Share News

బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాము.. టీఎంసీ రెబల్ ఎంపీ ప్రకటన

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:10 PM

టీఎంసీ రెబల్ నేత, కూచ్ బేహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా తాజాగా సంచలన ప్రకటన చేశారు. టీఎంసీ నుంచి బయటకు వచ్చిన వారిలో 17 మంది రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాము.. టీఎంసీ రెబల్ ఎంపీ ప్రకటన
TMC Rebel MP Jagadish Chandra Basunia

ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ రెబల్ నేత, కూచ్ బేహార్ ఎంపీ జగదీశ్ చంద్ర బాసునియా తాజాగా సంచలన ప్రకటన చేశారు. టీఎంసీ నుంచి బయటకు వచ్చిన 17 మంది రెబల్ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు నేషనలిస్టు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో 17 మంది బీజేపీలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఎంపీ జగదీశ్ అన్నారు. ‘మాలో 17 మంది ఎంపీలు బీజేపీలో చేరనున్నారు. మొత్తం ఎంపీల్లో ఈ సంఖ్య మూడింట రెండువంతులు కాబట్టి మాకు యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు’ అని చెప్పారు.


ఈ పరిణామాలకు బీజేపీ దూరంగా జరిగే ప్రయత్నం చేసింది. పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ కేవలం పార్టీలో చేరతామంటూ వచ్చిన ప్రతి ఒక్కరినీ తాము చేర్చుకోబోమనిచెప్పారు. ఎంపీ జగదీశ్ కామెంట్స్‌పై మరో రెబల్ ఎంపీ శతాబ్దీ రాయ్ కూడా ఆచితూచి స్పందించారు. అవి జగదీశ్ వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు. ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మరో ఎంపీ అబూతాహిర్ ఖాన్ మాత్రం ఘాటుగా స్పందించారు. తమ తరఫున మాట్లాడే హక్కు ఆయనకు లేదని తేల్చి చెప్పారు. మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీలు బయటనుంచే బీజేపీకి మద్దతు ఇస్తారన్న జగదీశ్ వ్యాఖ్యలను కూడా తాహిర్ ఖండించారు. ‘మేము బీజేపీలో గానీ ఎన్‌డీఏలో గానీ చేరము. ఇది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను’ అని అన్నారు. అయితే, ప్రధాని లేదా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటామని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ శాకాహార విందు వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

పాక్‌ నుంచి అక్రమ రవాణా.. 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాల సీజ్

Updated Date - Sep 14 , 2026 | 07:17 PM