Share News

కథలతో కదిలిస్తోంది

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:58 AM

సోషల్‌ మీడియా చాలామందికి ఒక కాలక్షేపమైతే... మరికొందరికి పేరు సంపాదించుకొనే మార్గం. ఆరాధనా ఛటర్జీ దృష్టిలో మాత్రం అది సామాజిక బాధ్యతను...

కథలతో కదిలిస్తోంది

సోషల్‌ మీడియా చాలామందికి ఒక కాలక్షేపమైతే... మరికొందరికి పేరు సంపాదించుకొనే మార్గం. ఆరాధనా ఛటర్జీ దృష్టిలో మాత్రం అది సామాజిక బాధ్యతను గుర్తు చేసే సాధనం.ఎందరో ఆర్తులను సమాజానికి పరిచయం చేసి, వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తున్న ఆ కోల్‌కతా అమ్మాయి కథ ఇది.

దీపాలీ ఘోష్‌... వయసు డెబ్భయ్యేళ్ళు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం హౌరా నగరంలో ఒక మూల చిన్న హోటల్‌ నడుపుతున్నారు. ఆమె దినచర్య గురించి రెండు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ అయిన ఒక వీడియో లక్షల మందిని కదిలించింది. దీపాలీ జీవితం ఇప్పుడు కొత్త వెలుగుల్ని సంతరించుకుంటోంది. ఆమె దీనగాథను దృశ్యబద్ధం చేసిన ఆరాధనా ఛటర్జీకి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే సంతోషంగానే ఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టుకోకుండా... తమ బాధ్యత ఏమిటో, తమ పరిధిలో ఏం చెయ్యగలమో అందరూ ఆలోచించాలి. అలా ఆలోచింపజెయాలనేదే నా ఆశయం’’ అంటోంది ఆరాధన. కోల్‌కతాలో పుట్టి, పెరిగిన ఆరాధన కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌ చేసింది. ఒక ప్రసిద్ధ బ్రాండ్‌ దుస్తుల ప్రకటనలోనూ నటించింది. కానీ మోడల్‌గా కొనసాగలేకపోయింది. ‘‘మోడలింగ్‌లో మంచి ఆదాయమే వచ్చింది. కానీ ఆ రంగంలో పని సంస్కృతి నాకు నచ్చలేదు. ఇంతలో కరోనాతో బ్రేక్‌ వచ్చింది. నేను, నా స్నేహితుడు జోయ్‌దీప్‌ సేన్‌ కలిసి కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నాం. ఇద్దరం కలిసి ఒక ఫుడ్‌ ట్రక్‌ ప్రారంభించాం’’ అని చెప్పింది ఆరాధన. కానీ ఆ వ్యాపారం ఆదిలోనే విఫలమైపోయింది. స్నేహితులు కొత్తదారి వెతుక్కోవాల్సి వచ్చింది.


అవే ఆస్తులుగా...

కొన్ని నెలలు అనిశ్చితి... ఏం చెయ్యాలో అర్థం కాలేదు. జోయ్‌దీప్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేశాడు. కొన్ని మీడియా సంస్థల్లో పని చేశాడు. ఒక డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థ నడుపుతున్నాడు. ‘‘మొదట్నుంచీ వీడియో చిత్రాలు రూపొందించడం మీద అతనికి ఆసక్తి. సాధారణంగా ఎవరూ పెద్దగా పట్టించుకోని, మనం గుర్తించని వ్యక్తులను సమాజానికి పరిచయం చెయ్యాలనుకున్నాం. అలా 2023లో ‘స్టోరీస్‌ బై ఆరాధన’ అనే ఛానెల్‌ మొదలైంది. పెద్ద పెట్టుబడులు లేవు. అత్యాధునిక వసతులున్న స్టూడియోలు లేవు. కేవలం ఒక కెమేరా, గంటల కొద్దీ పరిశోధన, నిర్విరామంగా పని చేయడం... ఇవే మా ఆస్తులు’’ అని ఆమె గుర్తు చేసుకుంది. రోజూ పొద్దున్నే బయలుదేరి... కోల్‌కతా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి కథనాలను వెతుక్కుంటూ ఆమె తిరిగేది. కొన్నిసార్లు 14 నుంచి 16 గంటలు తిరిగినా ఫలితం ఉండేది కాదు. క్రమంగా... ఒక్కొక్కటిగా వీడియోలు తీయడం మొదలుపెట్టింది. జోయ్‌దీప్‌ సహకారంతో వాటిని ఎడిట్‌ చేసి.... పోస్ట్‌ చేసేది. ఇలా కొన్ని పదుల వీడియోలు తయారయ్యాయి. మెల్లమెల్లగా వీక్షకులు పెరిగారు. ఒక టీమ్‌ ఏర్పాటయింది. గోల్‌పార్క్‌ దగ్గర సొంత పెయింటింగ్స్‌ అమ్ముకొనే చిత్రకారుడు సునీల్‌ పాల్‌ మీద చేసిన వీడియో ఎందరినో ఆకర్షించింది. వారంలోనే ఆయన వేసిన పెయింటింగ్స్‌ అమ్ముడైపోయాయి. అలాగే... విగ్రహాలను తయారు చేసే వ్యక్తి మీద ఆమె వీడియో చేశాక... ఒకేసారి వచ్చిపడిన వందలాది ఆర్డర్లకు సరఫరా చేయడం అతనికి కష్టమైపోయింది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులపై ఆరాధన వీడియో పోస్ట్‌ చేస్తే... వారి చికిత్స కోసం, మందుల కోసం స్వచ్ఛందంగా సాయం చెయ్యడానికి ఎందరో ముందుకు వచ్చారు.

ఆమెకు వందనం

ఈ మధ్య దీపాలీ ఘోష్‌ వీడియో కూడా బాగా వైరల్‌ అయింది. ‘‘దీపాలీ వయసు డెబ్భయ్యేళ్ళు. భర్త మరణించాక... ఇద్దరు పిల్లలూ ఆమెను పట్టించుకోలేదు. ముప్ఫయ్యేళ్ళుగా నడుపుతున్న చిన్న హొటల్‌ ఆమె జీవనాధారం. వండడం, వడ్డించడం, పాత్రలు శుభ్రం చెయ్యడం... అంతా తనే చేసుకుంటుంది. హొటల్‌, ఆమె నివాసం... అంతా కలిసి ఒక చిన్న గది. అది పొగచూరిపోయి ఉంది. వంటపాత్రలు సొట్టలు పడిపోయాయి. గది పైకప్పుగా ఉన్న షీట్‌ పగిలిపోయింది. మూల ఉన్న ప్లైవుడ్‌ ముక్క మీదే ఆమె పడుకుంటుంది. వచ్చే కస్టమర్లు కూడా తక్కువే. అయితే పదిమంది వస్తే వండే ఓపిక కూడా ఆమెలో కనిపించలేదు. కానీ ఎవరి దగ్గరా చెయ్యి చాపకూడదనే ఆత్మాభిమానం దీపాలీ ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయేవరకూ... వండడం, సరుకులకోసం బయటకు వెళ్ళడం లాంటి అన్నిటినీ చిత్రీకరించి వీడియో చేశాం. దానికి మేం ఊహించని విధంగా స్పందన వచ్చింది.


‘‘దయచేసి లొకేషన్‌ పెట్టండి. నేను వ్యక్తిగతంగా కలిసి సాయం చేస్తాను’’ అని ఒకరు, ‘‘మనం కచ్చితంగా ఆమె దుకాణాన్ని సరికొత్తగా మార్చాలి. దానికి ఏది అవసరమైనా నాకు చెప్పండి’’ అని మరొకరు, ‘‘ఈ వయసులో ఎవరిమీదా ఆధారపడకుండా కష్టపడి హుందాగా బతుకుతున్న ఆమెకు వందనం. అన్నీ ఉన్నా ఇంకా ఇంకా ఆశపడేవాళ్ళు ఆమె నుంచి నేర్చుకోవాలి’’ అని ఇంకొకరు... ఇలా ఎందరో దీపాలీకి స్నేహహస్తం అందించారు’’ అన్నారు ఆరాధన.

ఇంతకన్నా ఇంకేం కావాలి?

ఆరాధన, ఆమె టీమ్‌ సభ్యులు తమ సొంత డబ్బును కూడా కలిపి... దీపాలీ ఇంటిని బాగుచేయించారు. నెలనెలా ఆమెకు కొంత మొత్తం డబ్బు, అవసరమైన మందులు అందే ఏర్పాటు చేశారు. ‘‘మా వీడియోల ద్వారా ప్రయోజనం పొందినవారెవరైనా ఫోన్‌ చేసి, కృతజ్ఞతలు చెబుతున్నప్పుడు... ఇంతకన్నా ఇంకేం కావాలి అనిపిస్తుంది. నేను సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావాలని కోరుకోవడం లేదు. ఎప్పుడూ అందరి దృష్టిలో ఉండాలనే తాపత్రయం లేదు. వీడియోలు తీసి, ‘‘ఈ వ్యక్తులకు సాయం చెయ్యండి’’ అని అడగడం మాకు ఇష్టం ఉండదు. అయితే ‘‘ప్రజలకు మీ మాట మీద నమ్మకం ఉంటే వారు స్వచ్ఛందంగా సాయం చేస్తారు. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోండి’’ అని మేము గురువులా భావించే వ్యక్తి ఒకరు చెప్పారు. మేం అడగకుండానే జనం సాయం కోసం ముందుకు వస్తున్నారు. మొదటి రోజు నుంచీ దీన్ని వ్యక్తిగత ఛానెల్‌గా నడపాలి అని అనుకోవడంలేదు. ఇది ఒక కమ్యూనిటీ. దీన్ని ఢిల్లీ, ముంబయి.. ఇలా దేశమంతటా విస్తరించాలనుకుంటున్నాం’’ అని చెబుతున్నారు ఆరాధన.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 05:58 AM