Telangana Petition: పోలవరం-నల్లమలసాగర్‌పై తెలంగాణ పిటిషన్ వెనక్కి
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:27 AM
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
సుప్రీంకోర్టు ఆదేశంతో టీ-ప్రభుత్వ నిర్ణయం
సివిల్ సూట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం
త్వరలో దాఖలు చేస్తామన్న ఆ రాష్ట్ర న్యాయవాది
దీనిని జలవివాదంగా పేర్కొన్న ధర్మాసనం
మహారాష్ట్ర, కర్ణాటకతోనూ లింకుందని వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో దాఖలుచేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది జలవివాదమని.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉందని.. వాటిని ప్రతివాదులుగా చేర్చనందున రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రిట్ పిటిషన్ వేయడానికి వీల్లేదని.. అందరి వాదనలూ క్షుణ్ణంగా తెలుసుకుని విచారించేందుకు 131వ అధికరణ కింద సివిల్ దావా (సూట్) దాఖలు చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం సూచించినందున.. పిటిషన్‌ను ఉపసంహరించుకుని సూట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలంగాణ తెలియజేసింది. ధర్మాసనం దీనికి అనుమతించింది. సివిల్ దావా సిద్ధంగానే ఉందని.. త్వరలోనే దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. అంతకుముందు ఆయన వాదనలు వినిపిస్తూ.. సివిల్ దావా ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించాలన్న విషయంలో ఎలాంటి వివాదమూ లేదని.. అయితే 32వ అధికరణ ప్రకారం కూడా తమ రిట్ పిటిషన్‌ను విచారించవచ్చన్నారు. ముళ్లపెరియార్ డ్యాం కేసులాగా ఇది జలవివాదం కాదని.. చట్టాల ఉల్లంఘన అంశం కాబట్టి తమ వ్యాజ్యంపై విచారణ చేపట్టవచ్చని తెలిపారు. ఏకపక్షంగా నదీ జలాల మళ్లింపు విషయంలో ఆర్టికల్ 32 ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఒడిసాకు సంబంధించిన కేసులో కోర్టు పేర్కొందని అన్నారు.
పోలవరం-నల్లమలసాగర్ నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్ ఏకపక్ష చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే ఈ వ్యవహారం జలవివాదం కిందకే వస్తుందని, మహారాష్ట్ర, కర్ణాటకలతో కూడా దీనికి సంబంధం ఉందని ధర్మాసనం అభ్రిపాయపడింది. పోలవరం ప్రాజెక్టు నుంచి వరద జలాల పేరుతో 200 టీఎంసీలను మళ్లించాలని ఏపీ భావిస్తోందని.. ఈ ప్రాజెక్టు నుంచి ఏ మాత్రం అదనంగా మళ్లించినా, ఉపయోగించినా అది గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ఉల్లంఘన కిందకే వస్తుందని సింఘ్వీ అన్నారు. కేటాయింపులను మించి వాడుకునేందుకు ఏపీ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని, దీనివల్ల తెలంగాణ వాటాకు నష్టం వస్తుందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు, జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), ఎపెక్స్ కౌన్సిల్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖల నుంచి తగిన అనుమతులు పొందాలని.. వాటినీ ఉల్లంఘించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సవరణలు చేసే అధికారం ఏపీకి ఏ మాత్రం లేదన్నారు.