నిద్రపోతున్న మహిళను నోట కరిచి లాక్కెళ్లిన పులి!
ABN , Publish Date - Aug 02 , 2026 | 06:22 PM
పులి దాడిలో ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. ఇంట్లో నిద్రపోతున్న ఆమెను పులి ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలై కన్నుమూసింది.
ఇంటర్నెట్ డెస్క్: పులి దాడిలో ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. ఇంట్లో నిద్రపోతున్న మహిళను పులి ఈడ్చుకెళ్లడంతో తీవ్రగాయాల పాలైన ఆమె కన్నుమూసింది. కన్హా నేషనల్ పార్కు సమీపంలో పారాపూర్ బాగాటొలా గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, అర్ధరాత్రి 1.30 సమయంలో సుగ్నీ బాయి దుర్వే తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో పులి వచ్చింది. మహిళ తలను నోట పట్టింది. ఆ తరువాత ఆమెను ఏకంగా 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. మహిళ హాహాకారాలు విన్న గ్రామస్థులు బయటకు వచ్చారు. ఈ క్రమంలో పులి మహిళను విడిచిపెట్టి అడవిలోకి పారిపోయింది. తలకు తీవ్ర గాయాలైన మహిళను బైహార్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆమె కన్నుమూసింది.
ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సిజోరా బఫ్పర్ జోన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశిష్ పాండే తెలిపారు. ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోని మానవనివాసాల్లోకి పులులు, చిరుతలు చొచ్చుకొచ్చిన ఘటనలు గతంలో కూడా వెలుగు చూశాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని కూడా చెప్పారు. మహిళ తన కుటుంబంతో కలిసి ఒక గుడిసెలో ఉండేదని స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. ఇంటికి తలుపు ఉండేదని కాదని అన్నారు. వెనబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు స్థానికులకు పలు సూచనలు చేశారు. చిన్నారులను, వృద్ధులను ఇళ్లల్లో ఒంటరిగా వదలవద్దని చెప్పారు. రాత్రిళ్లు ఇంటి తలుపులు వేసుకోవాలని సూచించారు. గస్తీని ముమ్మరం చేస్తామని కూడా చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌పై అంత ప్రేమ ఉంటే.. దుబాయ్‌లో ఎందుకు.. వివేక్, మాధవన్‌పై రాజ్ ఠాక్రే విమర్శలు
‘నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని