స్కేటింగ్‌లో నయా చరిత
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:35 AM
పరాగ్వే వేదికగా అక్టోబర్ 2న ప్రారంభమయ్యే ‘ప్రపంచ స్కేట్ గేమ్స్’లో భారత్ తరఫున బరిలోకి దిగుతోంది 15 ఏళ్ల తెలుగమ్మాయి మండెపూడి చరితశ్రీ. ఐదేళ్ల వయసులోనే స్కేటింగ్‌వైపు అడుగులేసి.
విజేత
పరాగ్వే వేదికగా అక్టోబర్ 2న ప్రారంభమయ్యే ‘ప్రపంచ స్కేట్ గేమ్స్’లో భారత్ తరఫున బరిలోకి దిగుతోంది 15 ఏళ్ల తెలుగమ్మాయి మండెపూడి చరితశ్రీ. ఐదేళ్ల వయసులోనే స్కేటింగ్‌వైపు అడుగులేసి.. కఠోర సాధనతో ఆసియా గేమ్స్ మెడలిస్టులను సైతం ఓడించి స్వర్ణం సాధించిన చరిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ టోర్నీకి సిద్ధమవుతున్న వేళ.. తన పదేళ్ల స్కేటింగ్ ప్రయాణంలోని విజయాలు.. ఎదుర్కొన్న సవాళ్లను ‘నవ్య’తో పంచుకుంది.
మాది హైదరాబాద్‌లోని బాచుపల్లి. ప్రపంచ స్కేట్ గేమ్స్‌లో భారత్ తరఫున ఇన్‌లైన్ స్పీడ్ స్కేటింగ్‌లో 10 కిలోమీటర్ల రోడ్ రేస్, 10 కిలోమీటర్ల ఎలిమినేషన్ రేస్‌లో పోటీ పడుతున్నా. అక్టోబర్ 2వ తేదీ నుంచి పరాగ్వేలో ఈ పోటీలు జరగనున్నాయి. సుమారు వంద దేశాల నుంచి పది వేల మందికి పైగా స్కేటర్లు 23 విభిన్న క్రీడా విభాగాల్లో పోటీ పడుతున్నారు. అంతటి మహత్తరమైన, విస్తృత వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని గుండెలపై మోస్తూ బరిలోకి దిగబోతున్నందుకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది.
తొలి ప్రయాణంలోనే ఓటమి
ఐదేళ్ల వయసులోనే స్కేటింగ్‌పై నాకు మక్కువ కలిగింది. ఖరీదైన క్రీడ అయినా నా ఆసక్తిని గుర్తించిన నాన్న సతీశ్‌రెడ్డి నన్ను శిక్షణలో చేర్పించారు. అలా ఐదేళ్ల ప్రాయంలో మొదలైన నా స్కేటింగ్ ప్రస్థానం పదేళ్లు గడిచేసరికి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరుకుంది. శిక్షణ ప్రారంభించిన రెండో ఏడాది నుంచి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని, పతకాలు సాధించాను. 2016లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో రెండు స్వర్ణాలు కైవసం చేసుకున్నా. అయితే, రాష్ట్రస్థాయిలో మాత్రం తొలి ప్రయత్నంలో పరాజయం వెక్కిరించింది. ఆ తర్వాతి ఏడాది రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్యం గెలిచాను. అక్కడ నుంచి ప్రతి ఏడాది జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఐదారు పతకాలు సాధిస్తూనే ఉన్నా. ఎస్‌జీఎ్‌ఫఐ క్రీడల్లో 2023 నుంచి ఈ ఏడాది వరకు నేను పోటీపడిన విభాగాల్లో జాతీయ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు ఇప్పటివరకు 18 స్వర్ణ పతకాలు సాధించాను.
చిన్నచిన్న తప్పిదాలతో..
గతంలో పలు జాతీయ పోటీల్లో నాలుగైదు స్థానాల దగ్గర ఆగిపోయి పతకాలు కోల్పోయాను. ఎంత కష్టపడినా ఏదో చిన్న తప్పిదంతో ఆఖరిమెట్టుపై బోల్తాపడేదాన్ని. అయితే, శాట్ (తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ) అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస్ సార్ దగ్గర ఫిట్‌నెస్, కండిషనింగ్ శిక్షణ ప్రారంభించాక నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. గెలవడానికి వందశాతం ప్రయత్నించాలని తెలుసుకున్నా. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2022లో బెంగళూరులో జరిగిన జాతీయ పోటీల్లో మిక్స్‌డ్ రిలేలో కాంస్యం నెగ్గాను. జాతీయస్థాయిలో ఇది నా తొలి మెడల్. ఆ తర్వాతి ఏడాది మిక్స్‌డ్ రిలేలో స్వర్ణం సాధించా. 2025లో 10 కి.మీ. విభాగంలో రజతం, 15 కి.మీ. కేటగిరీలో కాంస్యం గెలుచుకున్నా.
తలవంచిన ‘ఆసియా’ పతక వీరులు
2024 డిసెంబరులో మైసూరులో జరిగిన మారథాన్ స్పీడ్ స్కేటింగ్ పోటీలు నా జీవితంలో, నా క్రీడా ప్రస్థానంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన ఘట్టం. 14 ఏళ్ల వయసులోనే ఏకంగా 42 కిలోమీటర్ల పొడవున సాగే అత్యంత కఠినమైన మారథాన్ రేసులో బరిలోకి దిగాను. ఈ పోటీలు ప్రారంభమైన తొలి 20 కిలోమీటర్ల దూరం వరకు వ్యూహాత్మకంగా కొంచెం నిదానంగా స్కేట్ చేశాను. ఆ తర్వాత నాలోని శక్తిని కూడదీసుకుని ఒక్కసారిగా వేగాన్ని పెంచి రేసులో ముందుకు దూసుకెళ్లాను. విశేషమేంటంటే.. ఈ పోటీల్లో 2022 చైనా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన దిగ్గజ స్కేటర్లు కార్తీక జగదీశ్వరన్, హీరల్ సాధు వంటి అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లు కూడా నాతో పోటీపడ్డారు. నా వేగంతో వారిని కూడా ఓడించి స్వర్ణం సాధించిన క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రేసు ముగిశాక ఆసియా, అంతర్జాతీయ స్కేటర్లు నన్ను వెతుక్కుని వచ్చి మరీ అభినందించినప్పుడు నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనిపించింది.

ఇతర రాష్ట్రాల నుంచి పోటీ
తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌లో వంటి రాష్ట్రాల్లో స్కేటింగ్ క్రీడకు సంబంధించి శిక్షణ సదుపాయాలు అద్భుతంగా ఉంటాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్కేటింగ్ క్రీడాకారులకు ఆర్థికంగా, సదుపాయాల పరంగా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల క్రీడాకారుల నుంచి జాతీయ స్థాయిలో గట్టి పోటీ ఉంటోంది. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన వారికి ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నాయి. కానీ నాకు ఇప్పటి వరకు అలాంటి ప్రోత్సాహకాలు లభించలేదు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు నాకు ఏడాదికి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతోంది. త్వరలో నేను పాల్గొనబోయే ‘వరల్డ్ స్కేట్ గేమ్స్’ పోటీల ప్రయాణ ఖర్చులకే దాదాపు రూ. 6 లక్షల వరకు ఖర్చవుతుంది. వీటితోపాటు వీల్స్, స్కేట్ షూస్, బేరింగ్స్, హెల్మెట్, గ్లోవ్స్, గ్లాసెస్, కాస్ట్యూమ్స్, శిక్షణ ఫీజులు, పోషకాహారం, ఇతరత్రా న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌కు ఏడాదికి రూ. 3 లక్షలు వరకు ఖర్చువుతున్నాయి. నాన్న ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ వినీత గృహిణి. నా కోసం నాన్న చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చి ప్రోత్సహిస్తే దేశానికి, రాష్ట్రానికి మరిన్ని పతకాలు అందిస్తా. నా కోసం త్యాగాలు చేస్తున్న అమ్మ, నాన్నతోపాటు కోచ్ రాజు సార్‌కి ఎంతో రుణపడి ఉంటా.
ఎస్.ఎస్.బి. సంజయ్
45 రోజుల నరకం
ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నైలో జరిగిన వరల్డ్ స్కేట్ ప్రిలిమినరీ ట్రయల్స్‌లో మంచి ప్రదర్శన కనబర్చి అందరి ప్రశంసలు అందుకున్నాను. అయితే, ఆ పోటీల సమయంలో నా రెండు తొడల కండరాలు గాయపడ్డాయి. ఈ కారణంగా దాదాపు 45 రోజులపాటు తీవ్రమైన నొప్పితో, మానసిక వేదనతో చాలా ఇబ్బందిపడ్డాను. ప్రపంచ స్కేటింగ్ పోటీలకు ముందు ఇలా జరగడంతో నేను, నాన్న ఎంతో కంగారుపడ్డాం. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. ఫిజియో థెరపీ, క్రమం తప్పని వ్యాయామంతో ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున పోరాడేందుకు సిద్ధమయ్యాను.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే