Share News

పెళ్లికి ముందు శారీరక బంధం..‘క్యారెక్టర్‌’కు కొలమానం కాదు

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:11 AM

పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి ‘క్యారెక్టర్‌’కు కొలమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

పెళ్లికి ముందు శారీరక బంధం..‘క్యారెక్టర్‌’కు కొలమానం కాదు

  • ఇద్దరు మేజర్ల ఇష్టపూర్వక బంధాన్ని ఏ చట్టమూ నిషేధించలేదు

  • రాజీపడడమంటే తప్పు చేశానని ఒప్పుకొన్నట్టు కాదు

  • నిర్దోషిగా విముక్తి పొందినా ఉద్యోగాన్నినిరాకరించడం ఏకపక్షమే

  • తక్షణమే ఆ అభ్యర్థికి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇవ్వండి

  • తెలంగాణ యువకుడి కేసులో.. పోలీసు బోర్డుకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకోవడం వారి ‘క్యారెక్టర్‌’కు కొలమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. సమకాలీన సమాజంలో మారుతున్న సామాజిక వాస్తవాలను నియామక బోర్డులు గుర్తించాలని హితబోధ చేసింది. ప్రతి ప్రేమకథా పెళ్లితోనే ముగియాలని నియమమేమీ లేదని.. బంధం విఫలమైనంత మాత్రాన ఒకరు మరొకరిని మోసం చేసినట్లు కాదని స్పష్టం చేసింది. లోక్‌అదాలత్‌లో ఇరుపక్షాలు రాజీ పడినంత మాత్రాన.. దానిని నేరాంగీకారంగా (తప్పు చేశానని ఒప్పుకొన్నట్లుగా) భావించడం నియామక బోర్డు అజ్ఞానమేనని మందలించింది. ఒక విఫలమైన ప్రేమ వ్యవహారం నేపథ్యంలో నమోదైన క్రిమినల్‌ కేసు ఆధారంగా.. కానిస్టేబుల్‌గా ఒక అభ్యర్థి ఎంపికను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు అభ్యర్థికి తక్షణమే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి సెలెక్ట్‌ అయ్యాడు. అయితే, గతంలో అతనిపై ఐపీసీ సెక్షన్లు 417, 420, 506 కింద ఒక క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో రిక్రూట్‌మెంట్‌ బోర్డు అతని నియామకాన్ని రద్దు చేసింది. తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లు తనతో బంధంలో ఉండి, ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అతని ఇంటి పక్కన ఉండే యువతి 2014లో కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి 2015లో.. ఇద్దరి మధ్య లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిరింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడే తనపై ఉన్న ఈ కేసు వివరాలన్నింటినీ తిరుపతి అప్లికేషన్‌ ఫామ్‌లో నిజాయితీగా రాశాడు. ఏ విషయాన్నీ దాచలేదు. అయినా సరే, అతను మోసానికి పాల్పడ్డాడని రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు భావించి, అతనిని పక్కన పెట్టేశారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్‌ జడ్జి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఆ తీర్పును పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ జడ్జి తీర్పును తప్పుబట్టింది. బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ క్రమంలో తిరుపతి.. గత ఏడాది ఆగస్టు 20న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్‌ మనోజ్‌మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవలే ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. దీనికి సంబంధించిన తీర్పు ప్రతిని రిజిస్ట్రీ.. సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం అప్‌లోడ్‌ చేసింది.


ఇష్టారాజ్యం కుదరదు..

ఈ తీర్పులో ధర్మాసనం పలు కీలక అంశాలను పొందుపరచింది. కేసుల నుంచి నిర్దోషిగా విడుదలైనప్పటికీ.. ఒక అభ్యర్థి ఉద్యోగానికి అర్హుడా? కాదా? అని చూసే హక్కు నియామక బోర్డులకు ఉంటుందని.. అలాగని ఆ నిర్ణయాలు ఇష్టారాజ్యంగా ఉండకూడదని స్పష్టం చేసింది. కేసు కొట్టేసినా లేదా రాజీ పడినా, సదరు అభ్యర్థి నిజంగానే తప్పు చేశాడని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసులో తిరుపతి, ఆ అమ్మాయి ఇద్దరూ మేజర్లని, పైగా నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని కోర్టు గుర్తు చేసింది. అతడిపై అత్యాచారం ఆరోపణలు లేవని, లోక్‌ అదాలత్‌లో వాళ్లు ఎవరి బలవంతం లేకుండానే రాజీ పడినట్లుగా అర్థమవుతోందని గుర్తుచేసింది. లోక్‌ అదాలత్‌లో రాజీ పడ్డారంటేనే తప్పు ఒప్పుకొన్నట్లు అని బోర్డు అనుకోవడం పూర్తిగా తప్పు అని ధర్మాసనం అభిప్రాయపడింది. మారుతున్న సామాజిక పరిస్థితులను నియామక బోర్డులు గుర్తించాలని సూచించింది. ‘‘ఇలాంటి పెళ్లికి ముందరి బంధాలు రానురానూ సర్వసాధారణంగా మారిపోతున్నాయి. పెళ్లికాని ఇద్దరు మేజర్లు ఇష్టపడి శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన, వాళ్ల క్యారెక్టర్‌ మంచిది కాదనే తప్పుడు అంచనాకు రాకూడదు. ఇద్దరు మేజర్లు తమకు నచ్చిన బంధంలో ఉండటాన్ని దేశంలో ఏ చట్టమూ నిషేధించలేదు. అలాగే, ప్రతి ప్రేమ బంధమూపెళ్లితోనే ముగియాలనే నియమమేమీ లేదు. బ్రేకప్‌ అయినంత మాత్రాన ఒకరు ఇంకొకరిని మోసం చేశారని అనుకోలేం. తను మోసపోయానని చెప్పాల్సింది ఆ అమ్మాయే కదా? కానీ ఆమె కేసును ముందుకు తీసుకెళ్లకుండా రాజీ పడిపోయినప్పుడు ఇక మోసం జరిగిందని ఎలా అంటారు?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో గొడవలు, హింసకు పాల్పడి కోర్టు బయట రాజీ పడిన వారికి ఉద్యోగాలు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఇది అలాంటి కేసు కాదని గుర్తుచేసింది. ఇది ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విషయమని, అమ్మాయే ఆరోపణలు వెనక్కి తీసుకున్నాక అసలు మోసం జరిగిందనడానికి సాక్ష్యమే లేదని వ్యాఖ్యానించింది. ఒక ఉద్యోగి నియామకాన్ని నిరాకరించే ముందు, నేరం జరిగిందనడానికి, ఆ నేరంతో అభ్యర్థికి సంబంధం ఉందనడానికి బలమైన ఆధారాలు ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నియామక బోర్డు (స్ర్కీనింగ్‌ కమిటీ) తీసుకున్న నిర్ణయం తప్పు అని తేల్చి చెప్పింది. అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును పునరుద్ధరిస్తూ, తక్షణమే సదరు అభ్యర్థికి కానిస్టేబుల్‌గా పోస్టింగ్‌ ఇవ్వాలని తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Jun 09 , 2026 | 04:11 AM