జిప్‌లైన్ ప్రమాదం.. 40 అడుగుల ఎత్తునుంచి పడ్డ పర్యాటకుడు..
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:52 PM
కర్ణాటకలోని దండేలీలో జిప్‌లైన్ ప్రమాదం చోటుచేసుకుంది. జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా సేఫ్టీ లాక్ ఊడిపోవటంతో ఓ పర్యాటకుడు 40 అడుగుల ఎత్తునుంచి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: కర్ణాటకలోని దండేలీలో జిప్‌లైన్ ప్రమాదం చోటుచేసుకుంది. జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా సేఫ్టీ లాక్ ఊడిపోవటంతో ఓ పర్యాటకుడు 40 అడుగుల ఎత్తునుంచి కిందపడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయపురకు చెందిన కుబేర్ సుర్పూర్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి పర్యటన నిమిత్తం దండేలీ రిసార్ట్‌కు వెళ్లాడు. అతడు జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా.. జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఊడిపోయింది. దీంతో అతడు 40 అడుగుల ఎత్తునుంచి కిందపడిపోయాడు.
కాళ్లు, చేతులు విరిగిపోయాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన అతడిని దండేలీ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి మిరాజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కుబేర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జిప్‌లైన్ పరికరాల నిర్వహణ సరిగా లేదని, ఆ పరికరాలు తుప్పుపట్టిపోయి ఉన్నాయని అంటున్నారు. జిప్‌లైన్ పరికరాలు సరైన స్థితిలో ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని చెబుతున్నారు.
ఈ ప్రమాదంపై రిసార్ట్ యాజమాన్యం పూర్తి స్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. రిసార్ట్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సోమవారం నష్టాల్లో ముగిసిన షేర్ మార్కెట్లు.. ఐటీ, ఫార్మా అండగా నిలిచినా తప్పని పతనం!
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి.. కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి