ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:28 AM
అల్లాహ్ మన మీద నిశ్చయంగా పర్యవేక్షకుడై ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా... అన్నిటికీ ఆయన సాక్షి....
సందేశం
అల్లాహ్ మన మీద నిశ్చయంగా పర్యవేక్షకుడై ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా... అన్నిటికీ ఆయన సాక్షి. మన మాటలు, పనులు, ఉద్దేశాలు... ఇవన్నీ ఆయనకు తెలుసు. అందుకే ప్రతి పనిలో నిజాయితీ, న్యాయబద్ధత, దైవభీతి ఉండాలి. ఎందుకంటే... మనం చేసే తప్పు మనుషుల కళ్ళకు కనిపించకపోయినా అల్లాహ్ దృష్టి నుంచి తప్పించుకోలేవు.
ఒక చిన్న గ్రామంలో అబ్దుల్లా అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో... తల్లి కష్టపడి పెంచింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. అల్లాహ్ మీద ఆమెకు అచంచల విశ్వాసం. ‘‘బిడ్డా! ప్రపంచంలో మనుషులు నిన్ను గమనించకపోవచ్చు. నీ మంచితనాన్ని గుర్తించకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన అల్లాహ్కు నీ ప్రతి పని గురించీ తెలుసు. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అల్లా్హను మరచిపోకు’’ అని ఎప్పుడూ చెబుతూ ఉండేది. అబ్దుల్లా ఒక దుకాణంలో పని చేసేవాడు. లెక్కల్లో పొరపాటు లేకుండా చూసుకొనేవాడు. తోటి పనివారు అతణ్ణి చూసి నవ్వేవారు. ‘‘ఎవరికీ తెలియకుండా కాస్త డబ్బు తీసుకుంటే ఏమౌతుంది?’’ అనేవారు.
ఒక రోజు ఒక ధనవంతుడు సరుకులు కొని, పొరపాటున ఒక సంచిని అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా ఆ సంచి తెరిచి చూశాడు. అందులో చాలా డబ్బు ఉంది. ‘దుకాణంలో నేనొక్కడినే ఉన్నాను. ఈ డబ్బు తీసుకున్నా ఎవరికీ తెలీదు. దీనితో మా అప్పులు తీర్చుకోవచ్చు. ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కోవచ్చు. అనారోగ్యంతో ఉన్న మా అమ్మకు మంచి వైద్యం చేయించవచ్చు...’- ఇలా ఎన్నో ఆలోచనలు అతని మనసులో మొదలయ్యాయి. అంతలోనే ‘నిన్ను సృష్టించిన అల్లాహ్ అంతా చూస్తున్నాడు’ అనే తల్లి మాటలు అబ్దుల్లా చెవుల్లో ప్రతిధ్వనించాయి. వెంటనే ఆ సంచి యజమానిని వెతికి, అతనికి డబ్బు అప్పగించాడు. ‘‘దీన్ని ఎక్కడ వదిలేశానో నాకు గుర్తులేదు. ఇందులో చాలా డబ్బు ఉంది. నువ్వు కావాలంటే తీసుకోవచ్చు. ఎందుకు తిరిగి ఇచ్చావు?’’ అని అడిగాడా వ్యక్తి. ‘‘అయ్యా! నాకు, నా కుటుంబానికి డబ్బు అవసరం ఉంది. కానీ ఇది నా డబ్బు కాదు. నా అవసరాల కోసం ఇతరులకు చెందినదాన్ని దోచుకుంటే.. నా మనస్సాక్షికి ఏ సమాధానం ఇవ్వగలను? నా ప్రభువైన అల్లాహ్ ముందు ఎలా నిలబడగలను?’’ అని చెప్పి వెనుతిరిగాడు అబ్దుల్లా.
కొన్నాళ్ళకు అతని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురయింది. చేతిలో డబ్బు లేదు. సరైన వైద్యం చేయించలేకపోతున్నానని తల్లి దగ్గర కన్నీరు పెట్టుకున్నాడు. ‘‘నాయనా! కష్టాలు వచ్చినప్పుడు సహనం కోల్పోకూడదు. అల్లా్హకు మన పరిస్థితి తెలుసు’’ అని తల్లి అతణ్ణి ఓదార్చింది.
అబ్దుల్లా తల్లి అనారోగ్యం సంగతి అతని యజమానికి తెలిసింది. మరునాడు అబ్దుల్లా దుకాణానికి వెళ్ళినప్పుడు... అతణ్ణి యజమానిని పిలిచి ‘‘తన డబ్బు సంచీ వదిలేస్తే... నువ్వు జాగ్రత్తగా తిరిగి అప్పగించావని ఒక ధనవంతుడు నాకు చెప్పాడు. నీ నిజాయితీ నాకు తెలుసు. నీ తల్లి చికిత్సకు సాయం చేస్తాను. దుకాణం లెక్కల బాధ్యత పూర్తిగా నీకే అప్పగిస్తున్నాను. నీ జీతం కూడా పెంచుతున్నాను’’ అని చెప్పాడు. అబ్దుల్లా సంతోషానికి అవధులు లేవు. యజమాని అందించిన సాయంతో తల్లికి వైద్యం చేయించాడు.
తను నిజాయితీగా ఉండడానికి కారణం జీతం పెరుగుదల కోసమో, ఎవరి ప్రశంసల కోసమే కాదని అతనికి తెలుసు. అల్లాహ్ తనను చూస్తున్నాడన్న విశ్వాసం తప్పు చెయ్యకుండా కాపాడింది. తద్వారా తన నిజాయితీకి ప్రతిఫలం కూడా లభించింది. ‘‘మనిషి నుంచి నిజం దాచవచ్చు. అల్లాహ్ నుంచి ఏదీ దాచలేం’’అని తల్లి చెప్పిన మాటలు రుజువయ్యాని అతను సంతోషించాడు. ‘ప్రపంచం నన్ను చూడకపోయినా, నా ప్రభువు నన్ను చూస్తున్నాడు. ప్రపంచం నా పనిని గుర్తించకపోయినా, నా ప్రభువుకు నా ప్రతి పని తెలుసు.
అందుకే నా జీవితం నిజాయితీతో సాగాలి. నా హృదయం నిరంతరం దైవభీతితో నిండాలి’’ అని అల్లాహ్ను ప్రార్థించాడు.
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన