సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు సీజే
ABN , Publish Date - Oct 06 , 2026 | 02:52 AM
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్.. సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
పదోన్నతి పొందిన జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్.. సుప్రీం న్యాయమూర్తులుగా మరో ఇద్దరి నియామకం
హైదరాబాద్/న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి) , అక్టోబర్ 5: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్.. సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌తోపాటు గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సునితా అగర్వాల్, జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయలకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. ఈ ముగ్గురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సెప్టెంబరు 28న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సిఫారసుకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజా నియామకాలతో దేశ సర్వోన్నత న్యాయస్థానం జడ్జిల సంఖ్య 37కు చేరింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34 ఉండగా.. ఇటీవల సుప్రీంకోర్టు సవరణ చట్టం-2026 ప్రకారం ఈ సంఖ్యను 38కి పెంచారు. కాగా, సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా ప్రమాణ స్వీకారం చేశారు. 1965 జూలై 7న జన్మించిన జస్టిస్ ఏకే సింగ్.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్, ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1990లో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు పాట్నా హైకోర్టులో, 2001 నుంచి 2012 వరకు ఝార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012 జనవరి 24న ఝార్ఖండ్ హైకోర్టు అదనపు జడ్జిగా, 2014లో ఝార్ఖండ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మూడు నెలలపాటు ఝార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, 2025 జూలై 19న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్