భక్త కల్పవల్లి
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:10 AM
శ్రీమహావిష్ణువును సేవించి, ఆయననే భర్తగా పొందిన మహా భక్తురాలు గోదాదేవి. ఆమెను సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశగా పరిగణిస్తారు. గోదాదేవిని ‘ఆండాళ్ ’ అని, ‘గోదా మహాలక్ష్మి’ అని, ‘కొడుత్త-నాచ్చియార్’ అని...
తెలుసుకుందాం
నేడు శ్రీఆండాళ్ జయంతి
శ్రీమహావిష్ణువును సేవించి, ఆయననే భర్తగా పొందిన మహా భక్తురాలు గోదాదేవి. ఆమెను సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశగా పరిగణిస్తారు. గోదాదేవిని ‘ఆండాళ్ ’ అని, ‘గోదా మహాలక్ష్మి’ అని, ‘కొడుత్త-నాచ్చియార్’ అని పిలుస్తారు. శ్రీవైష్ణవ ప్రబంధాలు ‘కోదై’గా ప్రస్తుతించిన ఆమె చరిత్రను ‘ఆముక్త మాల్యద’ పేరుతో గొప్ప కావ్యంగా శీకృష్ణదేవరాయలు రచించాడు. అది తెలుగు పంచకావ్యాలలో ఒకటి.
పరమ భక్తాగ్రేసరులైన పన్నెండు మంది వైష్ణవ ఆళ్వార్లలో పెరియాళ్వార్ (శ్రీవిష్ణుచిత్తుడు) ప్రముఖుడు. ఆయన దివ్యదేశమైన శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి పెరుమాళ్‌ను నిత్యం ఆరాధించేవాడు. ఒక తులసి తోటను పెంచుతూ... తులసి దళాలతో మాలలు అల్లి స్వామికి సమర్పించేవాడు. ఒక రోజు ఆ తోటలో దివ్యతేజస్సుతో ముద్దులొలుకుతున్న చిన్నారి ఆయనకు దొరికింది. తులసివనంలో దొరికింది కాబట్టి తులసీదళం అన్నట్టుగా ‘కోదై’ అని ఆమెకు పేరు పెట్టి పెంచుకున్నాడు. పెరియాళ్వార్ ఇల్లు ఎల్లప్పుడూ భాగవతులు, పండితులతో కోలాహలంగా ఉండేది. అలాంటి వాతావరణంలో పెరిగిన కోదైకి భగవంతుని పట్ల ఎనలేని భక్తి ఏర్పడింది. తండ్రి తయారుచేసిన పుష్ప మాలికలను ముందుగా తన మెడలో ధరించి, బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని, ఆ మాలలు బాగున్నాయని సంతృప్తి చెందిన తరువాత... మళ్ళీ పూలబుట్టలో ఉంచేది. భగవంతునికి సమర్పించాల్సిన మాలలను ముందుగానే తన బిడ్డ ధరిస్తోందని తెలుసుకున్న పెరియాళ్వార్ ఆవేదన చెందాడు. ప్రత్యేకంగా మాలలు అల్లి స్వామికి అలంకరించాడు. అప్పుడు వటపత్రశాయి ఆ మాలలను తిరస్కరించి... భక్తితో కోదై ఇచ్చిన పుష్పమాలలే తనకు ప్రీతిపాత్రమని తెలిపాడు. ఆ మాటలకు పరవశించిపోయిన పెరియాళ్వార్... తన బిడ్డ సామాన్యురాలు కాదనీ, తన జీవితాన్ని ధన్యం చెయ్యడానికి వచ్చిన శ్రీమహాలక్ష్మి అనీ గ్రహించాడు. ఆమెను ‘ఆండాళ్’ అని సంబోధించాడు. ‘ఆండాళ్’ అంటే ‘రక్షించడానికి వచ్చిన తల్లి’ అని అర్థం.
ఆండాళ్ భగవత్ తత్త్వాన్ని స్వయంగా అనుభవించి, తనలో కలిగిన భగవద్విరహాన్ని పాశురాల రూపంలో పాడింది. వాటిని ‘నాచ్చియార్ తిరుమొళి’ అంటారు. ఆ తరువాత... సులభంగా భగవంతుణ్ణి చేరడానికి పూర్వులు చేసిన కాత్యాయనీ వ్రతాన్ని చేపట్టింది. రోజుకొక పాటతో... 30 పాటటలతో ‘తిరుప్పావై వ్రతం’ చేసింది. దానికే ‘శ్రీవ్రతం’ అనే పేరు కూడా ఉంది. వ్రతం పూర్తయ్యేనాటికి... ఆమె వరించిన శ్రీరంగనాథుడు శంఖచక్రాలు లేకుండా, శ్రీకృష్ణావతారంలోని గోపబాలకునిలా... గరుత్మంతుడిమీద వడివడిగా శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేశాడు. ఆండాళ్‌ను అనుగ్రహించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. ‘రంగమన్నార్’ పేరిట ప్రసిద్ధుడయ్యాడు. భగవంతుడి ఇల్లాలై... వైకుంఠానికి తరలిపోతున్న తన బిడ్డను విడువలేక పరమ దుఃఃఖంలో ఉన్న పెరియాళ్వార్ బాధ తీర్చడం కోసం... ఆండాళ్‌తో కలిసి విగ్రహ రూపంలో స్వామి అక్కడ వెలిశాడు. అదే సుప్రసిద్ధమైన ఆండాళ్ దేవాలయం. 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటైన శ్రీవిల్లిపుత్తూరు వటపత్రశాయి సన్నిధికి ఎడమవైపున ఆండాళ్ సన్నిధి ఉంటుంది. ఒకే గర్భాలయంలో ఆండాళ్, రంగమన్నార్‌లతో పాటు... స్వామిని అక్కడికి తీసుకువచ్చిన గరుడాళ్వార్ కూడా ఉండడం విశేషం. ఒక చేతితో బెత్తం ధరించి, మరో చేతిని ఆవుపై పెట్టినట్టుగా వంచి, వయ్యారంగా నిలుచున్న రంగమన్నార్, ఆయనకు కుడివైపున... సమ భంగిమలో నిలబడి, ఎడమ చేతిలో చిలుకను, కుడిచేతిని కిందికి వదిలి డోలాహస్తంగాను ఉంచి, తలపైన శిరోజాలను ‘ధమ్మిళ్ళము’ అనే కొప్పుతో అంలంకరించుకొని, సర్వాభరణ శోభితయైు ఆండాళ్ దర్శనమిస్తారు. స్వామికి ఎడమవైపున రెక్కలు కిందికి దించి, అంజలి ముద్రతో రెండు చేతులను జోడించి, తలను కొద్దిగా వంచి, భక్తిప్రపత్తులతో నిలబడిన గరుత్మంతుడు కనిపిస్తాడు.
ఆలయ విశేషాలు
శ్రీవిల్లిపుత్తూరు ఆలయం అద్భుతమైన శిల్పకళా శోభితమై ఉంటుంది. ఆండాళ్, పెరియాళ్వార్ సేవించిన శ్రీవటపత్రశాయి అక్కడ ప్రధాన దైవం. బాలరూపంలో ఆదిశేషునిపై శయనించి ఆకాశంవైపు చూస్తున్న విష్ణువు... బాలకృష్ణుని రూపంలో, పాలుగారే బుగ్గలతో, ఊర్ధ్వ శయనమూర్తిగా దర్శనిస్తారు. ఆలయం ఎదురుగా పాండ్యులు కట్టించిన 192 అడుగుల ఎత్తయిన రాజగోపురం విశేషమైనది. అది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం.
భక్తాగ్రేసరుడు పెరియాళ్వార్
సాక్షాత్తూ భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమయితే ‘‘వద్దు, వద్దు. నాకు కనిపించవద్దు. నా కళ్ళతో నిన్ను చూస్తే... నా దృష్టి దోషం నీకు కలుగుతుందేమో... నువ్వు వెయ్యేళ్ళు, కాదు కాదు... వేనవేల ఏళ్ళు వర్థిల్లాలి. పల్లాండు, పల్లాండు’’ అంటూ భగవంతునికి మంగళాశాసనం చేసిన మహనీయుడు శ్రీవిష్ణుచిత్తుడు. ఆయన మహోన్నతమైన భక్తికి దాసోహమై పొంగిపోయిన స్వామి... పన్నిద్దరు ఆళ్వార్లలో పెద్ద మనుసున్న వాడని ప్రశంసించి ‘పెరియాళ్వార్’ అని సంబోధించారు.
పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలు
రామాయణంలో అయోనిజగా అవతరించిన సీతాదేవిలా... కలియుగంలో తులసివనంలో అవతరించిన ఆండాళ్... ఆర్తులను రక్షించి, వారి కోరికలు తీర్చే కల్పవల్లి. సూర్యమానం ప్రకారం ఆడి మాసం పుబ్బా నక్షత్రం నాడు శ్రీ ఆండాళ్ అవతరించింది. ఆ రోజును ‘తిరువాడిప్పూరం’ అని కూడా పిలుస్తారు. దానికి ముందు 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. వైష్ణవ సంప్రదాయంలోని వివిధ ఆచారాలకు అనుగుణంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. కాగా, శ్రీ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా... శ్రీ విల్లిపుత్తూరు నుంచి శ్రీ ఆండాళ్ ధరించిన పుష్పమాలికలను, చిలుకలను తిరుమలకు తీసుకువచ్చి స్వామికి సమర్పిస్తారు. ఆండాళ్ ధరించిన ఆ మాలికలను శ్రీతిరువేంకటనాథుడు పరమప్రీతిగా ధరిస్తారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగంలోని శ్రీరంగనాథుడికి ఆండాళ్ ధరించిన మాలలను విల్లిపుత్తూరు నుంచి తీసుకువెళ్ళి, ధరింపజేస్తారు. ప్రతి ధనుర్మాసంలో మదురైలోని సుందరబాహు పెరుమాళ్‌కు కూడా ఈ విధంగానే మాలలు వెళ్తాయి. ఇది అనూచానంగా కొనసాగుతున్న సంప్రదాయం. నీళ్ళు వేయకుండా... కేవలం పాలతోనే ఉడికించి తయారు చేసిన ‘అక్కారువడిశల్’ అనే పాల పాయసం ఆండాళ్ ఆలయానికి ప్రత్యేకమైన ప్రసాదం.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..