తల వంచిన ట్రంప్!
ABN , Publish Date - Mar 26 , 2026 | 06:32 AM
ఇరాన్‌ను లొంగదీసుకుంటానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. క్రమంగా వెనక్కి జారుకున్నారు. చర్చలు జరుగుతున్నాయని, ఐదు రోజులపాటు యుద్ధానికి విరామం....
తలకిందులైన రెండు దేశాల వ్యూహాలు
న్యూఢిల్లీ, మార్చి 25: ఇరాన్‌ను లొంగదీసుకుంటానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. క్రమంగా వెనక్కి జారుకున్నారు. చర్చలు జరుగుతున్నాయని, ఐదు రోజులపాటు యుద్ధానికి విరామం ఇస్తున్నామని ప్రకటించారు. అయితే, ఇరాన్ మాత్రం.. యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ.. తమ కూ అమెరికాకు మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని, తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశా రు. మొత్తమ్మీద, ట్రంప్ మాటలకు విశ్వసనీయత లేద ని, రోజుకో మాట మాట్లాడటమే ఆయన తీరని మరోసారి రుజువైంది. ఏదేమైనా.. ట్రంప్ వెనక్కి తగ్గటం మాత్రం కాదనలేని వాస్తవం. దీనికి కారణాలేమిటి?
లక్ష్యం లేకపోవటం: ఇరాన్ మీద కయ్యానికి కాలు దువ్వినప్పుడు అమెరికా-ఇజ్రాయెల్‌లకు ఓ స్పష్టమైన లక్ష్యం లేదు. ఖమేనీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని పడగొడతామని ఒకసారి, ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటం అని మరోసారి, ఇరాన్ నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందని, ఆ దేశాన్ని లొంగదీసుకుంటామని ఇంకోసారి.. ఇలా పూటకో మాట చెప్పారు ట్రంప్. మరోవైపు, తమ మీద రుద్దిన ఈ యుద్ధాన్ని ఎదుర్కొని తమ దేశ సమగ్రతను కాపాడుకునే ఏకైక, స్పష్టమైన లక్ష్యంతో ఇరాన్ యుద్ధంలోకి దిగింది.
బెడిసికొట్టిన ఆలోచన: వెనెజువెలాలో అధ్యక్షుడు మదురో అధికారిక నివాసంపై దాడి చేసి రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చిన ట్రంప్.. ఇరాన్ మీద కూడా అదే ప్లాన్ అమలు చేయాలని భావించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రాజధాని టెహ్రాన్‌లో సైనిక, పౌర ఉన్నతాధికారులతో సమావేశమైన తరుణంలో వారి మీద అమెరికా, ఇజ్రాయెల్ అకస్మాత్తుగా బాంబులు కురిపించాయి. వారిని హత్య చేసి యుద్ధం ప్రారంభించాయి. ఖమేనీ హత్య తర్వాత.. అప్పటి వరకూ ఉన్న అంతర్గత విభేదాలు, ప్రభుత్వం మీద ఉన్న అసమ్మతిని కూడా పక్కనపెట్టి.. దేశ పరిరక్షణకు యావత్ ఇరాన్ ఒక్కటైంది. ఆ దేశంలోని ప్రతీ పట్టణంలో.. ఓవైపు క్షిపణులు, బాంబులు పడుతున్నా కూడా బెదరకుండా.. రోడ్ల మీదికి పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలు జరిపారు. ఇప్పటికీ ఇవి కొనసాగుతున్నాయి.
ఊహకు అందని ప్రత్యర్థి వ్యూహం
ఇరాన్ బలాబలాలేమిటి అన్నది సమగ్రంగా సమీక్షించకుండానే ట్రంప్ ఈ యుద్ధంలోకి దిగారు. అమెరికా సైన్యాధికారులతో సంప్రదించలేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని శక్తిమంతమైన యూదు లాబీ మాటలువిని ట్రంప్ యుద్ధం నిర్ణయం తీసుకున్నారని స్వయంగా అమెరికా ఉగ్రవాద నిరోధక విభాగం డైరెక్టర్ జో కెంట్ వెల్లడించి నిరసనగా పదవికి రాజీనామా చేశారు. గల్ఫ్ మొత్తానికి యుద్ధాన్ని విస్తరిస్తుందని ట్రంప్, నెతన్యాహు ఊహించి ఉండరు. ఇక హొర్ముజ్ జలసంధిని అడ్డుకోవటం ద్వారా ఇరాన్ తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచం మీద పడింది.
స్వదేశంలో తీవ్ర నిరసన
అంతులేని యుద్ధాలకు ముగింపు పలుకుతానని, అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అమెరికాకు ఏ విధంగానూ అవసరం లేని యుద్ధం చేస్తున్నారన్న భావన అమెరికన్లలో వ్యాపించింది. తాము కట్టిన పన్నుల్ని నెతన్యాహూ కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పెరిగాయి. స్థిరచిత్తం లేని ట్రంప్ మాటలతో, చేతలతో అమెరికా అధ్యక్ష పదవి ఓ జోకులాగా తయారైంది. స్వయంగా ట్రంప్ మద్దతుదారులు కూడా ఈ యుద్ధాన్ని సమర్థించటం లేదు. సర్వేల్లో ట్రంప్ ప్రజాదరణ రోజురోజుకీ దిగజారుతోంది. మరోవైపు, ఈ ఏడాది చివర్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికలు జరగనున్నాయి. అధికారపక్షమైన రిపబ్లికన్ పార్టీకి పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, తాజాగా వెనక్కి తగ్గారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్