Share News

టిక్‌టాక్ వీడియోతో బయటపడ్డ అద్భుతం.. వెలుగులోకి అరుదైన జాతి చేప..

ABN , Publish Date - Aug 18 , 2026 | 03:35 PM

ఓ టిక్‌టాక్ వీడియో కారణంగా అరుదైన జాతికి చెందిన చేప ఒకటి వెలుగులోకి వచ్చింది. అచ్చం వానపాములా ఉండే చేపను సైంటిస్టులు గుర్తించారు. దానికి ‘గంగాఇచ్థిస్ ఇండోనేపాలికస్’ అని పేరు పెట్టారు.

టిక్‌టాక్ వీడియోతో బయటపడ్డ అద్భుతం.. వెలుగులోకి అరుదైన జాతి చేప..
Gangaichthys indonepalicus

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ టిక్‌టాక్ వీడియో కారణంగా అరుదైన జాతికి చెందిన చేప ఒకటి వెలుగులోకి వచ్చింది. అచ్చం వానపాములా ఉండే చేపను సైంటిస్టులు గుర్తించారు. దానికి ‘గంగాఇచ్థిస్ ఇండోనేపాలికస్’ అని పేరు పెట్టారు. ఈ చేప మొదటి సారిగా 2024లో ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చింది. ఇండియా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. వైరల్‌గా మారిన వీడియో సైంటిస్టుల దృష్టికి వెళ్లింది.


బోర్‌వెల్ నీటినుంచి బయటపడ్డ ఆ చేపను మొదటి సారి చూసిన సైంటిస్టులు పొరపాటు పడ్డారు. చేపకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా దానిలో లేకపోవటంతో.. అదొక సరికొత్త జీవి అనుకున్నారు. కానీ, పలు పరిశోధనల తర్వాత దాన్ని చేపగా గుర్తించారు. ముంబైలోని థాక్రే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్‌కు చెందిన అంతర్జాతీయ సైంటిస్టుల బృందం, కోల్హాపూర్ యూనివర్శిటీకి చెందిన సైంటిస్టులతో పాటు మరి కొంతమంది ఆ జీవిపై పరిశోధనలు చేశారు.


సైంటిస్టులు మాట్లాడుతూ.. ‘విచిత్రమైన చేపను పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ చేపలు ఉన్న బోర్‌వెల్స్, బావులను గుర్తించటం.. వాటి యజమానుల నుంచి అనుమతులు తీసుకోవటం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మనుషుల సాయంతో నీళ్లను తోడాము. మొదటిసారి 2 వేల లీటర్ల నీళ్లను తోడి ఓ చేపను గుర్తించాము. అయితే, నీటిని తోడుతున్నపుడు గాయాలు అవ్వటం వల్ల అది కొద్దిసేపటికే చనిపోయింది. తర్వాత 500 లీటర్ల నీటిని తోడాము. అప్పుడు మరో చేప దొరికింది’..


‘ఆ చేప కేవలం నాలుగు సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంది. చాలా లోతులో చీకటిలో ఉండటం వల్ల ఆ చేపకు కంటి చూపు సరిగా లేదు. రెక్కలు కూడా లేవు. మట్టి, నీటితో నిండిన రాళ్ల పొరల సాయంతో అది ఈదుతుంది. చూడ్డానికి వానపాములా ఉన్నా.. మైక్రో సీటీ స్కానింగ్‌లో అది ఎర్త్‌వామ్ ఈల్ ఫ్యామిలీకి చెందినదిగా తేలింది. గంగాఇచ్థిస్ అంటే గంగానదికి చెందిన చేప అని అర్థం. ఈ చేప గంగానది బేసిన్‌లో నివసిస్తుంది’ అని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

ఫ్లోరైడ్.. నిజంగా మెదడును ప్రభావితం చేస్తుందా?

ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు

Updated Date - Aug 18 , 2026 | 03:43 PM