Share News

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తాం! సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:14 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న అన్ని నిర్ణయాలను పరిశీలిస్తామని, చట్టానికి అనుగుణంగా లేని వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది

ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే  రద్దు చేస్తాం! సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
SUPREMECOURT Judges

  • ఈసీ నిర్ణయాలు చట్టవ్యతిరేకంగా ఉంటే

రద్దు చేస్తాం!

  • ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో నిర్ణయాలు ఉండాలి.. చట్టం అదే చెబుతోంది

  • ఫారం-6లో ఎలాంటి మార్పులనూ మేం అంగీకరించలేదు

  • రికార్డులను పరిశీలించి మార్పులు ఎవరు చేశారో చూస్తాం

  • ఈసీ పనితీరు చట్టవ్యతిరేకంగా ఉంటే పర్యవసానాలు తప్పవు

  • కోర్టు శక్తిసామర్థ్యాలు మీకు తెలుసు.. విచారణ నుంచి

సీఈసీకి కల్పిస్తున్న రక్షణను పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు

  • సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ‘ఏకపక్ష నిర్ణయాల’పై దాఖలైన

వ్యాజ్యాల మీద విచారణలో ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

  • పత్రికల్లో వార్తల ఆధారంగా ఆదేశాలివ్వలేమని స్పష్టీకరణ

  • జ్ఞానేశ్‌ను సస్పెండ్‌ చేస్తే ఈసీ ఎలా పని చేస్తుందని ప్రశ్న

  • వారంలోపు స్పందించాలంటూ ఈసీకి, కేంద్రానికి నోటీసులు

ఈసీ ఎలా పని చేయాలో చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. దానిని వాళ్లు అనుసరిస్తున్నారనే భావిస్తున్నాం. ఎలాంటి ఉల్లంఘన ఉన్నా మేం దాన్ని కొట్టేయగలం. చట్టప్రకారం ఈసీ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో తీసుకున్నవి అయి ఉండాలి. అలా కాకుండా తీసుకున్న నిర్ణయాలను కోర్టు కొట్టివేస్తుంది. కోర్టుకున్న శక్తిసామర్థ్యాలు ఏమిటో మీకు తెలుసు!

- సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న అన్ని నిర్ణయాలను పరిశీలిస్తామని, చట్టానికి అనుగుణంగా లేని వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ’ (ఎస్‌ఐఆర్‌) సందర్భంగా ఈసీ ఉపయోగిస్తున్న ఫారం 6లో ఎటువంటి మార్పులకు తాము అంగీకరించలేదని తెలిపింది. ఈసీ నిర్ణయాలన్నీ కూడా ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీతో కూడినవి అయి ఉండాల్సిందేనని, ఇప్పటి వరకూ ఈసీ ఈ విధంగానే నిర్ణయాలు తీసుకున్నట్లు భావిస్తున్నామని పేర్కొంది. ఈసీ పనితీరు చట్టవ్యతిరేకంగా ఉంటే దానికి పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది.


సర్‌లో, ఫారం-6లో మార్పులకు సంబంధించి ఈసీలో ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను తోసిరాజంటూ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇటీవల ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలపై (పిల్‌) సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యాబాగ్చీ, జస్టిస్‌ మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్లు రాకేశ్‌కుమార్‌సింగ్‌, శైలేంద్రమణి త్రిపాఠి తరఫున సీనియర్‌ న్యాయవాదులు వికాస్‌సింగ్‌, మేనక గురుస్వామి, వాదనలు వినిపించారు.

ఫారం 6లో సీఈసీ ఏకపక్ష మార్పులు

ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫారం 6లో.. గత ఎస్‌ఐఆర్‌లో తమ పేరు/ తల్లిదండ్రుల పేరు/ తాత నానమ్మల పేరు ఉందా అన్న విషయం తెలపాలంటూ ఈసీ సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేశారని మేనక గురుస్వామి పేర్కొన్నారు. సంబంధిత చట్టానికి సవరణ చేయకుండా ఈ మార్పు చేయటానికి వీల్లేదంటూ ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అమలు పరిచారని తెలిపారు. అంతేగాక, ఈ మార్పును సుప్రీంకోర్టు సైతం ఆమోదించిందంటూ ఈసీ గత నెల 26వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. బిహార్‌ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సందర్భంగా ఈ ఏడాది మేలో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఫారం 6 సవరణలను సమర్థించిందని ఆ ప్రకటనలో పేర్కొందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘దీనిపై స్పష్టతనివ్వాల్సిందే. ఫారం 6లో ఎటువంటి మార్పులకూ మేం అంగీకరించలేదు. రికార్డులను మాకు సమర్పించినప్పుడు.. ఆ మార్పులు ఎవరు చేశారో చూస్తాం’ అని స్పష్టం చేసింది. ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం, 2023’లోని సెక్షన్‌ 18 ప్రకారం ఏదైనా ఒక అంశంపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తుందని మేనక గురుస్వామి గుర్తు చేశారు.


ఇంత స్పష్టంగా చట్టం ఉన్నప్పటికీ, ఫారం 6లో సవరణలకు సంబంధించి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ సొంత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ విధంగా సీఈసీ ఏకపక్షంగా తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ మార్పులు, నిర్ణయాలు, మార్గదర్శకాలు అన్నింటినీ కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గోవాలో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 96 మంది అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చాలంటూ అధికారులు పేర్కొన్నప్పటికీ.. వారి పేర్లను తిరిగి చేర్చే ఫీచర్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లో లేదని పేర్కొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో కోర్టులు పునరుద్ధరించిన ఓటర్ల పేర్లకు వ్యతిరేకంగా 16.10 లక్షల అప్పీళ్లు ఈసీ పేరుతో దాఖలయ్యాయని, వీటి గురించి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషనర్‌గానీ, ఈసీలోని ఇద్దరు కమిషనర్లకుగానీ తెలియదని, వాటిని వారు ఆమోదించనూ లేదని మేనక గురుస్వామి తెలిపారు. వీటన్నింటిపై గత పది నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌సంధూ, వివేక్‌జోషి 14సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ కథనాన్ని గుర్తు చేశారు.

జ్ఞానేశ్‌ను సస్పెండ్‌ చేస్తే ఎలా?

న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈసీలో నిర్ణయాలన్నీ సమష్టిగా తీసుకోవాల్సి ఉండగా, ఆ విధానాన్ని జ్ఞానేశ్‌కుమార్‌ ఉల్లంఘించారని, దీనిపై ఆయన మీద క్రిమినల్‌ విచారణకు ఆదేశించాలని కోరారు. జ్ఞానేశ్‌కుమార్‌ కారణంగా దేశంలోని ప్రతీ పౌరుడు తన ఓటుహక్కు గురించి ఆందోళన చెందుతున్నారని, ఆయన ఇకపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించాలని, సస్పెండ్‌ చేయాలన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సీఈసీని సస్పెండ్‌ చేస్తే ఈసీలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోతాయి. ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు’ అని ప్రశ్నించింది. ది.


దీనికి వికాస్‌సింగ్‌ బదులిస్తూ.. ఇద్దరు కమిషనర్లు ఈసీ విధులను చూసుకోగలరన్నారు. కనీసం ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో నిర్ణయాలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలని వికాస్‌సింగ్‌ కోరారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ‘ఈసీ ఎలా పని చేయాలో చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. దానిని వాళ్లు అనుసరిస్తున్నారనే భావిస్తున్నాం. ఎలాంటి ఉల్లంఘన ఉన్నా మేం దాన్ని కొట్టేయగలం. చట్టప్రకారం ఈసీ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీతో తీసుకున్నవి అయి ఉండాలి. అలా లేకుండా తీసుకున్న నిర్ణయాలను కోర్టు కొట్టివేస్తుంది. కోర్టుకున్న శక్తిసామర్థ్యాలు ఏమిటో మీకు తెలుసు!’ అని తెలిపారు. తీర్పు వెలువడేంతవరకూ సీఈసీ నిర్ణయాలు తీసుకోకుండా ఆదేశించాలన్న విజ్ఞప్తిని కూడా జస్టిస్‌ సూర్యకాంత్‌ అంగీకరించలేదు. ఈసీ, కేంద్రప్రభుత్వాల స్పందనలు ఏమిటో తెలుసుకోకుండా, కేవలం వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఆదేశాలు జారీ చేయలేమన్నారు. సీఈసీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పదవిలో ఉన్నప్పుడేగాక, పదవీ విరమణ తర్వాత కూడా.. ఎటువంటి న్యాయవిచారణ ఎదుర్కోకుండా రక్షణ కల్పిస్తూ ఇటీవల చట్టంలో చేసిన మార్పులను వికాస్ సింగ్ ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ తరహా రక్షణలు జడ్జిలకు కూడా లేవని వ్యాఖ్యానించింది. వీటిని సమీక్షిస్తామని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో స్పందించాలంటూ ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 05:29 AM