‘టీఎన్జీవో భూమి’ కేసులు కలిపి విచారిస్తాం
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:50 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవోస్) భూ అక్రమ రిజిరేస్టషన్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది...
ఒకే భూమికి సంబంధించి క్రిమినల్, సివిల్ అప్పీల్స్
అందువల్ల కలిపి విచారించటమే సబబు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవోస్) భూ అక్రమ రిజిరేస్టషన్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భూములపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్, సివిల్ అప్పీల్ పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని సర్వే నెం.156/1/2లో ఉన్న టీఎన్జీవోస్ హౌస్‌బిల్డింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ స్థలాలను నకిలీ పత్రాలతో విక్రయించారు. ఈ వ్యవహారంలో అప్పటి కూకట్‌పల్లి జాయింట్ సబ్-రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతోపాటు శంకరమంచి సత్యనారాయణ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ భూములపై 2013 నుంచి సివిల్ వివాదం కూడా నడుస్తోంది. ఈ రెండు కేసులపై సుప్రీంకోర్టులో అప్పీల్స్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. క్రిమినల్ కేసులో నిందితుడైన కూకట్‌పల్లి మాజీ జాయింట్ సబ్-రిజిస్ర్టార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన పేరును కేసు నుంచి తొలగిస్తూ (అబేటెడ్) ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ‘బండారి రామచందర్ వర్సెస్ మైత్రీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ పేరుతో 2013 నుంచి ఒక సివిల్ అప్పీల్ (నెం. 10699/2013) పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఆ సివిల్ పిటిషన్‌తోపాటే క్రిమినల్ పిటిషన్‌ను కూడా కలిపి విచారించాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. వేసవి సెలవుల అనంతరం తుది విచారణ జరుపుతామని వెల్లడించింది.