ఆలయాల్లో మహిళల ప్రవేశంపై 9మంది సభ్యుల బెంచ్
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:10 AM
శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సహా, ఇతర ప్రార్థన స్థలాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశంపై తుది విచారణకు 9మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సోమవారం...
మసీదులు, ఇతర ప్రార్థన స్థలాలపైనా పరిశీలన
మునుపటి తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సహా, ఇతర ప్రార్థన స్థలాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశంపై తుది విచారణకు 9మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సోమవారం సుప్రీంకోర్టు ప్రకటించింది. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సమీక్ష జరపనుంది. ఆ తీర్పుకు అనుకూలంగా కొన్ని, ప్రతికూలంగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై విచారణకు 9మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఏప్రిల్ 7న వాదనలు మొదలయి 22న ముగుస్తాయని పేర్కొన్నారు. మార్చి 14లోగా లిఖితపూర్వక వాదనలు సమర్పించాల్సి ఉంటుంది. తీర్పును సమీక్షించాలని కోరుతున్న పక్షాల తరఫున న్యాయవాది కృష్ణ కుమార్ సింగ్ నోడల్ కాన్సెల్‌గా, వ్యతిరేకిస్తున్న వారి తరఫున న్యాయవాది శాశ్వతి పారి నోడల్ కాన్సెల్‌గా వ్యవహరిస్తారని సీజేఐ తెలిపారు. సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్, న్యాయవాది శివం సింగ్‌లు కోర్టు మిత్రులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వివిధ ఆచారాల వెనుక ఉన్న మతస్వేచ్ఛపైనా సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. శబరిమలలో 10-50ఏళ్ల వయసు ఉన్న మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018లో 4:1మెజార్టీతో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రార్థన స్థలాల్లో మహిళల పట్ల ఉన్న వివక్షను అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని 2019లో మరో అయిదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయించింది. దీంట్లో మసీదులు, దర్గాల్లో మహిళల ప్రవేశం, పార్సీ మహిళల సమస్యలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై విస్తృత ధర్మాసనాలు ఏర్పాటు చేసే అధికారం ఉందంటూ 2020లో ఇంకో అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే కరోనా కారణంగా అప్పట్లో విస్తృత ధర్మాసనం ఏర్పాటు కాలేదు. దాన్ని ఏర్పాటు చేస్తూ తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో వైఖరిని స్పష్టం చేస్తూ సరైన అఫిడవిట్‌ను కోర్టులో సమర్పించాలని కేరళలోని పినరయ్ విజయ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీలు డిమాండు చేశాయి.
డాటా ప్రొటెక్షన్ చట్టంపై నోటీసులు
డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటక్షన్(డీపీడీపీ) చట్టం-2023ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సమాధానం ఇవ్వాలని సీజేఐ ఆధ్వర్యంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే నిబంధనల అమలుపై స్టే మంజూరుకు మాత్రం నిరాకరించింది. నిబంధనల్లోని ‘విశ్వాస పాత్రత’కు సంబంధించిన క్లాజులపై పిటిషనర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారాన్నయినా తీసుకునేందుకు అవకాశాలు ఉండడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..