నాసిక్ టీసీఎస్‌లో బలవంతపు మత మార్పిడి యత్నం
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:13 AM
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో.. మతమార్పిళ్లే లక్ష్యంగా ఎనిమిది మంది మహిళా టెకీలపై, ఒక పురుష ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ఐదుగురు టీమ్‌లీడర్లను....
మతమార్పిడి లక్ష్యంగా వేధింపులు
టీసీఎస్‌లో మహిళా టెకీలకు నరకం
నాలుగేళ్లుగా టీమ్ లీడర్ల అరాచకం
ఫిర్యాదు చేసినా పట్టించుకోని మహిళా హెచ్‌ఆర్ అధికారి
పోలీసులకు ఫిర్యాదు.. ఏడుగురి అరెస్టు
దోషులపై కఠిన చర్యలు: టీసీఎస్
నాసిక్, ఏప్రిల్ 13: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కార్యాలయంలో.. మతమార్పిళ్లే లక్ష్యంగా ఎనిమిది మంది మహిళా టెకీలపై, ఒక పురుష ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ఐదుగురు టీమ్‌లీడర్లను, ఒక ఇంజనీర్‌ను, మహిళా హెచ్‌ఆర్ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. వారు నాలుగేళ్లుగా తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు, మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్టు బాధిత యువతులు ఈ నెల 9వ తేదీన నాసిక్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆ మహిళలతోపాటు తనను కూడా నిందితులు మానసికంగా వేధించారని, బలవంతంగా మాంసాహారం తినిపించేవారని, మతం మారాలంటూ బలవంతం చేశారని ఒక పురుష ఉద్యోగి కూడా ఫిర్యాదు చేశాడు. నిందితుల్లో ఇద్దరిపై నాసిక్‌లోని దేవ్‌లాలీ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. మిగిలిన నలుగురిపై లైంగిక వేధింపులు, బలవంతంగా మతం మార్చే ప్రయత్నం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, మానసిక హింసకు గురిచేయడం వంటి అభియోగాల కింద నాకా స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు.. ఏడుగురు మహిళా పోలీసుల అధికారులను అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా ఆ సంస్థలోకి పంపారు. నిందితుల్లో ఒకరు ఆఫీసులో మీటింగ్ జరుగుతున్న సమయంలో మహిళా టెకీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక నిందితుణ్ని మహిళా పోలీసు అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు.. టీమ్ లీడర్లు అసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారూక్ ఖురేషి, రజా మెమోన్, తౌసిఫ్ అత్తర్‌తోపాటు అశ్విన్ చైనానీలపై కేసులు నమోదు చేశారు. ఆ ఆరుగురిని.. వారితోపాటు, బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా, సదరు టీమ్ లీడర్లకు సహకరించిన మహిళా హెచ్‌ఆర్ అధికారి నిధా ఖాన్‌ను కూడా అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదు ప్రకారం.. నిందితులు వారిని శరీర ఆకృతిని అవహేళన చేయడంతోపాటు వారి దుస్తుల గురించి అశ్లీల పదజాలంతో వారి ముఖం మీదే మాట్లాడేవారు. శారీరకంగా హింసించేవారు. వారి మతం ప్రస్తావన తెస్తూ, వారి దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేసేవారు. నిందితుల్లో ఒకరు.. బాధితుల్లో ఒక మహిళను పెళ్లిపేరుతో ప్రలోభ పెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. బాధితులంతా 18-25 ఏళ్ల వారే. బాధితులు పని స్థలంలో తమపై జరుగుతున్న ఈ వేధింపుల గురించి టీసీఎస్ మహిళా హెచ్‌ఆర్ అధికారి నిధా ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆమె వారి ఆవేదనను పట్టించుకోకపోగా... కార్పొరేట్ ఆఫీసుల్లో ఇవన్నీ సహజమేనంటూ నిందితులకు అనుకూలంగా మాట్లాడడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఇది కార్పొరేట్ జిహాద్: బీజేపీ
దేశంలో జరుగుతున్న కార్పొరేట్ జిహాద్‌కు నాసిక్ ఘటనే నిదర్శనమని బీజేపీ నేత బండి సంజయ్ దుయ్యబట్టారు. మంచి ఉద్యోగం, ఆకర్షణీయ వేతనం పేరిట నాసిక్ టీసీఎ్‌సలోని నలుగురైదుగురు ముస్లిం ఉద్యోగులు, కొందరు అధికారులు అక్కడి అమ్మాయిలను లోబరుచుకునే ప్రయత్నం చేశారని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ ఆరోపించారు. నమాజ్‌లో పాల్గొనేలా, రంజాన్ రోజుల్లో ఉపవాసం ఉండేలా యువతులపై ఒత్తిడి చేసేవారని తెలిపారు. నాసిక్ టీసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున నిరసనను తెలిపాయి.
ఆ ఉద్యోగులపై వేటు
అసాంఘిక కార్యకలాపాలను సంస్థలో అనుమతించే ప్రసక్తే లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేశామని టీసీఎస్ వివరణ ఇచ్చింది. ఈ ఘటన పట్ల టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంపై టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌తో అంతర్గత విచారణ జరిపిస్తున్నామని ఆయన తెలిపారు. ‘‘పోలీసుల దర్యాప్తునకు మా సంస్థ అన్ని విధాలా సహకరిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అంతర్గత విచారణలో.. దోషులుగా తేలినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని చంద్రశేఖరన్ తెలిపారు. ఇక, నాసిక్ టీసీఎస్ వ్యవహారాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం (ఎన్‌ఐటీఈఎస్) కేంద్ర కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్లింది. కాగా, నాసిక్ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం, అడిషనల్ పోలీస్ కమిషనర్ హోదా అధికారి నేతృత్వంలో 12 మంది సభ్యులతో ప్రత్యేక పోలీస్ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.