వందేమాతరం పాడడం తప్పనిసరేం కాదు!
ABN , Publish Date - Mar 26 , 2026 | 06:09 AM
అధికారిక కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలంటూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు...
కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల్లో అలా చెప్పలేదు
పాడకపోతే చట్టపరమైన
చర్యలుంటాయని కూడా పేర్కొనలేదు
అనవసరంగా ఆందోళన చెందుతున్నారు
పిటిషన్‌ను విచారించలేం: సుప్రీంకోర్టు
దేశభక్తిపై బలవంతం చేయలేరన్న పిటిషనర్
జాతీయ గేయం విషయంలోనూ చేయలేరా?
పిటిషనర్‌ను ప్రశ్నించిన సీజేఐ
న్యూఢిల్లీ, మార్చి 25: అధికారిక కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలంటూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పాడడం తప్పనిసరేమీ కాదని పేర్కొంది. వందేమాతరం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్కడా పేర్కొనలేదన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిల ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను పరిణతి లేని/తొందరపాటు చర్యగా అభివర్ణించింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై పిటిషనర్ మహమ్మద్ సయీద్ నూరి అనవసర ఆందోళనకు గురవుతున్నట్లు అనిపిస్తోందని అతని తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేతో జస్టిస్ బాగ్చి అన్నారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ కూడా ఏకీభవించారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సలహా మాత్రమేనని పేర్కొన్నారు. ‘‘ఇది అనవసర అనుమానమే. వందేమాతరం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటే గనక మీరు కోర్టును ఆశ్రయించండి’’ అని జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్‌కు తెలిపారు. దేశభక్తిపై బలవంతం చేయలేరని హెగ్డే పేర్కొనగా.. ‘‘జాతీయ గీతం విషయంలో కూడా దాన్ని బలవంతం చేయలేరా?’’ అని సీజేఐ ప్రశ్నించారు. దేశభక్తిని బలవంతం చేయలేమని.. రాజ్యాంగం వ్యక్తిగత మనస్సాక్షిని కాపాడాలని హెగ్డే చెప్పారు. మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తోందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్
జస్టిస్ బాగ్చి స్పందిస్తూ.. ఈ అభిప్రాయంతో చాలా మంది విభేదిస్తారని చెప్పారు. ఆంక్షలు లేకుండా ఒక సలహా జారీ చేస్తే, దాన్ని అమలు చేయడానికి, దానికి అనుగుణంగా నడుచుకోవాలని బెదిరించడానికి అనేక మార్గాలు ఉన్నాయని హెగ్డే పేర్కొన్నారు. ‘కేంద్ర ఉత్తర్వుల్లో శిక్షార్హమైన పరిణామాలు ఉంటాయని ఎక్కడా పేర్కొనలేదు. మీ అకాడమీ లేదా స్కూల్‌లో పాడాలని ఎవరూ ఆదేశించలేదు’ అని సీజేఐ పిటిషనర్ న్యాయవాదితో అన్నారు. ‘ఇది ఒక ప్రొటోకాల్ మాత్రమే. జాతీయ జెండాకు కూడా ప్రొటోకాల్ ఉంది. జెండాను ఎగురవేసినప్పుడు ఏం చేయాలనే అంశాలు అందులో ఉంటాయి’ అని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. మరో అంశంపై కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘జాతీయ గేయాన్ని గౌరవించాలని కూడా మనం సలహా ఇవ్వాలా?’ అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(ఎ) ప్రకారం రాజ్యాంగానికి, దాని ఆదర్శాలు, సంస్థలు, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. హెగ్డే స్పందిస్తూ.. అందులో వందేమాతరం ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. జాతీయ గీతం విషయంలో దేశభక్తిని బలవంతం చేయలేమంటూ గతంలో ఇదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ‘‘జాతీయ గేయం పాడడం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో ఉంటే గనక మీ వాదనలను అభినందిస్తాం. కానీ, అలాంటిదేమీ లేదు. శిక్షార్హమైన పరిణామాలు, ఆంక్షలు లేవు’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని వివక్షాపూరితంగా వ్యవహరించినా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు జారీ చేసినా న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్