Share News

శరణాగతే రక్ష

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:01 AM

ఒకనాడు బలరామకృష్ణులు తమ స్నేహితులతో కలిసి... గోవులను తోలుకుంటూ అడవిలోకి బయలుదేరారు. కావడులతో చద్ది అన్నం, తినుబండారాలు కూడా వెంట తీసుకువెళ్ళారు...

శరణాగతే రక్ష

భాగవతం

ఒకనాడు బలరామకృష్ణులు తమ స్నేహితులతో కలిసి... గోవులను తోలుకుంటూ అడవిలోకి బయలుదేరారు. కావడులతో చద్ది అన్నం, తినుబండారాలు కూడా వెంట తీసుకువెళ్ళారు. ఎటుచూసినా పచ్చగా, కనువిందు చేస్తూ ఉంది అడవంతా! ఆవుల అంబా రావాలు, కృష్ణయ్య పిల్లనగ్రోవి పాటలు, నవ్వులు... మందలను మేతకు విడిచిపెట్టిన గోపబాలురు ఆటలాడడం మొదలుపెట్టారు. కోతుల్లా పరుగెత్తి చెట్లెక్కుతున్నారు. దాగుడుమూతలు ఆడుతున్నారు.

గుహ అనుకొని...

వారు వెళుతున్న దారిలో... చాలా పొడవుగా, కొండంత పొట్టతో ఉన్న ఒక కొండ చిలువ... పెద్ద గుహ మాదిరిగా నోరు తెరచుకొని, దారికి అడ్డంగా నిలబడి ఉంది. దాని కింది దవడ నేల మీద ఉంటే... పై దవడ ఆకాశం మీదకు ఉంది. ముందుగా గోపబాలురు నడుస్తూ ఉండే... బలరామకృష్ణులు వెనుక వస్తున్నారు. ‘అదేదో తాము అంతకుముందు చూడని గుహ’ అని గోపబాలురు అనుకున్నారు కానీ... అది కొండచిలువ అనీ, దాని నోట చిక్కితే ప్రాణాలు పోతాయనీ అనుకోలేదు. ఆడుతూ పాడుతూ మందల్ని తోలుకొని దాని నోట్లో ప్రవేశించారు. కానీ ఆ కొండచిలువ వాళ్ళను ఏమీ చెయ్యలేదు. ‘కృష్ణుడు ఎప్పుడెప్పుడు వస్తాడా!’ అని వేచి ఉంది. రాగానే గుటుక్కున మింగుదామని ఎదురు చూస్తోంది. కృష్ణుడు నవ్వుకుంటూ వచ్చాడు. దాని గొంతులోకి దూరాడు. అది కృష్ణయ్యను మింగబోయింది. అది గమనించిన కృష్ణుడు... తన శరీరాన్ని పెంచుకుంటూ పోయాడు. దాంతో ఆ కొండచిలువ గొంతు పూర్తిగా పూడిపోయింది. నోరు మూతపడలేదు. ఊపిరాడలేదు. విలవిలా కొట్టుకుంది. తలపగిలి చచ్చింది.


అపహాస్యానికి మూల్యం

ఆ కొండ చిలువ పూర్వం శంఖుడు అనే రాక్షసుడి కుమారుడు. అతని పేరు అఘుడు. చాలా బలవంతుడు, అందగాడు. దాంతో గర్విష్టిగా తయారయ్యాడు. ఒకసారి అతను మలయాద్రికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న అష్టావక్రుణ్ణి అపహాస్యం చేశాడు. దాంతో. ‘కొండ చిలువవై బతుకు’ అని అష్టావక్రుడు శపించాడు. అఘుడు పశ్చాత్తాపంతో బతిమాలగా... ‘కృష్ణుడు కరుణిస్తాడులే, పో!’ అని చెప్పాడు. అప్పటి నుంచి కృష్ణయ్య కోసం అఘుడు ఎదురుచూస్తున్నాడు. కాలక్రమంలో బృందావనానికి చేరుకొని, కృష్ణుడి అనుగ్రహం పొందాడు. అదీ కథ.

అంధకారంలో చిక్కి...

అఘాసురుడి నోటిలోకి ప్రవేశించిన బాలకులకు కొండచిలువ రూపంలోని ఆ రాక్షసుడి నాలుక ఎర్రగా, మెత్తగా ఉన్న తివాచీలా, సుతిమెత్తని శయ్యలా సుఖంగా అనిపించింది. కోరలు తెల్లని పర్వతాల్లా కనిపించాయి. బాగా ఆడుకోవచ్చని అనుకున్నారు. జీవుని సంసార వ్యామోహం కూడా అలాగే అనిపిస్తుంది. అంతా భ్రమ. లోపలికి వెళ్ళిన కొద్దీ ఆశల సంకెలలు, బంధాల బాధ, సంసారపు లోతు తెలుస్తాయి. అప్పటికే గాడాంధకారంలో చిక్కుకుపోయి ఉంటాం. కానీ గోపబాలురిలా ‘మా వెనుక జగదేక వంద్యుడు, జగదోద్ధారకుడు అయిన కృష్ణుడు ఉన్నాడు. ఆయనే మాకు దిక్కు’ అని విశ్వాసంతో నమ్మి శరణు వేడితే... ఆయన తప్పకుండా రక్షిస్తాడు.

ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 06 , 2026 | 06:01 AM