భారత్‌పై 100 శాతం సుంకం ఉండకపోవచ్చు: మాజీ దౌత్యవేత్త
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:45 PM
రష్యాపై ఆంక్షల కోసం ఉద్దేశించిన బిల్లు చట్ట రూపం దాల్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఆంక్షల కోసం ఉద్దేశించిన బిల్లు చట్ట రూపం దాల్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా ఎదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ఈ భారాన్ని భరించడం అమెరికాకు సాధ్యం కాకపోవచ్చని అన్నారు.
‘ఈ బిల్లును సెనేట్ 86-11 మెజారిటీతో ఆమోదించింది. ప్రతినిధుల సభ కూడా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి తదుపరి ఏం జరుగుతోందో వేచి చూడాలి. ఈ బిల్లుకు ప్రతినిధుల సభ మార్పులను సూచించే అవకాశం ఉంది. అదే జరిగితే బిల్లు మరోసారి సెనేట్‌కు చేరుతుంది. ఈ బిల్లును ప్రతినిధుల సభ యథాతథంగా ఆమోదించినా కొత్త చిక్కులు వస్తాయి. ఒకవేళ ట్రంప్ ఈ చట్టం ప్రకారం, సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఈ పరిణామాల్ని ట్రంప్ తట్టుకోగలరా? అంటే సందేహమే. కాబట్టి సుంకాల విషయంలో భారత్ ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన అన్నారు.
దివంగత నేత లిండ్సే గ్రాహం కృషి కారణంగా ఈ బిల్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ముడి చమురు ద్వారా అందే ఆదాయంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం చేయగలుగుతున్నారని పాశ్యాత్య దేశాలు భావిస్తున్నాయి. ఈ నిధుల కట్టడికి రకరకాల మార్గాలను అమెరికా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రష్యా చమురు కొనేవారిపై భారీ సుంకాలు విధించేలా అధ్యక్షుడికి అధికారాలు కల్పించే బిల్లును లిండ్సే గ్రాహం తెరపైకి తెచ్చారు. అయితే, సుంకాలపై అధ్యక్షుడికి పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చే ఈ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!
2024లోనే పేపర్ లీక్.. ఝార్ఖండ్‌లో తెరపైకి సీఐడీ రిపోర్టు