Share News

నానీస్‌ నాస్తా.. నూరేళ్ల స్ఫూర్తి!

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:02 AM

వయసు 98.. ఆశయం అంబరమంత. అహ్మదాబాద్‌కు చెందిన ప్రభావతి భగవతి ‘నానీస్‌ నాస్తా’ విజయగాధ ఇది. భర్త మరణం మిగిల్చిన ఒంటరితనాన్ని పారదోలి, ముడతలు పడిన చేతులతోనే...

నానీస్‌ నాస్తా..  నూరేళ్ల స్ఫూర్తి!

వయసు 98..

ఆశయం అంబరమంత. అహ్మదాబాద్‌కు చెందిన ప్రభావతి భగవతి ‘నానీస్‌ నాస్తా’ విజయగాధ ఇది. భర్త మరణం మిగిల్చిన ఒంటరితనాన్ని పారదోలి, ముడతలు పడిన చేతులతోనే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ బామ్మ ప్రయాణం ప్రతి ఒక్కరికీ అద్భుత పాఠం.

జీవితంలో 60 ఏళ్లు దాటగానే విశ్రాంతి తీసుకోవడం ఒక సామాజిక ఆనవాయితీ. కానీ, శరీరం సహకరించకపోయినా, మనసులో సంకల్పం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని అహ్మదాబాద్‌కు చెందిన 98 ఏళ్ల ప్రభావతి భగవతి నిరూపిస్తున్నారు. 2017లో తన జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత ఆమె జీవితంలో ఏర్పడిన శూన్యం సామాన్యమైనది కాదు. 68 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం తెగిపోవడంతో ఆ ఒంటరితనం ఆమెను కుంగదీసింది. పిల్లలు, మనవలు తమతమ బాధ్యతల్లో స్థిరపడిపోయారు. అప్పటి వరకు తన కుటుంబం కోసం వండిపెట్టడమే ప్రపంచంగా బతికిన ఆ బామ్మకు ఒక్కసారిగా వంటగది నిశ్శబ్దంగా మారిపోయింది. తన ప్రేమను వంట ద్వారా పంచే అలవాటున్న ఆమెకు ఆ ఖాళీ సమయం ఒక సవాలుగా నిలిచింది. కానీ, ఆ ఒంటరితనాన్నే పెట్టుబడిగా మార్చుకుని 91 ఏళ్ల వయసులో సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అదే నేడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నానీస్‌ నాస్తా’.

వ్యాపారానికి పునాది వేసిన ‘ఖాండ్వీ’

ప్రభావతి ఈ అసాధారణ ప్రయాణం ఒక అనుకోని సంఘటనతో మొదలైంది. ఒక సాదాసీదా టీ పార్టీలో ఆమె తయారుచేసిన గుజరాతీ వంటకం ‘ఖాండ్వీ’ని ఒక అతిథి రుచి చూశారు. ఆ రుచికి ఫిదా అయిన వారు.. తమ ఇంట్లో జరిగే వేడుకులకు కూడా అదే వంటకాన్ని చేసిపెట్టమని కోరారు. ఉచితంగా కాకుండా అందుకు తగిన ప్రతిఫలం చెల్లిస్తామని పట్టుబట్టారు. దీంతో 91 ఏళ్ల వయసులో వ్యాపారం చేయడం అవసరమా అని మొదట సంకోచించినా, ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక ఆమె ఆ ఆర్డర్‌ను అంగీకరించారు. అలా ఒక చిన్న ఆర్డర్‌తో మొదలైన ఆమె ప్రయాణం అనతికాలంలోనే ఒక బ్రాండ్‌గా ఎదిగింది. 2018లో అధికారికంగా ‘నానీస్‌ నాస్తా’ పేరుతో ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఇంటి వంటగది నుంచే ఈ రుచికరమైన ప్రయాణం సాగుతోంది.


రుచుల భాండాగారం

ప్రభావతి వంటల్లో స్వచ్ఛత, నాణ్యతతోపాటు అమ్మమ్మ చేతి వంట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె కేవలం గుజరాతీ వంటకాలకే పరిమితం కాలేదు. ముంబై వీధుల్లో దొరికే వడాపావ్‌, సేవ్‌పూరి వంటి తినుబండారాలను కూడా ఆమె ఎంతో నేర్పుగా తయారుచేస్తారు. వీటితోపాటు ఢోక్లా, థెప్లా, భాక్రీ, పావ్‌బాజీ వంటి వంటకాలు ఆమె మెనూలో ప్రధానంగా ఉంటాయి. ఒకప్పుడు కేవలం ఒక్క కస్టమర్‌తో ప్రారంభమైన ఈ ప్రస్థానం నేడు అహ్మదాబాద్‌లోని 200 కుటుంబాలకు చేరువైంది. తన వంటల ద్వారా ఆమె వేలాదిమంది హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, సోషల్‌ మీడియాలో కూడా ఒక వైరల్‌ స్టార్‌గా ఎదిగారు. గతంలో ఒక భార్యగా, తల్లిగా మాత్రమే పరిచయం ఉన్న ఆమె ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

స్ఫూర్తిదాయక సెకండ్‌ ఇన్నింగ్స్‌

వృద్ధాప్యం అంటే బాధ్యతల నుంచి తప్పుకోవడం కాదు.. మళ్లీ కొత్తగా ప్రారంభించడం అని ప్రభావతి నిరూపిస్తున్నారు. వయసు మళ్లిన తర్వాత చాలామంది తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తారు. కానీ ప్రభావతి తన వయసును లెక్కచేయకుండా ప్రతిరోజు వంటగదిలో గరిటె తిప్పుతూ ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ వయసులో ఆమె పడుతున్న శ్రమను చూసి ముచ్చటపడనివారు ఉండరు. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన ఉంటే దానికి వయసుతో సంబంధం లేదని, మనలోని నైపుణ్యమే మనకు తోడుగా నిలుస్తుందని ఆమె నిరూపిస్తున్నారు. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు ఆమె జీవితం ఒక గొప్ప పాఠం. తనకున్న వంట నైపుణ్యాన్ని వ్యాపారంగా మార్చుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముడతలు పడిన ఆ చేతులు నేడు రుచికరమైన ఆహారాన్ని మాత్రమే కాకుండా, అంతులేని స్ఫూర్తిని కూడా పంచుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 06:02 AM