Share News

తిరంగా ర్యాలీ ఉద్రిక్తం

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:18 AM

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన తిరంగా ర్యాలీతో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌ సెంట్రల్‌ పార్కు శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలకు, నిరసనలకు వేదికైంది.

తిరంగా ర్యాలీ   ఉద్రిక్తం
tirangarally

flag.jpg

  • ఢిల్లీలోని సెంట్రల్‌ పార్కు మూసేసినా దూసుకొచ్చిన నిరసనకారులు

  • జాతీయ జెండాలతో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, ఆప్‌, వామపక్ష శ్రేణులు.. దీప్కే, నేహా బోరా సహా 150 మంది అరెస్టు

  • త్రివర్ణ పతాకం పాకిస్థాన్‌లో ఎగరేయాలా?: కేజ్రీవాల్‌

  • అణచివేత చర్యలు అప్రకటిత ఎమర్జెన్సీ లాంటివే: మమత

న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన తిరంగా ర్యాలీతో ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌ సెంట్రల్‌ పార్కు శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలకు, నిరసనలకు వేదికైంది. ర్యాలీని భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు కఠిన ఆంక్షలు విధించినా ఆందోళనకారుల ముందు అవి నిలవలేకపోయాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను ముందుగానే నిర్బంధించి, సెంట్రల్‌ పార్కును మూసివేసినా.. దాదాపు 7 వేల మంది విద్యార్థులు, విపక్షాల కార్యకర్తలు అక్కడికి చేరుకుని త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన నిర్వహించారు. గత మంగళవారం జంతర్‌ మంతర్‌లోకి ప్రవేశించి జాతీయ జెండాతో నిరసన తెలిపిన సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీనికి వ్యతిరేకంగా సీజేపీ కన్నాట్‌ప్లేస్‌ సెంట్రల్‌ పార్కులో శుక్రవారం సాయంత్రం ‘లెహ్రా దో తిరంగా’ పేరిట ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచే ఆ ప్రాంతాన్ని పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. సెంట్రల్‌ పార్కు నిరసనలకు అనుమతించిన వేదిక కాదని, ట్రాఫిక్‌, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ అభిజీత్‌ దీప్కేకు రెండు వేర్వేరు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్‌ 163కింద నిషేధాజ్ఞలు విధించారు. సాయంత్రం దీప్కే కన్నాట్‌ప్లేస్‌కు బయలుదేరగానే అదుపులోకి తీసుకున్నారు. అటు మండిహౌస్‌ నుంచి మార్చ్‌ ప్రారంభించిన ఐసా అధ్యక్షురాలు నేహా బోరాను కూడా అరెస్టు చేసి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు.


neha.jpgఇన్నర్‌ సర్కిల్‌ రోడ్లపైకి ప్రవాహం..

నాయకులను నిర్బంధించి సెంట్రల్‌ పార్కు గేట్లకు తాళాలు వేసినప్పటికీ, నిరసనను పోలీసులు అడ్డుకోలేకపోయారు. సెంట్రల్‌ పార్కు చుట్టూ ఉన్న ఇన్నర్‌ సర్కిల్‌ రోడ్డు పైకి సామాన్యులతో పాటు ఏఐఎస్ఎఫ్‌, ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, డీవైఎఫ్‌ఐ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు, ఆప్‌ శ్రేణులు వెల్లువెత్తాయి. ఆప్‌ నేత గోపాల్‌రాయ్‌ ఆధ్వర్యంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. వామపక్ష ఎంపీలు జాన్‌ బ్రిట్టాస్‌, వి. శివదాసన్‌, ఎ.ఎ. రహీం, సంతోష్‌ కుమార్‌ సైతం రోడ్లపైకి వచ్చారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ‘సర్‌’ను రద్దు చేయాలని నినదిస్తూ మార్చ్‌ కొనసాగించారు. సీజేపీ మీడియా ఇన్‌చార్జి విజయ్‌ ముల్లంగి, తదితరులు సెంట్రల్‌ పార్కు వద్దకు చేరుకుని జాతీయ జెండాలను ప్రదర్శించారు. కన్నాట్‌ప్లేస్‌లోని పాలికా బజార్‌ సమీపంలోనూ నిరసనకారులు భారీగా గుమిగూడారు. ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు మార్చ్‌ను అడ్డుకునేందుకు భారీగా రంగంలోకి దిగాయి. జన్‌పథ్‌, కన్నాట్‌ప్లేస్‌, మండిహౌస్‌ పరిసరాల్లో మొత్తం 150 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, సీజేపీ తిరంగా మార్చ్‌ను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంపై ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయకపోతే పాకిస్థాన్‌లో ఎగరేస్తామా? అని ఆప్‌ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ‘‘స్వతంత్ర భారత్‌లో చేతిలో జాతీయ జెండా పట్టుకున్నందుకు యువతను జైల్లో పెడుతున్నారు.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాక మరేంటి? ప్రజాగళాన్ని నియంత్రించలేక మోదీ ప్రభుత్వం భయపడుతోంద’’ని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సీజేపీ శ్రేణులు ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌లో చేపట్టిన తిరంగా ర్యాలీకి అక్కడి పోలీసులు అనుమతినిచ్చారు.


సీజేపీ ఆందోళనలకు సల్మాన్‌ రష్దీ మద్దతు

భారత్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహిస్తున్న ఆందోళనలకు ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ, దర్శకురాలు మీరా నాయర్‌ మద్దతు ప్రకటించారు. న్యూయార్క్‌ నగరంలో గురువారం జరిగిన ‘ఏషియన్‌ అమెరికన్‌ రైటర్స్‌ వర్క్‌షాపు’ విందు కార్యక్రమంలో వారు మాట్లాడారు. ‘‘భారత్‌లో ప్రస్తుతం ఏదో పెద్ద పరిణామం జరుగుతోంది.. దేశం అట్టుడుకుతోంది. ఈ పోరాటాలతో చాలా కాలం తర్వాత భారత యువత మనకు అత్యంత ఆశాజనకమైన క్షణాలను అందించింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వేడుక చేసుకోవాల్సిందే’’ అని సల్మాన్‌ రష్దీ అన్నారు. దర్శకురాలు మీరా నాయర్‌ స్పందిస్తూ.. తనను ‘కాక్రోచ్‌ల అమ్మ’గా అభివర్ణించుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో నిరసనలతో రూ.2వేల కోట్ల వ్యాపార నష్టం? ప్రధాని మోదీకి వర్తక సంఘాల లేఖ

ఢిల్లీలో సీజేపీ నేతల అరెస్టుతో ఉద్రిక్తత.. కన్నాట్ ప్లేస్‌లో జాతీయ జెండా ఎగురవేతకు పిలుపు

Updated Date - Oct 17 , 2026 | 04:19 AM