పనిచేయని సంక్షేమం
ABN , Publish Date - May 05 , 2026 | 05:02 AM
పశ్చిమబెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ‘మమత’ చూపలేదు! సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకర్షించాలనుకున్న మమత ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, అత్యాచారాలు వంటి ఘటనలతో నష్టం
(సెంట్రల్ డెస్క్)
పశ్చిమబెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ‘మమత’ చూపలేదు! సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకర్షించాలనుకున్న మమత ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, ఇతర అవినీతి కేసులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. కీలక నేతల అరెస్టులు, విచారణలు ప్రజల్లో ‘వ్యవస్థలోనే లోపాలున్నాయా?’ అనే సందేహాన్ని కలిగించాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉండడం.. అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచారం వంటి ఘటనలతో మమత సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. బెంగాల్‌లో ఉద్యోగ అవకాశాల కొరత మరో సమస్యగా మారింది. యువత నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వచ్చిన ఆరోపణలు, కేంద్ర పథకాల అమల్లో జాప్యం జనంలో అసంతృప్తి పెంచాయి. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకుంది. పాలనాపరమైన మార్పులు చేసింది. ‘దువారే ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసింది. అవేమీ కాపాడలేకపోయాయి.
పథకాలుప్రభావం చూపలేదు..!
మమత సర్కారు సంక్షేమ పథకాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. మహిళలు, యువత, రైతులు, పేదలను లక్ష్యంగా చేసుకుని పలు పథకాలు ప్రకటించింది. లక్ష్మీభండార్ పథకం కింద మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం అందించింది. బాలికల విద్యాభివృద్ధికి కన్యశ్రీ, పేద కుటుంబాల అమ్మాయిల పెళ్లిళ్ల కోసం రూపశ్రీ పథకాలు అమలు చేసింది. ఆరోగ్య రంగంలో స్వస్థ్య సాథి పథకం ద్వారా కుటుంబాలకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించింది. విద్యార్థులకు సబూజ్ సాథి కింద ఉచిత సైకిళ్లు, స్కాలర్‌షి్‌పలు అందించింది. యువ సాథి పథకం కింద నిరుద్యోగులకు ఆర్థిక సహాయం, రైతుల కోసం కృషక్ బంధు, బీమా సదుపాయాలు కల్పించింది. గ్రామీణ మహిళల కోసం ఆనంద ధారా, పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం బంగ్లార్ బారి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా మమత కొన్ని వర్గాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ప్రస్తుత పథకాల విస్తరణ, ఆర్థిక సహాయం పెంపు వంటి వాగ్దానాలు కూడా చేశారు. కానీ, అవేవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పథకాల అమలులో లోపాలు, అవినీతి ఆరోపణలతో టీఎంసీపై నమ్మకం తగ్గింది. అలాగే ఐప్యాక్ సంస్థల్లో ఈడీ సోదాల విషయంలో మమత వ్యవహరించిన తీరు కూడా ఆమెకు నష్టం చేకూర్చింది. సంక్షేమ పథకాలతో బలమైన ఓటు బ్యాంకు ఏర్పరచుకున్న మమత.. అవినీతి, నిరుద్యోగం, చట్టం-వ్యవస్థ వంటి కీలక సమస్యలపై దృష్టి సారించలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం, కేంద్రంపై యుద్ధం చేస్తున్నట్లుగా ప్రవర్తించడంపైనే దృష్టి కేంద్రీకరించారని.. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేదని, అభివృద్ధి కార్యక్రమాల అమలును పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.