మూడోసారి తల్లైతే ఏడాది పాటు మాతృత్వ సెలవు.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం
ABN , Publish Date - Aug 18 , 2026 | 09:35 PM
మూడోసారి తల్లికాబోతున్న ప్రభుత్వ ఉద్యోగినులకు గతంలో ఇచ్చిన 12 వారాల మాతృత్వ సెలవులను సంవత్సర కాలానికి పొడిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడోసారి తల్లైన ప్రభుత్వ ఉద్యోగినులకు గతంలో ఇచ్చిన 12 వారాల మాతృత్వ సెలవులను సంవత్సర కాలానికి పొడిగించేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి డి.శరత్ కుమార్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం, ఇద్దరి కంటే తక్కువ సంతానం ఉన్న ప్రభుత్వ ఉద్యోగినులకు ఏడాది పాటు పూర్తి జీతంతో కూడిన మాతృత్వ సెలవులు ఇస్తున్నారు. మూడోసారి తల్లైన ప్రభుత్వ ఉద్యోగినులకు మాత్రం 12 వారాల సెలవులే మంజూరు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, తమిళనాడు అసెంబ్లీలో మరో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీవీకే నేత ఆర్. పల్లవి తన నవజాత శిశువుతో అసెంబ్లీకి వచ్చారు. ప్రాంగణంలో ఉన్న తన సహాయకురాలికి బిడ్డను ఇచ్చి సభలో పాల్గొన్నారు. అయితే, ఈ చర్యతో పబ్లిసిటీ కోసం ఎమ్మెల్యే ప్రయత్నించారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ నవజాత శిశువు ఇంట్లో వదిలి రాలేక వెంట తీసుకుని వచ్చానని అన్నారు. ‘ఇలాంటి కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అవతలి వారి బాధను మీరు అర్థం చేసుకోకపోయినా పరవాలేదు కానీ ట్రోలింగ్‌కు మాత్రం దిగవద్దు’ అని హితవు పలికారు.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థుల నిరసనల్లో ఏకే-47తో కాల్పులు.. జిల్లా ఎస్పీ బదిలీ
యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!