తో జోడించిన కొత్త తరహా గొలుసులను వివాహితలు ఇష్టంగా ధరిస్తున్నారు.
అసెమిట్రికల్ ఆభరణాలను ఎక్కువగా బంగారం, వెండి, ప్లాటినంతో రూపొందిస్తుంటారు. వీటిని పండుగలు, వివాహాది శుభకార్యాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు మహిళలు. నాజూకుదనానికి ప్రాధాన్యమిస్తూ ఏ మాత్రం బరువుగా లేకుండా తేలికగా మెరిసే చౌకైన నగలను మహిళలు కోరుకుంటుండడంతో మిశ్రమ లోహాలతో కూడా అందమైన డిజైన్లను కస్టమైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు డిజైనర్లు. గొలుసులు, చోకర్లు, గాజులు, జుంకాలకు ఒక పక్క బీడ్స్, ముత్యాల డిజైన్లు; మరోపక్క లేయర్స్, చంకీ డిజైన్లు కూర్చి సరికొత్త ఆభరణాలను తయారుచేస్తున్నారు. విభిన్నమైన రంగుల్లో లభించే క్రిస్టల్స్, మెరిసే రాళ్లు, పూసలను సారూప్యత లేకుండా కూర్చి తయారుచేసిన గడియారాలు, బ్రూచ్‌లు, పెండెంట్లు, బ్రేస్‌లెట్లను కూడా యువత అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
ఆభరణాల తయారీలో సమరూపాన్ని అనుసరించకుండా సృష్టించిన డిజైన్లు ఫ్యాషన్ ట్రెండ్‌గా నిలుస్తున్నాయి. ఇది గమనించిన డిజైనర్లు అన్ని వర్గాల మహిళలకు నచ్చేలా సరికొత్త జుంకాలకు రూపకల్పన చేస్తున్నారు. ఒక చెవికి స్టడ్ మరోదానికి డాంగిల్; ఒక దానికి పొడవుగా మరోదానికి పొట్టిగా, ఒకదానికి గుండ్రంగా మరోదానికి జ్యామితి ఆకృతులు ఉండేలా డిజైన్లు రూపొందిస్తున్నారు. ఒక చెవి జుంకాని పక్షి, పువ్వు, చంద్రుని ఆకారాల్లో రూపొందిస్తే మరో దానికి అదే పక్షి రెక్క, అదే పువ్వు మొగ్గ, నక్షత్రాలతో డిజైన్ చేస్తున్నారు. వీటిని సెలబ్రిటీలేకాదు యువతులు సైతం అమితంగా ఆదరిస్తున్నారు. సృజనాత్మకతతో కళగా కనిపించే ఈ ఆభరణాలు రోజువారీ ధరించే సింపుల్ దుస్తులకు స్టేట్‌మెంట్ లుక్‌ని జోడిస్తాయి.
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..