Share News

పెట్రోల్, డీజిల్ కంటే గ్యాస్ విషయంలో అధికంగా ఆందోళన! ఎందుకంటే..

ABN , Publish Date - Mar 14 , 2026 | 06:17 PM

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా భారత్‌లో ఎల్‌పీజీ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీకి, ముడి చమురు దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసాలపై నిపుణుల అభిప్రాయం ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పెట్రోల్, డీజిల్ కంటే గ్యాస్ విషయంలో అధికంగా ఆందోళన! ఎందుకంటే..
India LPG supply concerns

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఇంధన భద్రతపై భయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కంటే ఎల్‌పీజీ గ్యాస్ విషయంలో ఆందోళన అధికంగా కనిపిస్తుంది. అయితే, గృహవినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులూ రానివ్వమని అధికార వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్‌లో మార్పుల కారణంగా దేశీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని స్పష్టం చేస్తున్నాయి.

భారత దేశ ఎల్‌పీజీ దిగుమతుల తీరు ముడి చమురుతో పోలిస్తే భిన్నమని నిపుణులు చెబుతున్నారు. భారత్ ఏటా 31 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ ఇంధనాన్ని వినియోగిస్తోంది. ఇందులో సగం మొత్తం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన ఎల్‌పీజీని ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతర్, యూఏఈ, కువైత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. భారత్ ఎల్‌పీజీ దిగుమతుల్లో 80-90 శాతం హోర్ముజ్ జలసంధి మీదుగానే దిగుమతి అవుతోంది.

ముడి చమురును మాత్రం భారత్ దాదాపు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇరాక్, రష్యాతో పాటు సౌదీ నుంచి భారత్‌కు ముడి చమురు సరఫరా అవుతోంది. ఇక రష్యా నుంచి వచ్చే ముడి చమురు ఇతర మార్గాల్లో భారత్‌కు చేరుకుంటోంది. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో 70 శాతం హోర్ముజ్ జలసంధి కాక ఇతర మార్గాల్లో వస్తోందని ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇటీవల భారత్ రష్యా నుంచి 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది.


ఇక దేశీయ అవసరాలకు మించిన సామర్థ్యం భారత రిఫైనరీలకు ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, విశాఖపట్నం, మంగళూరు తదితర ప్రాంతాల్లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని భూగర్భ నిర్మాణాల్లో చమురు నిల్వలు ఉన్నాయి. కమర్షియల్ రిఫైనరీల ఆధ్వర్యంలో కూడా కొంత చమురు నిల్వ ఉంది.

అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం, భారత్‌లో 1.4 లక్షల టన్నుల ఎల్‌పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఇవి స్వల్పకాలిక అవసరాలకే సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశీయ ఎల్‌పీజీ వ్యవస్థను గ్యాస్ నిల్వ కంటే నిరంతర సరఫరాకు అనుగుణంగా డిజైన్ చేశారని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక ఎల్‌పీజీ నిల్వకు అవసరమైన మౌలిక వతుల కల్పన ప్రణాళికలు కొన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి.


గత దశాబ్ద కాలంలో భారత్‌లో ఎల్‌పీజీ వినియోగం భారీగా పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వం చొరవతో గ్రామీణ ప్రాంతాల్లోని లక్షల మంది గృహవినియోగం కోసం ఎల్‌పీజీ వైపు మళ్లారు. 2010లో యాక్టివ్ ఎల్‌పీజీ కనెక్షన్లు 10.6 కోట్ల మేర ఉండగా 2025 నాటికి 33 కోట్లకు చేరుకున్నాయి. అనేక మంది వంటచెరకు, ఇతర సంప్రదాయక ఇంధనాల నుంచి పూర్తిస్థాయిలో ఎల్‌పీజీ వైపు మళ్లారు. తద్వారా ప్రజారోగ్యం విషయంలో భారత్ కీలక పురోగతి సాధించింది.

ఇక ఎల్‌పీజీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. క్రూడ్ ప్రాసెసింగ్ నుంచి, ప్రొపేన్, బ్యూటేన్ వంటి పెట్రోకెమికల్ ముడి పదార్థాల నుంచి ఎల్‌పీజీ ఉత్పత్తిని మరింత పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. అమెరికా, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఎల్‌పీజీని అధికంగా దిగుమతి చేసుకునేందుకు కూడా భారత్ ప్రయత్నాలు చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

మంత్రి ఇంటిపై రాళ్ల దాడి.. యుద్ధక్షేత్రంగా మారిన కోల్‌కతా!

హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం

Updated Date - Mar 14 , 2026 | 06:29 PM