సైబర్ మోసాల్లో తెలంగాణ టాప్
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:39 AM
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ నేరాలలో సగానికి పైగా కేసులు ఒక్క తెలంగాణలోనే నమోదయ్యాయని...
దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మూడురెట్లు పెరిగిన ఆన్‌లైన్ మోసాలు.. 2024లో 29,758 కేసుల నమోదు
అందులో ఒక్క తెలంగాణ నుంచే 18,922 నేరాలు
రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 29: దేశవ్యాప్తంగా సైబర్ మోసాలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం సైబర్ నేరాలలో సగానికి పైగా కేసులు ఒక్క తెలంగాణలోనే నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను ప్రకటించారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2024లో సైబర్ కేసులు రికార్డు స్థాయిలో 29,758కి పెరిగాయి. వీటిలో అత్యధికంగా తెలంగాణలో 18,922 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్ 4,020, మహారాష్ట్ర 2,827, ఒడిశా 1,546 ఉన్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మరోవైపు, జమిలి ఎన్నికలు నిర్వహించే అశంపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కాలపరిమితిని రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు పొడిగిస్తూ లోక్‌సభ నిర్ణయం తీసుకుంది.
బర్త్ సర్టిఫికెట్ రూల్స్ కఠినతరం
దేశంలో జనన, మరణాల నమోదులో జరుగుతున్న తీవ్ర ఆలస్యానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రెండేళ్లు దాటిన తర్వాత చేసే జనన, మరణాల నమోదుల ప్రక్రియను మరింత కఠినతరం చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం లోక్‌సభలో ‘జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం రెండేళ్లకు పైబడి ఆలస్యమైన నమోదులకు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అనుమతి తప్పనిసరి.
‘వందేమాతరం’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
వందేమాతరం బిల్లును రాజ్యసభ ఆమోదించింది. జాతీయ గేయంగా ఆలపిస్తున్న వందేమాతరానికి మరింత చట్టబద్ధ రక్షణ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఈ బిల్లును తయారుచేసింది. ఈ గేయం ఆలపించే సమయంలో ఆటంకం కలిగించడం, ఇతర ఉల్లంఘనలకు పాల్పడటాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించాల్సి ఉంది. దేశ ప్రతిష్ఠకు చిహ్నాలుగా రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని(జనగణమన) పరిగణిస్తూ 1971లో తొలిసారి చట్టం చేశారు. వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చట్టానికి సవరణ ప్రక్రియను గత ఏడాది కేంద్ర హోం శాఖ మొదలుపెట్టింది. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టింది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్