Share News

Journey Of Nalini And Damodaran: అందరి బంధువులు

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:32 AM

వీధుల్లో విశ్రమించేవారు... ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యేవారు... ఏ దిక్కూ లేక బతుకు భారంగా మారినవారికి ఆధారం ఆయ్యారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపి... అణగారిన కుటుంబాల...

Journey Of Nalini And Damodaran: అందరి బంధువులు

సంకల్పం

వీధుల్లో విశ్రమించేవారు... ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యేవారు... ఏ దిక్కూ లేక బతుకు భారంగా మారినవారికి ఆధారం ఆయ్యారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపి... అణగారిన కుటుంబాల పిల్లలకు విద్య, విలువలు నేర్పి... చక్కని భవితను అందిస్తున్నారు... నళిని, దామోదరన్‌ దంపతులు. మూడున్నర దశాబ్దాలుగా జీవితాన్ని సేవకే అంకితం చేసి... తమ చుట్టూవున్న సమాజ అభ్యున్నతి కోసం సొంత నిధులను వెచ్చిస్తున్న ఈ అందరి బంధువుల ప్రయాణం... నళిని మాటల్లోనే.

‘‘ఇప్పుడు మావారు దామోదర్‌కు డెభ్బై రెండేళ్లు. నాకు అరవై ఏడు. పెళ్లయిన నాటి నుంచీ మా ఇద్దరి అభిప్రాయాలూ ఒక్కటే... సామాజిక సేవలో. అయితే దీన్ని మేం సేవగా అనుకోలేదు. అది మా జీవన విధానంలో భాగంగా భావించాం. ముప్ఫై ఏళ్ల కిందట మొదలైంది మా ఈ ప్రయాణం. తమిళనాడు రాష్ట్రం... దిండిగల్‌ మా స్వస్థలం. మావారు దామోదరన్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌. రియల్టర్‌ కూడా. రైతు బిడ్డ. ఓ స్నేహితుడి సాయంతో 1982లో సీఏ పూర్తి చేసిన ఆయన... రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. అందులో మంచి లాభాలు రావడంతో... ఆ రంగంపై మరింత దృష్టి సారించారు. కొన్నేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకొంటే... ఈ ప్రయాణంలో తనకు ఎంతో ఇచ్చిన ఈ సమాజం గురించి ఆలోచించడం మరిచిపోయానని ఆయనకు అనిపించింది. అదే సేవ వైపు నడిపించింది. మా పెళ్లి తరువాత తన ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఇరువురి అభిప్రాయాలూ కలవడంతో... నేను కూడా ఆయన మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నాను.


44-navya.jpg

రోజూ వందమందికి...

అది 1990. మావారు బిజినెస్‌ పని మీద తరచూ వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఎక్కడికి వెళ్లినా ఆయన్ను బాగా ఆలోచింపజేసిన అంశం... బిచ్చగాళ్లు. ఇంత అన్నం కోసం అభ్యర్థించడం, వారిలో చాలామంది మానసిక రోగులు కూడా ఉండడం చూసి బాధపడ్డారు. ఇంటికి వచ్చాక కూడా వారి గురించి మాట్లాడేవారు. చివరకు ఒకరోజు అనుకున్నాం... వాళ్లందరి ఆకలి తీర్చాలని. నాటి నుంచి మా పట్టణంలోని ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వీధుల్లోని బిచ్చగాళ్లు, అనాథలు, ఏ ఆధారం లేని వృద్ధులకు కడుపు నిండా భోజనం పెడుతున్నాం. ప్రతిరోజూ వందమందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాం. చాలా సంవత్సరాలు నేను వండి, ప్యాకింగ్‌ చేసేదాన్ని. ఆయన తన స్కూటర్‌పై పెట్టుకుని పంపిణీ చేసేవారు. తరువాత ఒక వంటమనిషిని, డెలివరీ కోసం కొంతమంది హెల్పర్స్‌ను పెట్టుకున్నాం.


444-navya.jpg

ఫ్యామిలీ కౌన్సెలింగ్‌...

కొన్నాళ్ల తరువాత మేం ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కూడా ప్రారంభించాం. ఎందుకంటే... చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న మహిళలు మానసిక ఒత్తిడికి లోనై భవిష్యత్తును అంధకారం చేసుకొంటున్నారు. ఇలాంటివి ఎన్నో నా దృష్టికి వచ్చాయి. అలాంటివారిని గుర్తించి, కౌన్సెలింగ్‌ ఇస్తున్నాను. దైర్యం చెప్పి, వృత్తివిద్యలు నేర్పించి, ఉపాధి మార్గాలు చూపిస్తున్నాను. దీనివల్ల చాలామందికి ప్రయోజనం చేకూరింది. నేను ఎకనామిక్స్‌లో డిగ్రీ చదివాను. టైలరింగ్‌లో డిప్లమా కూడా పూర్తయింది. ఇన్నేళ్లుగా ఈ మార్గంలో నడవడంవల్ల విభిన్న పరిస్థితులు, మనుషులు, వారి స్థితిగతులపై ఒక అవగాహన ఏర్పడింది. అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా నాలుగు నెలల టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ కోర్సును తయారు చేశాను. 2018 నుంచి విడతలవారీగా ఉచిత శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటికి 28 బ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఒక్కో బ్యాచ్‌కు ఇరవై మంది మహిళలు ఉంటారు. ఏదిఏమైనా... వేరొకరి అవసరం తీర్చడం, జీవితాన్ని నిలబెట్టడానికి మించిన ఆత్మసంతృప్తి మరెందులోనూ లభించదు. ఆ సంతృప్తి, సంతోషమే మాకు పిల్లలు లేరన్న లోటు కూడా తెలియకుండా చేస్తోంది.’’

ఉత్తీర్ణత పెరిగింది...

ఉచిత భోజన పంపిణీతో మొదలైన మా సేవను క్రమంగా మరిన్ని రంగాలకు విస్తరించాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్టేషనరీ అందించాం. ఆ సమయంలో పాఠశాలలను సందర్శించినప్పుడు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనించాం. కొన్ని స్కూళ్లకు బెంచీలు ఇచ్చాం. అలాగే చదువులో విద్యార్థులను ప్రోత్సహించేందుకు 400 మార్కులు దాటినవారికి ఫీజులో యాభై శాతం మేమే చెల్లిస్తామని ప్రకటించాం. అది అద్భుత ఫలితాలను ఇచ్చింది. అనూహ్యంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గింది.

ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 05 , 2026 | 02:32 AM