మళ్లీ మహిళా బిల్లు
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:23 AM
రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడంతో పాటు లోక్‌సభ సీట్లను పెంచాలన్న వ్యూహం బెడిసికొట్టడంతో...
వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే ప్రయత్నం
దాంతో పాటే డీలిమిటేషన్ బిల్లు కూడా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడంతో పాటు లోక్‌సభ సీట్లను పెంచాలన్న వ్యూహం బెడిసికొట్టడంతో భవిష్యత్‌లో ఏమి చేయాలన్న విషయంపై మోదీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. ఈ భంగపాటు నుంచి బయటపడాలంటే జులైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావిస్తున్నారు. గురువారం రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత మోదీ, షా సమావేశమై కీలక చర్చలు జరిపినట్లు తెలిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిపక్షాలను ఎందుకు ఒప్పించలేకపోయామన్న చర్చ వారిద్దరి మధ్య సాగుతోంది. ప్రతిపక్షాలను చీల్చడంలో విఫలం కాగా పైగా వారిని సంఘటితం చేసేందుకు దోహదం చేశామని వారు గ్రహించారు. ఇదే ఐక్యత వారి మధ్య కొనసాగితే తమకు నష్టమని వారు భావిస్తున్నట్లు తెలిసింది. లోక్‌సభ లో గురువారం కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగినపుడు కనీసం 11 మంది గైర్హాజరయ్యారని తెలుస్తోంది. లోక్‌సభలో స్పీకర్ కాక సంఖ్యాబలం 542. మూడు ఖాళీలు ఉన్నాయి. సభలో ఉండాల్సిన 539 మందిలో 528 మంది సభ్యులు ఓటు వేశారు. వీరిలో బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. అంటే ప్రతిపక్షాలు దాదాపు సంఘటితంగా మారాయని అర్థమవుతోంది.
అన్ని ప్రయత్నాలు చేద్దాం
విపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నారని గట్టిగా ప్రచారం చేయాలని, ఎన్నికలు ముగిసిన వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయ సాధనకు రావాలని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. అప్పటికీ ప్రతిపక్షాలు ఒప్పుకోకపోతే తదుపరి పరిణామాలకు బాధ్యులుగా వారిపై నింద వేసేందుకు ఆస్కారం ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్డీఏ ఎంపీల్లోనూ అసంతృప్తి
ఎన్నికల మధ్యలో రాజ్యాంగ సవరణ పేరుతో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశపెట్టడంపై ఎన్డీఏ ఎంపీల్లో కూడా తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందడం కష్టమని ఎన్డీఏలోని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించడం బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి వచ్చింది. అనవసరంగా పెద్దఎత్తున మహిళలను ఢిల్లీకి రప్పించడం, రోజుకు రూ.10 కోట్ల చొప్పున ఖర్చుతో మూడు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను జరిపించడం వృధా అయిందని వారు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..