Share News

జంట ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. మతాలు వేరన్న కారణంతో..

ABN , Publish Date - Jan 22 , 2026 | 06:35 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ఉమ్రి సబ్జీపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ జంట ప్రాణం తీసింది. పరువు కోసం చెల్లెను, ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు యువకులు.

జంట ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. మతాలు వేరన్న కారణంతో..
interfaith relationship

లఖ్‌నవూ, జనవరి 22: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ జంట ప్రాణం తీసింది. పరువు కోసం చెల్లిని, ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు యువకులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరాదాబాద్‌లోని ఉమ్రి సబ్జీపూర్ గ్రామానికి చెందిన కాజల్, అర్మాన్ ప్రేమించుకున్నారు. ఈ విషయం కాజల్ ఇంట్లో వాళ్లకు తెలిసింది. అర్మాన్‌కు దూరంగా ఉండాలని కుటుంబసభ్యులు ఆమెను హెచ్చరించారు. అయితే, కాజల్ వారి హెచ్చరికను పట్టించుకోలేదు. అర్మాన్‌‌ను నిత్యం కలుస్తుండేది. కాజల్ సోదరులు దీన్ని తట్టుకోలేకపోయారు. వేరే మతం వాడితో తమ సోదరి తిరుగుతోందంటే పరువు పోతుందని భావించారు.


ఈ నేపథ్యంలోనే ప్రేమ జంటను చంపాలని డిసైడ్ అయ్యారు. రెండు రోజుల క్రితం అతి కిరాతకంగా కాజల్, అర్మాన్‌ను హత్య చేశారు. తర్వాత శవాలను ఊరికి సమీపంలోని నదిలో పడేశారు. మంగళవారం ఉదయం నదిలో కొట్టుకుపోతున్న శవాలను గ్రామస్తులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నది నుంచి శవాలను బయటకు తీయించారు. మృతులను ఉమ్రి సబ్జీపూర్ గ్రామానికి చెందిన కాజల్, అర్మాన్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో కాజల్ సోదరుల ఘాతుకం బయటపడింది.


ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై మొరాదాబాద్ ఎస్ఎస్‌పీ సత్పల్ అంతిల్ మాట్లాడుతూ.. ‘కాజల్ ఇద్దరు అన్నలను అరెస్ట్ చేశాము. దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో ఇది పరువు హత్యలుగా తెలిసింది. ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుంది’ అని అన్నారు. పరువు హత్యలతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భద్రతా దళాలను రంగంలోకి దించారు.


ఇవి కూడా చదవండి

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

Updated Date - Jan 22 , 2026 | 09:27 PM