Share News

ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు..దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:50 AM

ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్‌ పురస్కారం వరించింది! 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏటి పద్మ పురస్కారాలను ఆదివారం ప్రకటించింది. విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ..

ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు..దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్‌

  • నటులు మురళీ మోహన్‌, రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ

  • గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌కు మరణానంతరం పురస్కారం

  • తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు విజయ్‌ ఆనంద్‌

  • రెడ్డి, జీవీ రావు, డీఆర్డీవో మాజీ సైంటిస్ట్‌ చంద్రమౌళి, కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డిలకు పద్మశ్రీ

  • పశుపోషణ నిపుణుడు ఎం.రామారెడ్డికి మరణానంతరం!

  • 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  • 5 పద్మవిభూషణ్‌, 13 పద్మభూషణ్‌, 113 పద్మశ్రీ అవార్డులు

  • ఏపీ నుంచి నలుగురు.. తెలంగాణ నుంచి ఏడుగురికి!

  • యూజీసీ మాజీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌, సాంకేతిక నిపుణుడు శశిశేఖర్‌ వెంపటికి పద్మశ్రీ పురస్కారం

  • కేరళలో ముగ్గురికి పద్మవిభూషణ్‌.. అచ్యుతానందన్‌, సుప్రీం మాజీ జడ్జి కేటీ థామస్‌, సీపీఐ నేత నారాయణన్‌

  • ధర్మేంద్రకు విభూషణ్‌, మమ్ముట్టి, శిబుసోరెన్‌కి పద్మభూషణ్‌

  • దేశవ్యాప్తంగా 54 మంది మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీలు

  • పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపిన ప్రధాని

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణుడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాల సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్‌ పురస్కారం వరించింది! 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏటి పద్మ పురస్కారాలను ఆదివారం ప్రకటించింది. విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, సామాజిక సేవ.. ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 133 మంది ప్రముఖులకు 131 పురస్కారాలు (ఇందులో రెండు డ్యుయో కేసులు.. అంటే, ఒకే రంగంలో కృషి చేసిన ఇద్దరికి కలిపి ఇచ్చిన అవార్డులున్నాయి) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మవిభూషణ్‌.. 13 మందికి పద్మభూషణ్‌.. 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఈ 131 మందిలో 19 మంది మహిళలు కాగా.. ఆరుగురు విదేశీ/ప్రవాస/భారతీయ మూలాలున్న/ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా కేటగిరీకి చెందిన వ్యక్తులు.


అలాగే.. 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రకటించారు. సాంకేతికంగా చూస్తే ఏపీ నుంచి నలుగురికి, తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. కానీ, అవార్డులు వరించినవారిలో మొత్తం 14 మంది తెలుగువారు ఉన్నారు. తెలంగాణ నుంచి.. డీఆర్డీవోలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన మాజీ శాస్త్రవేత్త గడ్డమణుగు చంద్రమౌళి, ప్రముఖ మెటీరియల్‌ సైంటిస్ట్‌ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌, హ్యూమన్‌ జెనెటిక్స్‌ అండ్‌ పాపులేషన్‌ స్టడీ్‌సలో విస్తృతంగా కృషి చేసిన సీసీఎంబీ సైంటిస్ట్‌ కుమారస్వామి తంగరాజ్‌, కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డి, ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు గూడూరు వెంకట్‌రావు (జీవీ రావు), మూడు దశాబ్దాలుగా రేడియేషన్‌ ఆంకాలజిస్టుగా సేవలందిస్తున్న విజయ్‌ ఆనంద్‌ రెడ్డి, తెలంగాణ ప్రాంతంలో డెయిరీ రంగాన్ని ఆధునీకరించి అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన మామిడి రామారెడ్డికి (మరణానంతరం) పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. తెలంగాణకే చెందిన ప్రముఖ విద్యావేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌కు (ఈయన స్వగ్రామం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మామిడాల) ఢిల్లీ కోటాలో, హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, ఐఐటీ బాంబేలో విద్యనభ్యసించి, ఇన్ఫోసిస్‌ సహా పలు కంపెనీల్లో పనిచేసిన ప్రముఖ సాంకేతిక నిపుణులు, ప్రసార భారతి సీఈవో, రాజ్యసభ టీవీ సీఈవోగా కూడా పనిచేసిన శశి శేఖర్‌ వెంపటికి కర్ణాటక కోటాలో పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఇక, ఏపీ నుంచి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నవారిలో.. అన్నమయ్య కీర్తనలెన్నింటికో స్వరకల్పన చేసిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ (మరణానంతర పురస్కారం), ప్రముఖ నటులు మురళీ మోహన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రముఖ సంస్కృత పండితుడు, అంతర్జాతీయ సంస్కృత అధ్యయనాల సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. నోరి దత్తాత్రేయుడు ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందినవారే అయినప్పటికీ ఆయనకు అమెరికా కోటాలో పద్మభూషణ్‌ ప్రకటించారు.


ఆ ఐదుగురిలో..

పద్మ అవార్డుల్లో అత్యున్నతమైన పద్మవిభూషణ్‌ వరించిన ఐదుగురిలో ముగ్గురు కేరళకు చెందినవారే కావడం విశేషం. ఆ ముగ్గురూ.. కమ్యూనిస్టు దిగ్గజ నేత, కేరళ మాజీ సీఎం వీఎస్‌ అచ్యుతానందన్‌ (మరణానంతరం), సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేటీ థామస్‌, సీపీఐ నేత పి.నారాయణన్‌. మిగతా ఇద్దరిలో ఒకరు.. ఇటీవలే మరణించిన బాలీవుడ్‌ వెటరన్‌ సూపర్‌స్టార్‌ ధర్మేంద్ర కాగా, మరొకరు ప్రముఖ వాయులీన విద్వాంసురాలు ఎన్‌.రాజం. పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్న 13 మందిలో నోరి దత్తాత్రేయుడితోపాటు.. ప్రముఖ గాయని అల్కా యాజ్ఞిక్‌, మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా పార్టీ వ్యవస్థాపకుడు శిబు సోరేన్‌, శతావధాని ఆర్‌ గణేశ్‌, కాళ్లపట్టి రామస్వామి పళనిస్వామి, వీకే మల్హోత్రా, విజయ్‌ అమృత్‌రాజ్‌, ఉదయ్‌ కోటక్‌ తదితరులున్నారు. అలాగే.. ఈ ఏడాది పద్మపురస్కారాలు అందుకున్నవారిలో నిశ్శబ్దంగా తమ తమ రంగాల్లో కృషి చేస్తున్న 54 మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. పద్మ పురస్కారాలు వరించినవారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డులకు ఎంపికైనవారికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిని ఆయన త్వరలో సన్మానించనున్నారు.

5.jpg2.jpg6.jpg3.jpg

Updated Date - Jan 26 , 2026 | 06:14 AM