విజయ్ కేతనం!
ABN , Publish Date - May 05 , 2026 | 04:19 AM
తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేక ...
‘విజిల్’తో ఇళయ దళపతి గెలుపు కేక
చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే పరిమితమవుతారని అంతా భావించినా... ఏకంగా ప్రభుత్వ పీఠానికే దగ్గరయ్యేన్ని సీట్లు సాధించారు. స్పష్టమైన మెజారిటీ సాధించనప్పటికీ... ‘అతి పెద్ద’ పార్టీ అధినేతగా ఆవిర్భవించారు. ఆరు దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న రెండు ప్రధాన ద్రవిడ పార్టీలను వెనక్కి నెట్టేశారు. టీవీకే అభ్యర్థులు 107 స్థానాల్లో గెలుపొందారు. కొళత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మొత్తం 234 నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 85.15 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. డీఎంకే నేతృత్వంలోని ఇండి కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి, ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో మొత్తం 16 పార్టీలుండగా.. ఆ పార్టీ 164 స్థానాల్లో పోటీ చేసింది. ఎన్‌డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న అన్నాడీఎంకే 167 చోట్ల పోటీ చేసింది. టీవీకే 233 స్థానాల్లో పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభం నుంచే టీవీకే ఆధిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ ఓట్లలో సైతం టీవీకే వైపే మొగ్గు కనిపించింది. ఒక దశలో డీఎంకే మూడో స్థానానికే పరిమితమైంది. తర్వాత పుంజుకుని రెండోస్థానానికి చేరుకుంది. డీఎంకే కంచుకోటచెన్నైలో 16 నియోజకవర్గాలుండగా... 14 చోట్ల టీవీకే విజయం సాధించడం విశేషం.
‘ఈల’ వేసి...
అంచనాలకు మించి, అనూహ్య విజయం సాధించడంతో టీవీకే కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. తిరువాన్మియూరులోని టీవీకే ప్రధాన కార్యాలయం, విజయ్ నివాసం వద్ద సందడి కనిపించింది. ఇక విజయ్ కుటుంబీకులు తమ నివాసంలో... టీవీకే పార్టీ చిహ్నమైన ‘విజిల్’ ఊదుతూ, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తన గెలుపు ఖరారుకాగానే విజయ్ నేరుగా అడయార్‌లో ఉన్న తన తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం నుంగంబాక్కంలో ఉన్న లయోలా కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి... ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
జయ బాటలో...: ఈపీఎస్
అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు. ‘‘జయలలిత బాటలో మళ్లీ పార్టీ ఘనవిజయం కోసం పాటుపడతాం.’’ అని శపథం చేశారు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా: స్టాలిన్
తమ పార్టీకి సిద్ధాంతాలు, ఆశయాలు మాత్రమే ముఖ్యమని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. ‘‘ఇప్పటి వరకూ పాలకపక్షంగా సేవలందించిన మా పార్టీ... ఇకపై బాధ్యతాయుత ప్రతిపక్షంగా ప్రధాన పాత్రను పోషిస్తుంది’’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
కలిసొచ్చేదిఎవరు
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ‘మ్యాజిక్ ఫిగర్’కు కాస్త దూరంలో ఆగిపోయింది. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఖాయం. డీఎంకేను ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించిన విజయ్... ఆ పార్టీ మద్దతు తీసుకునే అవకాశం లేదు. అన్నా డీఎంకేతో అధికారం పంచుకోవడానికీ సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమతో కలిసొచ్చే పార్టీల కోసం మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, డీఎండీకే పార్టీల మద్దతు కోసం టీవీకే వర్గాలు చర్చిస్తున్నట్లు తెలిసింది. టీవీకేకు మద్దతిచ్చే పార్టీలపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశముంది.