Share News

ఆత్మవిశ్వాసానికి రోల్‌‘మోడల్‌’

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:36 AM

అబోలీ జరిత్‌... విధితో ఆమె పోరాటం పుట్టుకతోనే మొదలైంది. గాల్‌ బ్లాడర్‌ లేకపోవడం, కిడ్నీ సమస్యలతో ఆమె ఎదుగుదల ఆగిపోయింది. వరుస శస్త్రచికిత్సలు, అవహేళనలు....

ఆత్మవిశ్వాసానికి రోల్‌‘మోడల్‌’

అబోలీ జరిత్‌... విధితో ఆమె పోరాటం పుట్టుకతోనే మొదలైంది. గాల్‌ బ్లాడర్‌ లేకపోవడం, కిడ్నీ సమస్యలతో ఆమె ఎదుగుదల ఆగిపోయింది. వరుస శస్త్రచికిత్సలు, అవహేళనలు... అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. దేశంలో మొదటి వీల్‌ఛైర్‌ మోడల్‌గా, గాయనిగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా ప్రతిభను చాటుతున్నారు. రాష్ట్రపతి నుంచి పురస్కారాన్ని అందుకొని... విజయానికి వైకల్యం అడ్డు కాదని నిరూపించారు.

మూడు నెలల వయసులోనే... అబోలీ జరీత్‌ చావు అంచుల వరకూ వెళ్ళారు. ఆమెకు తీవ్రమైన అనారోగ్యం రావడంతో తల్లితండ్రులు వైద్య పరీక్షలు చేయించారు. గాల్‌ బ్లాడర్‌ లేకపోవడంతో మూత్రం బయటికి వచ్చే మార్గాన్ని సృష్టించడం కోసం శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఆమెకు ‘రీనల్‌ రికెట్స్‌’ అనే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. ఆ తరువాత చాలాకాలం ఆసుపత్రుల్లో ఉండాల్సి వచ్చింది. ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి. ఆమె కుటుంబం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడింది. ‘‘ఈ పిల్ల మీకు భారం. ఎందుకు ఇంకా వైద్యం చేయించడం?’’ అంటూ బంధుమిత్రుల అవహేళనలు, బడిలో చేరిస్తే తోటి పిల్లల వేధింపులు... ఎన్ని సమస్యలు ఎదురైనా అబోలీ తల్లిదండ్రులు ఆశ కోల్పోలేదు. ఆమెను బతికించడానికి చేయని ప్రయత్నం లేదు.

మూస ఆలోచనల్ని బద్దలుగొట్టి...

ఎనిమిదేళ్ళ వయసు వచ్చేసరికి అబోలీ పరిస్థితి మరింత దిగజారింది. ఆమెలో ఎదుగుదల ఆగిపోయింది. ఎముకలు బాగా బలహీనపడడంతో నడవడం బాగా కష్టమయింది. చివరికి ఇంటినుంచే చదువు కొనసాగించాల్సి వచ్చింది. పదో ఏట కాలు ఫ్రాక్చర్‌ కావడంతో... ఇక ఆమె నడవడం అసాధ్యమని వైద్యులు చెప్పేశారు. ‘‘అందరికీ నా మనుగడ మీద సందేహమే. కానీ మా అమ్మ మాత్రం ‘‘కదలలేకపోయినంత మాత్రాన అధైర్యపడకు. ఏదైనా లక్ష్యం పెట్టుకో. నీకున్న పరిమితులలోనే దాన్ని నెరవేర్చుకొనే ప్రయత్నం చెయ్యి’’ అని చెప్పేది. ఆమె ప్రోత్సాహంతోనే సంగీతం నేర్చుకున్నాను. నాగపూర్‌లో జరిగిన ఒక టాలెంట్‌ షోలో పాల్గొన్నాను. ఆ తరువాత ‘ఇండియన్‌ ఐడల్‌’కు వెళ్ళాను. గెలవడానికి కాదు, నా కథ లోకానికి వినిపించడానికి. నా శరీరాన్ని, నా వైకల్యాన్ని చూసి కాదు, నా గొంతును విని నేనేమిటనేది ప్రపంచం జడ్జ్‌ చెయ్యాలి’’ అని చెప్పారు అబోలీ. అక్కడ ఆమె ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆమె కథ కన్నీళ్ళు పెట్టించింది. స్ఫూర్తి కలిగించింది. ఈ అనుభవం అబోలీ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అప్పుడే ఆమె దృష్టి మోడలింగ్‌ మీద పడింది. అందంగా ఉండాలి, అవయవ సౌష్టవం బాగుండాలి. ఇవి మోడల్‌కు ఉండాల్సిన కనీస అర్హతలు అనేది మన మనసుల్లో బాగా స్థిరపడిపోయింది. భారతదేశపు మొదటి వీల్‌ఛైర్‌ మోడల్‌గా మారి... ఆ మూస ఆలోచనలను ఆమె బద్దలుగొట్టారు. ‘‘నేను ఊహించని స్థాయిలో విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రేరణ కలిగించేలా ప్రసంగించాల్సిందిగా పలు సంస్థలు ఆహ్వానించడం ఆరంభించాయి.


మధుర జ్ఞాపకం...

‘‘మోటివేషనల్‌ స్పీకర్‌గా ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనమే ప్రేరేపించుకొని లక్ష్యాలను అందుకోవాలని సూచిస్తాను’’ అని చెబుతున్న అబోలీ... 2022లో ‘ట్రూలీ బోర్న్‌ డిఫరెంట్‌’ అనే బ్రిటిష్‌ డాక్యుమెంటరీలో నటించారు. ఆ తరువాత ఖుర్దిస్తాన్‌ నేషనల్‌ టీవీలో, డాక్యుమెంటరీలలో కనిపించారు. ‘ఇండియన్‌ ఐడల్‌’తో పాటు ‘సారేగామా లిటిల్‌ ఛాంప్స్‌’ లాంటి సింగింగ్‌ కాంపిటిషన్లలో పాల్గొన్నారు. 2021లో ‘మిస్‌ వీల్‌ఛైర్‌ ఇండియా’ ఫైనలిస్ట్‌. అలాగే ‘ఇండియన్‌ దివ్యాంగ గ్లామర్‌ అవార్డు’ను 2023లో అందుకున్నారు. ‘‘కిందటి ఏడాది డిసెంబర్‌ చివర్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘నేషనల్‌ అవార్ట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలీటీ- 2025’ను స్వీకరించడం నా జీవితాంతం గుర్తుంచుకొనే జ్ఞాపకం. నాకున్న ఆరోగ్య సమస్యలతో ప్రతిరోజూ ఒక సవాలే. నా అభిరుచులతో పాటు చదువునూ కొనసాగిస్తున్నాను. వైకల్యాలు ఉన్నాయని ఆత్మన్యూనత, నిస్పృహ చెందనక్కర్లేదు. చేసే పనిపట్ల అంకితభావం, నిబద్ధత ఉంటే గెలుపు, గుర్తింపు తప్పకుండా వస్తాయి’’ అంటున్నారు 22 ఏళ్ళ అబోలీ.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

Updated Date - Feb 18 , 2026 | 05:37 AM