లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
ABN , Publish Date - Feb 07 , 2026 | 08:17 PM
లంచం తీసుకున్న కేసులో ఓ కానిస్టేబుల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ముప్ఫై ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. చివరకు కేసు గెలిచిన మరుసటి రోజు కన్నుమూశారు. గుజరాత్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరవై రూపాయల లంచం తీసుకున్న కేసులో ఓ కానిస్టేబుల్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు 30 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. కానీ, నిర్దోషిగా తేలిన మరుసటి రోజే ప్రాణాలు విడిచారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.
1996లో వేజల్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న బాబూభాయ్ ప్రజాపతిపై రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో కేసు నమోదైంది. 2004లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. తాను నిర్దోషినని మొదటి నుంచీ వాదిస్తున్న బాబూభాయ్ సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో దాదాపు 30 ఏళ్ల తరువాత ఇటీవల గుజరాత్ హైకోర్టు ఆయన నిర్దోషి అని తీర్పు వెలువరించింది. బాబూభాయ్‌పై నమోదు చేసిన కేసులో చట్టపరమైన లోపాలు ఉన్నాయని ఆయన తరపు లాయర్ వాదించారు. సాక్షుల వాంగ్మూలాల్లో కూడా తేడాలు ఉన్నాయని చెప్పారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించి బాబూభాయ్‌ని ఈ నెల 4వ తేదీన నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
తనపై పడిన అవినీతి మరక తొలగిపోయినందుకు బాబూభాయ్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. అప్పటివరకూ ఆయనకు డిపార్ట్‌మెంట్‌లో ప్రొమోషన్లు నిలిచిపోయాయి. రావాల్సిన ప్రోత్సాహకాలు ఆగిపోయాయి. అవమాన భారంతోనే 30 ఏళ్లు గడిచిపోయాయి.
తీర్పు వెలువడిన రోజు లాయర్ ఆఫీసులో బాబూభాయ్ తనకు కేసు నుంచి విముక్తి లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ‘సార్.. నా జీవితంపై పడిన అవినీతి మరక తొలగిపోయింది. ఇక దేవుడు నన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోతే బాగుండును’ అని అన్నారు. అయితే, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని లాయర్ ఆయనకు సూచించారు. ఇందుకు సరేనన్న బాబూభాయ్ ఇంటికి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజే కన్నుమూశారు. ‘తీర్పు వెలువడిన మరుసటి రోజు కోర్టు డాక్యుమెంట్స్ ఇచ్చేందుకు ఆయనకు కాల్ చేశా. అప్పటికే బాబూభాయ్ మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు’ అని లాయర్ విచారం వ్యక్తం చేశారు.
ఈ వార్తలూ చదవండి:
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే