అనుగ్రహం అనంతం
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:14 AM
శ్రీ మహావిష్ణువు వివిధ ఆలయాల్లో విభిన్నమైన భంగిమలలో దర్శనం ఇస్తాడు. వాటిలో నిలబడి ఉండే స్థానకమూర్తి, కూర్చొని ఉండే ఆసనమూర్తి, పవళించి ఉండే శయనమూర్తి... ఇలా మూడు స్థితుల్లో ఉంటాడు....
తెలుసుకుందాం
నేడు అనంత పద్మనాభ చతుర్దశి
శ్రీ మహావిష్ణువు వివిధ ఆలయాల్లో విభిన్నమైన భంగిమలలో దర్శనం ఇస్తాడు. వాటిలో నిలబడి ఉండే స్థానకమూర్తి, కూర్చొని ఉండే ఆసనమూర్తి, పవళించి ఉండే శయనమూర్తి... ఇలా మూడు స్థితుల్లో ఉంటాడు.
ఈ మూడవ స్థితి అయిన శయనమూర్తులలో పలు రకాలు ఉన్నాయి. ఆ మూర్తులు కొలువైన ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కో విశేషం ఉంది. కొన్ని చోట్ల శంఖు చక్రాలతో, మరి కొన్ని చోట్ల అవి లేకుండా దేవేరులతో, ఇంకొన్ని చోట్ల వివిధ దేవతలతో, అలాగే వారెవరూ లేకుండా కొన్ని చోట... ఇలా రకరకాలుగా స్వామి దర్శనమిస్తాడు. వీటిని శిల్ప ఆగమ శాస్త్రాలు ప్రధానంగా నాలుగు రకాలుగా వర్ణించాయి. అవి యోగ శయనమూర్తి, భోగ శయనమూర్తి, వీర శయనమూర్తి, అభిచారిక శయనమూర్తి. యోగులు యోగమూర్తిని, భోగవాంఛలు కోరేవారు భోగమూర్తిని, శౌర్యాన్ని కోరేవారు వీరమూర్తిని, విజయాన్ని కోరేవారు అభిచారికమూర్తిని ఆరాధించాలని పెద్దలు చెప్పారు. ఈ రూపాల గురించి వివరంగా తెలుసుకుందాం.
యోగ శయనమూర్తి: అనంతాసనం మీద పవళించి ఉన్న మూర్తి కాస్త లేచినట్టుగా కనిపిస్తాడు. మిగిలిన శరీరమంతా పడుకున్నట్టే ఉంటుంది. ఈ మూర్తికి రెండు చేతులు మాత్రమే ఉంటాయి. కుడి చేతిని కిరీటాన్ని తాకేటట్టుగా ఉంచి, ఎడమచేతిని కటక ముద్రలో కానీ, తొడను తాకేటట్టుగా కానీ శరీరానికి సమాంతరంగా ఉంచుతాడు. అర్థనిమీలిత నేత్రుడై (సగం తెరిచిన కళ్ళతో) అనేక అలంకారాలతో, నలుపు, పసుపు రంగులు కలిసిన శరీరఛాయతో ఉంటాడు. ఆయన పక్కన భృగువు, మార్కండేయుడు, పాదాల దగ్గర మధు కైటభులు ఉంటారు. నాభిపద్మంలో చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు. స్వామికి వెనుకవైపు గోడ మీద గరుడుడు, విష్వక్సేనుడు, ఆయుధాలు, బెత్తాలు ధరించినవారు, నమస్కరిస్తున్న సప్త ఋషులు ఉంటారు. గర్భాలయం దక్షిణపు గోడమీద బ్రహ్మ, ఉత్తరపు గోడ మీద శివుడు ఆసన స్థితిలో ఉంటారు. ఇలా దేవతలందరితో కొలువుతీరిన మూర్తిని ‘ఉత్తమ యోగ శయనమూర్తి’ అంటారు.
భోగ శయనమూర్తి: ఈ మూర్తి కూడా యోగ శయనమూర్తిలాగానే కనిపిస్తాడు. కానీ ఎడమకాలిని కాస్త ముడిచి, కుడికాలిని తిన్నగా చాచినట్టు ఉంటాడు. తలవైపున లక్ష్మీదేవి... ఇంచుమించు స్వామి భుజాలను తాకుతున్నట్టుగా ఉంటుంది. ఆమె కుడిచేతిలో పద్మం ఉంటుంది. ఎడమచెయ్యి కటకముద్రతో ఉంటుంది. స్వామి ఎడమకాలి దగ్గర నీలోత్పలాన్ని ధరించిన భూదేవి ఉంటుంది. ఆమె ఎడమచేయి కూడా కటకముద్రతో ఉంటుంది. కుడివైపున మార్కండేయుడు, ఎడమవైపున భృగువు, దక్షిణపు గోడ మీద బ్రహ్మ, ఉత్తరపు గోడమీద శివుడు ఉంటారు. వీరందరూ ఆసన స్థితిలోనే ఉంటారు. స్వామి పాదాల దగ్గర మధు కైటభులు ఉంటారు. బ్రహ్మ నాభి కమలం నుంచి ఆవిర్భవిస్తున్నట్టు ఉంటాడు. అతనికి కుడివైపున ఆయుధాలు ధరించిన అయిదుగురు పురుషులు, గరుడుడు ఉంటారు. గరుడునికి కుడివైపు సూర్యుడు ఉంటాడు. బ్రహ్మకు ఎడమవైపున అశ్వినీ దేవతలు, బాల్య స్థితిలో ఉన్న నారద తుంబురులు, చంద్రుడు ఉంటారు. వీరికి తోడు అష్ట దిక్కుల్లో దిక్పాలకులు, అప్సర స్త్రీలు కనిపిస్తారు. మొత్తంగా దేవ, దేవాంగనలతో కూడిన ఆ భోగ శయనమూర్తిని ‘ఉత్తమ భోగ శయనమూర్తి’ అంటారు.
వీర శయనమూర్తి: ఈ మూర్తికి నాలుగు చేతులు ఉంటాయి. కుడివైపు ఒక చేతిని తలకింద ఉంచుతాడు. వేరొక కుడిచేతిలో చక్రం ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖం ఉంటుంది. మరో చేయి దేహానికి సమాంతరంగా ఉంటుంది. పాదాల దగ్గర మధు కైటభులు, రెండవవైపు లక్ష్మీదేవి భూదేవి ఉంటారు. కుడివైపు మార్కండేయుడు, ఎడమవైపు భృగువు, నాభికమలం నుంచి బయటకు వస్తున్న బ్రహ్మదేవుడు ఉంటారు. వెనుక గోడ మీద అయిదుగురు ఆయుధధారులైన పురుషులు, గరుడుడు, సూర్యచంద్రులు, సప్త ఋషులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అప్సరసలు, తుంబుర నారదులు, ఇద్దరు కిన్నరులు, సనక సనందనాదులు, బ్రహ్మదేవుడు, శివుడు ఉంటారు.
అభిచారిక శయనమూర్తి: రెండు పడగల ఆదిశేషుని తల్పంపై పడుకొన్నట్టు ఈ మూర్తి దర్శనమిస్తాడు. ఆయన కృష్ణవర్ణంలో, రెండు లేదా నాలుగు భుజాలతో ఉంటాడు. పార్శ్వ, పరివార దేవతలు ప్రత్యేకించి ఉండరు. ఈ తరహా మూర్తిని ‘ఉత్తమ అభిచారిక శయనమూర్తి’ అంటారు. ఒకే పడగ ఉన్న పాము చుట్టుకొని ఉన్నట్టయితే ‘మధ్యమ అభిచారిక శయన మూర్తి’ అని, సర్ప తల్పం లేకపోతే ‘అధమ అభిచారిక శయనమూర్తి’ అని అంటారు.
ఈ నాలుగే కాకుండా ఊర్థ్వ శయన, సృష్టి శయన, సంహార శయనమూర్తుల్లాంటి పలు రూపాల గురించి శిల్ప ఆగమ శాస్త్రాలు వివరించాయి. అనంత శయన రూపాలను పూజించే భక్తులకు ఆ స్వామి అనుగ్రహించే వరాలు కూడా అనంతమేననేది భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశిగా జరుపుకొంటారు. ఈ రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్