బిడ్డను కన్నాక అత్యాచారం కేసు ఏంటి?
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:56 AM
సుదీర్ఘకాలం సహజీవనం చేసి ఓ బిడ్డను కూడా కని.. ఇప్పుడు ఆ బంధం వీగిపోయాక అత్యాచారం కేసు పెట్టడమేంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పరస్పరం అంగీకారంతో...
పరస్పర అంగీకారంతో పెళ్లికి ముందే సంబంధం కొనసాగించాక నేరమెక్కడిది?
సహజీవన బంధాలు, లైంగిక దాడులకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలి: సుప్రీం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: సుదీర్ఘకాలం సహజీవనం చేసి ఓ బిడ్డను కూడా కని.. ఇప్పుడు ఆ బంధం వీగిపోయాక అత్యాచారం కేసు పెట్టడమేంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. పరస్పరం అంగీకారంతో సంబంధం కొనసాగించినప్పుడు నేరం అనే ప్రశ్న ఎలా తలెత్తుతుందని నిలదీసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడంటూ ఓ వితంతువు మాజీ సహజీవన భాగస్వామిపై పెట్టిన కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేయగా.. ఆ తీర్పును ఆమె సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. తాజాగా ఆ పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన సహజీవన బంధాలు, లైంగిక దాడులకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ‘ఆమె అతడితో 15 ఏళ్లు కలిసి జీవించింది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. వారి మధ్య వివాహ బంధం లేదు కాబట్టి అతడు బయటికి వెళ్లిపోతాడు. సహజీవనంలో ఉండే ప్రమాదమే అది. అతడు బంధం నుంచి వైదొలిగినంత మాత్రన అది నేరంగా పరిగణించలేం’ అని స్పష్టం చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘ఆమె 18 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లి కూడా అయ్యింది. మరికొందరు మహిళలతోనూ సంబంధాలున్నాయి’ అని చెప్పారు. అయితే ఆమె పెళ్లి చేసుకోవడానికి బదులుగా ఎందుకు కలిసి జీవించడానికి అంగీకరించిందని.. ఇన్నేళ్లు ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఉన్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం