ఎస్‌బీఐలో 12 వేల ఉద్యోగాలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 04:19 AM
భారత్‌లోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా తమ శాఖలలో మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది
ఈ ఆర్థిక సంవత్సరంలో నియమించనున్న బ్యాంకు
క్లరికల్, ఆఫీసర్ క్యాడర్లలో కొత్త నియామకాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: భారత్‌లోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా తమ శాఖలలో మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో క్లరికల్, ఆఫీసర్ క్యాడర్లలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను కొత్తగా తీసుకోనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణలు, కొత్త సిబ్బంది అవసరాలను బట్టి తుది నియామకాల సంఖ్య మారవచ్చునని, అయితే 12 వేల నియామకాలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించాలని భావిస్తున్నామని చెప్పారు. గత ఏడాది జరిపిన నియామకాల్లో 1500 మంది ఐటీ నిపుణులను నియమించామని, ఈసారి మాత్రం వారి సంఖ్య కొంత తక్కువగా ఉంటుందన్నారు. ఇక తమ శాఖల నెట్‌వర్క్‌ను కూడా విస్తరించనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ వెల్లడించారు. ఈ ఏడాది దేశంలో మరో 200-250 నూతన శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో నూతనంగా ఏర్పాటైన కాలనీలతోపాటు వాణిజ్య పరంగా సామర్థ్యం కలిగిన జిల్లాల్లోనూ నూతన శాఖలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.