కళాత్మక సందేశం
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:04 AM
నువ్వు గింజ నుంచి పుచ్చకాయ వరకు... గుడ్డు నుంచి గులకరాయి వరకు... ఆమె చేయి పడితే అద్భుత కళారూపమవుతుంది. అణువంత వస్తువైనా చిత్రంగా మారి... అనంత సందేశాన్నిస్తుంది...
నువ్వు గింజ నుంచి పుచ్చకాయ వరకు... గుడ్డు నుంచి గులకరాయి వరకు... ఆమె చేయి పడితే అద్భుత కళారూపమవుతుంది. అణువంత వస్తువైనా చిత్రంగా మారి... అనంత సందేశాన్నిస్తుంది. విభిన్న నాణేలను సేకరించడం... గణతంత్ర దినోత్సవంలాంటి సందర్భాల్లో ప్రత్యేకతను చాటుకోవడం... గృహిణిగా ఇంటి పనుల్లో బిజీగా ఉన్నా... అభిరుచులకు పట్టం కట్టారు నడుకుదిటి సుజాత. ఊహలకు రెక్కలు తొడిగి... పలు రికార్డు పుస్తకాల్లో కూడా తన పేరు నమోదు చేసుకున్న సుజాతను ‘నవ్య’ పలుకరించింది.
‘‘నాకు బొమ్మలు గీయడం చిన్నప్పుడే అలవడింది. బడి రోజుల్లో దానిపై మరింత మక్కువ పెరిగింది. బియ్యపు గింజ లాంటి సూక్ష్మ వస్తువులపై అద్భుత చిత్రాలు ఆవిష్కరించిన తీరు నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ వాటి మీద బొమ్మలు వేయడం సాధ్యంకాదు. ఆ కళాకారుల్లానే ఎప్పటికైనా నేను కూడా చిన్న చిన్న వస్తువులపై బొమ్మలు గీయాలని అనుకునేదాన్ని. ఆసక్తితో ఖాళీ సమయాల్లో సాధన చేశాను. మైక్రో ఆర్ట్‌లో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు. క్రమంగా నైపుణ్యం సంపాదించాను.
కాదేదీ అనర్హం...
మా స్వస్థలం కృష్ణా జిల్లా పెనమలూరు. మావారు నడకుదురు ఈశ్వరరావు రవాణాశాఖలో ఇన్స్‌పెక్టర్. ఒక కళాకారిణిగా ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. గుడ్డు, గులకరాయి, పుచ్చ గింజ, నువ్వు గింజ, బియ్యం, పువ్వులు, పుట్నాల పప్పులు... ఏది కనిపిస్తే దానిపై బొమ్మలు వేయడం మొదలుపెట్టాను. స్వాతంత్య్రం విలువ ఏమిటో భావితరాలకు చెప్పాలనే ఉద్దేశంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల చిత్రాలు గీశాను. జాతీయ జెండా, జాతీయ గీతం గొప్పతనం తెలిసేలా చిన్న గింజలపై వాటిని చిత్రించాను. పుచ్చకాయ మీద జాతీయ జెండా, టాబ్లెట్ మీద జాతీయ గీతం, గుడ్డుపై మహిళల ప్రపంచకప్పు లోగో, బల్లి గుడ్డుపై భారత దేశం, గుండ్రని టాబ్లెట్ మీద ఒక పక్క దేశ పటం, గాంధీ బొమ్మ... మరోపక్క స్వచ్ఛభారత్, గాంధీ జయంతి చిత్రీకరించాను. కొబ్బరి పువ్వు, బియ్యం, నువ్వు గింజలపై గణపతిని గీశాను. కొబ్బరి పిందె మీద అమ్మవారి అలంకరణ, సీతాఫలం గింజలతో ఉడత, గుర్రం... ఇలా పదేళ్లలో వందల సూక్ష్మ చిత్రాలు గీశాను. కొమ్మరికాయలపై కళారూపాలు, పారిజాత పుష్పాలతో గీసిన శివుడి చిత్రం మరో ప్రత్యేకత. నైపుణ్యం ఒక్కటే సరిపోదు. సృజన, దానికి రూపం ఇవ్వగల సామర్థ్యం కూడా ఇక్కడ ఎంతో అవసరం.
రికార్డులూ ఉన్నాయి...
సూక్ష్మ చిత్రాలే కాదు... పాత నాణేలు, స్టాంపులు సేకరించడం కూడా నాకు చాలా ఇష్టం. కుటుంబ సభ్యులు, బంధువుల జన్మదినం తేదీలు ఉన్న కరెన్సీ నోట్లను సేకరించి, వారికి బహుమతిగా ఇస్తుంటాను. ఏటా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలను పురష్కరించుకుని ఒక కళాఖండాన్ని రూపొందిస్తుంటాను. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాలం చెల్లిన మూడు షుగర్ టాబ్లెట్లపై జాతీయ గీతం, జనగణమన రాశాను. పారిజాత పుష్పాలతో భారత రాజ్యాంగ రచయిత బీఆర్ అంబేడ్కర్‌ను చిత్రించాను. ఇంటి పనులు చేసుకొంటూనే నా అభిరుచిని కొనసాగించగలుగుతున్నాను. ఇన్నేళ్ల నా కళా ప్రయాణంలో కొన్ని మైలురాళ్లను కూడా అధిగమించాను. ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించాను. ఒక మహిళగా స్వశక్తితో సాధించిన విజయం ఇది. ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది.’’
బి.రాంబాబు, ఎస్.శ్రీనివాసరెడ్డి, విజయవాడ
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..
సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News