ఆరోన్ మా వరం
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:58 AM
మహమ్మద్ సిరాజ్... తిలక్ వర్మ... హైదరాబాద్ నుంచి అంతటి సత్తా ఉన్న మరో క్రికెటర్... ఆరోన్ జార్జ్. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ సెమీస్‌లో సెంచరీతో అదరగొట్టి... భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు...
సంకల్పం
మహమ్మద్ సిరాజ్... తిలక్ వర్మ... హైదరాబాద్ నుంచి అంతటి సత్తా ఉన్న మరో క్రికెటర్... ఆరోన్ జార్జ్. ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ సెమీస్‌లో సెంచరీతో అదరగొట్టి... భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సీనియర్ జట్టు తలుపు తడుతున్నాడు. ఇది ఆరోన్ ఒక్కడి విజయం కాదు... అతడి తల్లి ప్రీతి వర్గీస్‌ది కూడా. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి... విశ్వవిజేతగా నిలిచేవరకు... అతడి పట్టు వదలని కృషిని, తాము పడిన కష్టాన్ని ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘నేను మ్యాథ్స్ టీచర్‌ని. మాది కేరళ మూలాలు ఉన్న తెలుగు కుటుంబం. ఆరోన్ మా చిన్నాబ్బాయి. క్రికెట్ గురించి నాకు టెక్నికల్‌గా ఏమీ తెలియదు. అయితే మావారు ఇసో వర్గీస్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్. ఆయన హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లు, క్లబ్ క్రికెట్‌లో బాగా ఆడేవారు. ఆయన ఆట చూసేదాన్ని. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో మామయ్యగారి అనంతరం ఇంటి బాధ్యతలు మొత్తం ఇసోనే చూసేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన ఆటకు దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో 1995 నుంచి 2008 వరకు సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేశారు. వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో, 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక కార్పొరేట్ సంస్థలో చేరారు. ఆరోన్‌కి మూడున్నరేళ్ల వయస్సులో ఒకసారి అతడికి మా బంధువులు ప్లాస్టిక్ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆ బ్యాట్‌తో ఇంట్లో సరదగా క్రికెట్ ఆడుతుండగా వాళ్ల నాన్న ఒకసారి బౌలింగ్ చేశారు. ఎదుర్కొన్న తొలి బంతినే ఆరోన్ స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. సాధారణంగా ఆ వయసులోని పిల్లలు బంతి వేస్తే బ్యాట్‌తో అడ్డంగా కొడతారు కానీ స్ట్రయిట్ డ్రైవ్ ఆడరని, అతడిలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని, వాడిని క్రికెట్‌లో ప్రోత్సహిద్దామని ఇసో నాతో చెప్పారు. నేను సరే అన్నాను. అయితే మాకు తెలిసిన చాలా మంది ఎందుకు చదవును నిర్లక్ష్యం చేస్తూ అతడిని క్రికెట్ ఆడిస్తున్నారని విమర్శించారు. మేము అవేమి పట్టించుకోలేదు.
‘నాలుగేళ్ల పిల్లోడికి శిక్షణా?’
ఆరోన్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడు. కానీ క్రికెట్‌పై వాడికి ఉన్న ఆసక్తిని గమనించి, కోచింగ్ ఇప్పించాలని అనుకున్నాం. ఇద్దరు, ముగ్గురి దగ్గరకు వెళ్తే... ‘నాలుగేళ్ల పిల్లోడికి కోచింగా? దెబ్బలు తగిలితే తట్టుకోలేడ’ని తిరస్కరించారు. ఆఖరికి కోచ్ సుభాష్ వాడికి శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆయన నేతృత్వంలో ఆరోన్‌కు గట్టి పునాది పడింది. సుభాష్ దగ్గర నాలుగేళ్ల శిక్షణ అనంతరం ఆయన సలహాతో అడ్వాన్స్‌డ్ కోచింగ్ కోసం హెచ్‌సీఏ క్యాంప్‌లో వేశాం. అక్కడ అందరూ 14 నుంచి 16 ఏళ్ల పిల్లలే. ఆరోన్ ఒక్కడే ఎనిమిదేళ్ల అబ్బాయి. అండర్-16 క్యాంప్‌లో తీసుకోవడానికి మొదట సందేహించినా, నెట్స్‌లో వాడి బ్యాటింగ్ చూసి కాదనలేకపోయారు. ‘కచ్చితంగా ఒకరోజు ఇండియాకి ఆడతాడ’ని వాండర్స్, మోజెస్ సర్‌లు క్యాంప్‌లోకి తీసుకున్నారు. మూడేళ్లపాటు అక్కడే శిక్షణ. తరువాత 2017 నుంచి వీజే అకాడమీలో బీసీసీఐ లెవల్-3 కోచ్ బీజూ నాయర్ క్యాంపులో చేరాడు. ఆయన శిష్యరికంలో మణికట్టుతో షాట్లు కొట్టడంలో మెళకువలు నేర్చుకున్నాడు. అది తన కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రస్తుతం టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ శిక్షణలో సాధన చేస్తున్నాడు.
పండుగ రోజుల్లో కూడా...
ఆరోన్‌ను రోజూ కోచింగ్ అకాడమీకు తీసుకువెళ్లేదాన్ని. ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ మానేవాడు కాదు. ఆఖరికి పండుగలు, సెలవు రోజుల్లో కూడా విశ్రాంతి తీసుకునేవాడు కాదు. అతడి కోసం మేము కూడా మా దినచర్యలను మార్చుకున్నాం. పార్టీలు, బయట డిన్నర్‌లు.. వేటికీ వెళ్లేవాళ్లం కాదు. మా పెద్దమ్మాయి అనన్య లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆరోన్ చిన్నప్పుడు తన పుస్తకాలను వెంట తెచ్చుకొని, మైదానంలోనే చదువుకునేది. వాడికి పరీక్షలప్పుడు కోచింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయంలో పాఠాలు చెప్పేవాళ్లం. ఏదైనా ఒక్కసారి చెబితే చాలు... ఇట్టే పట్టేసేవాడు. ఆటలో ఎంత బిజీగా ఉన్నా ఏనాడూ చదువును నిర్లక్ష్యం చేయలేదు.
మలుపు తిప్పిన ట్రిపుల్...
2022 ఆరోన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ ఏడాది అండర్-16 టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టుకు ఆరోన్ కెప్టెన్. టోర్నీలో బిహార్‌పై ట్రిపుల్ సెంచరీ (303) కొట్టాడు. ఆ ఇన్నింగ్స్ చూసిన బీసీసీఐ స్కౌటింగ్ బృందం తనను బెంగళూరులోని బీసీసీఐ ఎక్స్‌లెన్స్ సెంటర్‌కు పంపించింది. తరువాత వాడిని అండర్-16 నుంచి అండర్-19లోకి మార్చారు. 2024లో జరిగిన అండర్-19 మ్యాచ్‌ల్లో ఐదు 50లు కొట్టి, హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ ప్రదర్శనతో అండర్-19 వరల్డ్‌క్‌పలో చోటు లభిస్తుందని అనుకున్నాం. కానీ దక్కలేదు. మేమంతా చాలా బాధపడ్డాం.

చరిత్రాత్మక విజయం...
ఆ తర్వాత వరల్డ్‌కప్ సన్నాహకాల కోసం బీసీసీఐ ఇంటర్ ఎన్‌సీఏ టోర్నీ నిర్వహించింది. అందులో ఆరోన్ పెద్దగా రాణించలేదు. అదే సమయంలో ఓపెనర్లగా వైభవ్ సూర్యవంశీ, ఆయూష్ మాత్రే అద్భుతంగా ఆడి, అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆరోన్‌కు కష్టమే అనుకున్నాం. ఆ వెంటనే జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో 373 పరుగులు చేసి 90 ఏళ్ల హెచ్‌సీఏ చరిత్రలో తొలిసారి హైదరాబాద్‌కు కప్ అందించాడు. ఆరోన్ కెప్టెన్సీ, బ్యాటింగ్ శైలి నచ్చి.. అండర్-19 చాలెంజర్స్ ట్రోఫీ, అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ట్రై సిరీ్‌సలో ఇండియా-బి జట్టుకు కెప్టెన్ చేశారు. అందులో అదరగొట్టడంతో అండర్-19 ఆసియా కప్‌నకు కెప్టెన్‌గా నియమించారు. ఆ టోర్నీలో మంచి ప్రదర్శన ఇవ్వడంతో కుర్రాళ్ల ప్రపంచ కప్ జట్టులో స్థానం ఖాయమైంది.
అదరడు... బెదరడు...
ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆరోన్ అదరడు.. బెదరడు. అదే అతడి బలం. జయాపజయాలను ఒకేలా స్వీకరిస్తాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వాడి హెల్మెట్‌కు బంతి తగలడంతో కూలబడ్డాడు. టీవీలో చూస్తున్న నేను కంగారుపడిపోయా. తను మాత్రం వెంటనే తేరుకొని బ్యాటింగ్ చేశాడు. ఇక ప్రపంచ కప్ సెమీ్‌సనాడు నేను ఎంతో ఉత్కంఠకు లోనయ్యాను. ఆ మ్యాచ్‌లో ఆరోన్ సెంచరీ కొట్టడం, భారత్ మ్యాచ్ గెలవడం... నిజంగా మరిచిపోలేని అనుభూతి. భారత సీనియర్ జట్టులో వాడిని చూడాలన్నది నా కల. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశిస్తున్నా.’’
ఎస్.ఎస్.బి.సంజయ్
ఫొటోలు: జి.శ్రీనివాస్
అమ్మనాన్న అండతో...
దేశానికి ప్రపంచ కప్ అందించాలనే నా చిన్ననాటి కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. రోజూ తెల్లవారుఝాము నాలుగున్నరకు లేచేవాడిని. నాకంటే మా అమ్మ అరగంట ముందు నిద్ర లేచేది. నాన్నకు, నాకు వేర్వేరు వంటలు వండి, బాక్సులు కట్టేది. బడికి సరిగ్గా వెళ్లకపోయినా చదువులో వెనపడలేదంటే... అందుకు కారణం అమ్మ.
- ఆరోన్ జార్జ్
కష్టమే కానీ ఇష్టంగా...
నేను ఇంటి పనులు చక్కపెట్టుకొని, వాడిని కోచింగ్‌కు తరువాత స్కూల్‌కు తీసుకెళ్లడం, తిరిగివచ్చి ట్యూషన్స్ చెప్పడం... కష్టంగానే ఉండేది. కానీ ఇష్టంగా చేశాను. ఇప్పుడు ఆరోన్ క్రికెటర్‌గా జాతీయ జట్టులో రాణిస్తుంటే ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. వాడు మాకు దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తున్నాం.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్