Share News

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందుకు ఛాన్స్!

ABN , Publish Date - May 08 , 2026 | 03:10 PM

పశ్చిమ బెంగాల్ సీఎంగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందుకు ఛాన్స్!
Suvendu Adhikari

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ కీలక నేత సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా, సువేందుకు సహాయంగా మంత్రివర్గంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కూడా ఉంటారని సమాచారం.

మీడియా కథనాల ప్రకారం, ఈసారి ఒక మహిళా నేత డిప్యూటీ సీఎంగా ఉండే అవకాశం ఉంది. ఆసంసోల్ దక్షిణ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ నేత అగ్నిమిత్రా పాల్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారని సమాచారం. ఇదే నిజమైతే ఆమె రాష్ట్రంలోని తొలి మహిళా డిప్యూటీ సీఎంగా చరిత్ర సృష్టిస్తారు. ఇక రెండో ఉపముఖ్యమంత్రిగా ఉత్తర బెంగాల్‌ నుంచి ఒక నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. సిలిగురి నుంచి గెలిచిన శంకర్ ఘోష్‌ను డిప్యూటీ సీఎం పదవి వరించవచ్చని సమాచారం. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా కోల్‌కతాలో ఘోష్, పాల్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు.


పశ్చిమబెంగాల్‌లో గత రెండు దశాబ్దాలుగా ఉపముఖ్యమంత్రులు లేరు. అంతకుముందు జ్యోతి బసు ప్రభుత్వంలో సీపీఎం నేత బుద్ధదేబ్ భట్టాచార్జీ డిప్యూటీ సీఎంగా సేవలందించారు. ఇక ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలో సమావేశం కానున్నారు. ఇతర కేబినెట్ మంత్రుల విషయంలో కూడా త్వరలో స్పష్టత రానుంది. ఆ తరువాత కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.

Updated Date - May 08 , 2026 | 03:22 PM