మళ్లీ బాంబుల మోత
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:10 AM
పశ్చిమాసియా మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లింది. ఒకవైపు రేపోమాపో శాంతి ఒప్పందం కుదురుతుందని భావిస్తున్న తరుణంలో అమెరికా-ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌లోని...
అమెరికా- ఇరాన్ పరస్పర దాడులు
దుబాయి, జూన్ 1: పశ్చిమాసియా మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లింది. ఒకవైపు రేపోమాపో శాంతి ఒప్పందం కుదురుతుందని భావిస్తున్న తరుణంలో అమెరికా-ఇరాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌లోని గెరుక్ నగరంతోపాటు హోర్ముజ్ జలసంధిలో వ్యూహాత్మకమైన ఖేష్మ్ ద్వీపంపై అమెరికా నౌకాదళ యుద్ధవిమానాలు బాంబు దాడులు చేశాయి. అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ ఎంక్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసినందుకే ఆత్మరక్షణగా ఈ దాడులు చేసినట్లు అమెరికా సోమవారం ప్రకటించింది. ఖేష్మ్‌లోని ఒక టెలికమ్యూనికేషన్ టవర్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. మరోవైపు, అమెరికా దాడులకు స్పందనగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రతిదాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున తమపై డ్రోన్లు, క్షిపణులతో దాడి జరిగిందని కువైట్ తెలిపింది. కాగా, ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంలో భూగర్భ క్షిపణి నగరం ఉంది. ఇక్కడ కీలకమైన స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులు, డ్రోన్లు, సాయుధ బోట్లను ఇరాన్ నిల్వచేసింది.
ఇక చర్చల్లేవు: ఇరాన్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది. లెబనాన్‌పై దురాక్రమణను ఆపేవరకు చర్చల్లో పాల్గొనబోమని పేర్కొంది. హోర్ముజ్ జలసంధిని మరింత దిగ్బంధిస్తామని హెచ్చరించింది. బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని కూడా మూసివేస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హెజ్బొల్లా అంగీకరించాయని పేర్కొన్నారు.