Share News

చైనా, పాక్‌కు అమెరికా షాక్‌

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:43 AM

కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ, భారత్‌కు అమెరికా మరో మంచి కబురు అందించింది. ఈ ఒప్పందం సందర్భంగా విడుదలచేసిన మ్యాప్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను భారత్‌లో...

చైనా, పాక్‌కు అమెరికా షాక్‌

  • మ్యాప్‌లో భారతదేశంలో అంతర్భాగంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను, అక్సయ్‌ చిన్‌ను చూపిన వైనం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ, భారత్‌కు అమెరికా మరో మంచి కబురు అందించింది. ఈ ఒప్పందం సందర్భంగా విడుదలచేసిన మ్యాప్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను భారత్‌లో అంతర్భాగంగా చూపించింది. కశ్మీర్‌ విషయంలో భారత్‌ను అంతర్జాతీయ వేదికలపై ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న దాయాదికి అగ్రరాజ్యం చర్య శరఘాతమేనని చెప్పాలి. తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను భారత్‌, అమెరికా శనివారం ఖరారుచేశాయి. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం విడుదల చేసిన భారతదేశ మ్యాప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన భూభాగంగా చైనా వాదిస్తున్న అక్సయ్‌ చిన్‌ను కూడా భారత్‌లో భాగంగా ఈ మ్యాప్‌లో చూపించడం విశేషం, నిజానికి, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, అక్సయ్‌ చిన్‌ ప్రాంతాలు మనదేశ పటంలో ఉన్నవే. అయితే, వీటి విషయంలో నిన్నటిదాకా అమెరికా వైఖరి వేరేగా ఉండేది. అమెరికా విడుదల చేసిన పాత మ్యాప్‌ల్లో పాక్‌ ఆశ్రమిత కశ్మీర్‌ను వేరుగా చూపించారు. ఆ పాత వైఖరి మారిందని తాజా మ్యాప్‌ను చూస్తే స్పష్టం అవుతోంది. దీనిపై నెటిజన్లు, మాజీ సైనికాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అమెరికాకు ప్రధాని లొంగిపోయారు: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: భారత్‌- అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం మన దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన వ్యక్తంచేసింది. ఇది ఒప్పందం కాదని, అమెరికాకు మన లొంగుబాటు అని ఆరోపించింది. కాంగ్రెస్‌ పార్టీ మీడియా ఇన్‌చార్జి పవన్‌ ఖేరా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత 75 ఏళ్లుగా భద్రంగా ఉన్న భారతీయ రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలు ఈ ఒప్పందంతో తీవ్ర ప్రమాదంలో పడ్డాయని అన్నారు. ఇతర దేశాలకు లొంగిపోయే తన బలహీనతను ప్రధాని మోదీ మరోసారి బయటపెట్టుకున్నారని విమర్శించారు. ‘ఆయన పేరు నరేందర్‌.. ఆయన పని సరెండర్‌’ అని ఎద్దేవా చేశారు. ‘ఈ ఒప్పందంతో అమెరికా వస్తువులకు భారత్‌ డంపింగ్‌ గ్రౌండ్‌గా మారుతుంది. ఒప్పందం అంటే రెండు పక్షాలు కూర్చొని, చర్చల ద్వారా సమాన ప్రయోజనాలు కలిగేలా చేసుకొనేది. కానీ, తలకు తుపాకీ గురిపెట్టి బలవంతంగా చేయించేది ఒప్పందం కాదు. ఇది బ్లాక్‌మెయిల్‌, పూర్తిగా లొంగుబాటు. భారతీయ రైతులు, ఎంఎ్‌సఎంఈలు, మధ్యతరగతి వర్గాల ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెట్టింది’ అని మండిపడ్డారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా నుంచి భారత్‌ ఏటా 100 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? దానితో ఏం వస్తువులు కొంటారు? అని ప్రశ్నించారు.

మలేషియాలో త్వరలో యూపీఐ సేవలు: మోదీ

కౌలాలంపూర్‌, ఫిబ్రవరి 7: అతి త్వరలో మలేషియాలో భారత కాన్సులేట్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, డిజిటల్‌ పేమెంట్‌ సదుపాయమైన యూపీఐ సేవలను త్వరలో ప్రవేశపెడతామని ప్రధాని మోదీ చెప్పారు. మలేషియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కౌలాలంపూర్‌లో ప్రవాస భారతీయులు పాల్గొన్న సభలో ప్రసంగించారు. భారత సంతతి వాళ్లు ఎక్కువగా ఉండే రెండో అతిపెద్ద దేశం మలేషియా అని, రెండు దేశాలను అనేక సాంస్కృతిక అంశాలు జోడిస్తున్నాయన్నారు.


మలేషియాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయులు సాంస్కృతిక వారధులుగా నిలుస్తున్నారంటూ తమిళులు, తమిళ భాష గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళ సంస్కృతి శాశ్వతమైనదని, తమిళభాష ప్రపంచ భాష అని చెప్పారు. ఇదిలా ఉండగా, మనీలాండరింగ్‌, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసులో భారత్‌ నుంచి పరారై మలేషియాలో తలదాచుకుంటున్న వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ను అప్పగించాలంటూ భారత్‌ మలేసియాపై ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయని విదేశాంగశాఖ వర్గాలు తెలిపాయి. జకీర్‌ నాయక్‌ 2016 నుంచి తలదాచుకుంటున్నాడు.

ఈ వార్తలూ చదవండి:

లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 06:57 AM