Share News

అంత దాపరికం ఎందుకు?

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:47 AM

నీట్‌-పీజీ పరీక్షల ప్రశ్నపత్రాలు, ఆన్సర్‌ ‘కీ’ల విడుదల విషయంలో నేషనల్‌ బోర్డు ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) అనుసరిస్తున్న విధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంత దాపరికం ఎందుకు?
SUPREMECOURT

  • నీట్‌-పీజీ ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు ఇవ్వకపోవడం,

  • ఆన్సర్‌ కీలను పరిమితంగా విడుదల చేయడంపై సుప్రీం

న్యూఢిల్లీ, నవంబరు 2: నీట్‌-పీజీ పరీక్షల ప్రశ్నపత్రాలు, ఆన్సర్‌ ‘కీ’ల విడుదల విషయంలో నేషనల్‌ బోర్డు ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) అనుసరిస్తున్న విధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నీట్‌-పీజీ పరీక్షల అన్సర్‌ ’కీ’లను పరిమితంగానే విడుదల చేయాలని ఎందుకు పట్టుబడుతున్నారో వివరణ ఇవ్వాలని సోమవారం ఆదేశించింది. అదేవిధంగా అభ్యర్థులు ప్రశ్నపత్రం కాపీని తమ వద్ద ఉంచుకోవడానికి అనుమతించడం పరీక్షల సమగ్రతకు ఏ విధంగా భంగం కలిగిస్తుందో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధే ధర్మాసనం కోరింది. పారదర్శకతలో భాగంగా ప్రశ్నపత్రం, అన్సర్‌ ‘కీ’లను, పరీక్షలో అభ్యర్థులు ఇచ్చిన సమాధానాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం, నీట్‌-పీజీ పరీక్ష-2026కు సంబంధించిన పలు ఇతర సమస్యలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎన్‌బీఈఎంఎస్‌ తరఫు న్యాయవాది నీమా వాదనలు వినిపిస్తూ.. సైన్స్‌ అయినందువల్ల నీట్‌ పీజీ క్వశ్చన్‌ బ్యాంక్‌ చాలా పరిమితంగా ఉందని, అది ఒక దేశ ఆస్తి వంటిదని పేర్కొన్నారు. ఏటా ప్రశ్నలను బయటపెట్టడం మొదలు పెడితే, రాబోయే ఐదారేళ్లలో తమ ప్రశ్నలన్నీ కోటాలోని కోచింగ్‌ సెంటర్లకు చేరుతాయని పేర్కొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 06:47 AM