Share News

ఖార్గ్‌ చుట్టూ యుద్ధం

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:52 AM

అమెరికా, ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధంలో సమీకరణాలు మారుతున్నాయి. ఓ వైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతుండగా..

ఖార్గ్‌ చుట్టూ యుద్ధం

  • కీలక ఇరాన్‌ దీవిని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రణాళికలు.. అందులో భాగంగానే బలగాల తరలింపు

  • ఖార్గ్‌ రక్షణ కోసం ఇరాన్‌ జాగ్రత్తలు

  • దీవి తీరం వెంట మందుపాతరలు

దుబాయ్‌/న్యూఢిల్లీ, మార్చి 26: అమెరికా, ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధంలో సమీకరణాలు మారుతున్నాయి. ఓ వైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతుండగా.. మరోవైపు ఉద్రిక్తలు మరింత పెరిగే పరిణామాలు జరుగుతున్నాయి. ఇరాన్‌కు ఆయువుపట్టు అయిన ‘ఖార్గ్‌’ దీవి వీటన్నింటికీ కేంద్రంగా మారింది. ఆ దీవిని ఆక్రమించుకునేందుకు అమెరికా ప్రణాళికలు వేస్తోందన్న ప్రచారం ఓవైపు.. దాన్ని కాపాడుకునేందుకు ఇరాన్‌ చర్యలు మరోవైపు కలకలం రేపుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రంగా మారుతుందా? చమురు సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్న ట్రంప్‌.. ఇరాన్‌కు కీలకమైన దీవి ఒకదానిని స్వాధీనం చేసుకుని, గెలిచేశామని చెప్తూ.. కాల్పుల విరమణ ప్రకటించవచ్చని రాయిటర్స్‌, ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇటీవల కథనాలు ప్రచురించాయి. ఈ క్రమంలోనే ఖార్గ్‌ దీవి స్వాధీనం దిశగా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని, 82వ ఎయిర్‌బార్న్‌ డివిజన్‌కు చెందిన 2 వేల మంది సైనికుల తరలింపు కూడా అందులో భాగమేనని పేర్కొన్నాయి. నిర్ణయించిన 24 గంటల్లోనే ఆపరేషన్‌లోకి దిగే సామర్థ్యం ఈ డివిజన్‌ సొంతం. ఇక యూఎస్ఎస్ ట్రిపోలి సహా మూడు యాంఫిబియస్‌ యుద్ధ నౌకలు, సుమారు 4,500 మంది మెరైన్‌, యాంఫిబియస్‌ రెడీ గ్రూపు సైనికులను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించింది.

దీవిని ఆక్రమించే కుట్ర: స్పీకర్‌ ఘలీబాఫ్‌

అమెరికా, ఇజ్రాయెల్‌ పశ్చిమాసియాలోని ఒక దేశం సాయంతో ఒక ఇరాన్‌ దీవిని ఆక్రమించుకునేందుకు కుట్ర జరుగుతున్నట్టు తమకు సమాచారం అందిందని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘర్‌ ఘలీబాఫ్‌ తాజాగా పేర్కొన్నారు. వారు దీవిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే.. పశ్చిమాసియాలోని సదరు దేశంలో కీలక వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అయితే ఆ పశ్చిమాసియా దేశం పేరును వెల్లడించలేదు. అయితే ఇరాన్‌ దాడులతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న యూఏఈ అమెరికాకు సాయపడుతున్న స్థానిక దేశమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఖార్గ్‌ రక్షణ కోసం ఇరాన్‌ ముందుజాగ్రత్తలు చేపట్టింది. దీవి చుట్టూ తీరం వెంట మందుపాతరలను ఏర్పాటు చేస్తోంది. అమెరికా యాంఫిబియస్‌ యుద్ధ వాహనాలు వస్తే పేలిపోయేలా యాంటీ ఆర్మర్‌ మందుపాతరలనూ అమర్చుతోంది. రక్షణ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ఈ మేరకు కథనం ప్రచురించింది.


‘అల్‌ మందాబ్‌’నూ మూసేస్తాం: ఐఆర్‌జీసీ

ఖార్గ్‌ దీవి స్వాధీనం దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌ దక్షిణ ప్రాంతంలో శత్రువులు ఏదైనా రెచ్చగొట్టే చర్యకు పాల్పడితే ఎర్ర సముద్రం నుంచి హిందూ మహా సముద్రంలోకి వచ్చే మార్గమైన ‘బాబ్‌ అల్‌ మందాబ్‌’ జలసంధి కూడా మూతపడుతుందని హెచ్చరించింది. ఐఆర్‌జీసీని ఉటంకిస్తూ టాస్నిమ్‌ వార్తా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. కాగా, అవసరమైతే యుద్ధంలోకి దిగేందుకు హౌతీ నేతలు సిద్ధంగా ఉన్నారని రాయిటర్స్‌ వార్తా సంస్థ తాజాగా కథనం ప్రచురించింది. ఇరాన్‌ శత్రువులతో బాగా పోరాడుతోందని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే తాము బరిలోకి వస్తామని హౌతీ నేతలు వెల్లడించినట్టు పేర్కొంది.

ప్రపంచంలో నాలుగో కీలక జలసంధి

ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ, పశ్చిమాసియాలోని యెమెన్‌ మధ్య ఉండే ‘బాబ్‌ అల్‌ మందాబ్‌’ను ప్రపంచంలో కీలకమైన జల సంధులలో నాలుగోదిగా చెబుతారు. ప్రపంచ చమురు రవాణాలో 12శాతం దీనిమీదుగానే జరుగుతుంది. ఆసియా, యూరప్‌ దేశాల మధ్య ఎర్ర సముద్రం, సూయజ్‌ కెనాల్‌ మీదుగా ఎగుమతులు, దిగుమతులకు ఈ జలసంధి కీలకం. ఏటా సుమారు రూ.94 లక్షల కోట్ల (ఒక ట్రిలియన్‌ డాలర్లు) విలువైన సరుకులు రవాణా అవుతాయి. నిజానికి ఇరాన్‌కు ఈ జలసంధితో ఎలాంటి సంబంధం లేదు. కానీ యెమెన్‌లోని హౌతీ తీవ్రవాద సంస్థకు ఇరాన్‌ మద్దతు ఉంది. నిజానికి గత నెల చివర్లో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి మొదలుపెట్టగానే.. ఇరాన్‌కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగి, ‘అల్‌ మందాబ్‌’ జలసంధిలో నౌకలపై దాడులు చేయవచ్చని భావించారు. కానీ సంయమనం పాటించారు. ఇప్పుడు ఇరాన్‌ కోరితే హౌతీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే చమురు సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Mar 27 , 2026 | 04:52 AM