హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోరేం?
ABN , Publish Date - Apr 28 , 2026 | 07:20 AM
బతుకమ్మ కుంట స్థల వివాదంలో హైడ్రా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ‘యథాతథ స్థితి’ (స్టేటస్ కో) ఉత్తర్వులను పట్టించుకోకుండా...
హైడ్రా తీరుపై సుప్రీంకోర్టు అసహనం
బతుకమ్మ కుంట స్థల వివాదంపై విచారణ
4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైడ్రాకు ఆదేశం
తదుపరి విచారణ మే29కి వాయిదా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : బతుకమ్మ కుంట స్థల వివాదంలో హైడ్రా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ‘యథాతథ స్థితి’ (స్టేటస్ కో) ఉత్తర్వులను పట్టించుకోకుండా డ్రైనేజీ పనుల సాకుతో పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు నిర్మించడాన్ని సోమవారం ధర్మాసనం తప్పుబట్టింది. ఈ వ్యవహార శైలిపై హైడ్రాను వివరణ కోరింది. తదుపరి విచారణను మే 29కి వాయిదా వేసింది. వివరాలివీ... బతుకమ్మకుంటలో యథాతథస్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా సుందరీకరణ పనులు చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుధాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ పి.మధుసూదనరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.... గత ఏడాది జూన్ 12న హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వరద నివారణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉందని, భూమి స్వరూపం మార్చరాదని, పిటిషనర్ హక్కులకు భంగం కలిగించరాదని స్పష్టంగా ఉందని పేర్కొంది. అయితే, కోర్టుకు సమర్పించిన ఫొటోల ప్రకారం డ్రైనేజీ పనుల పేరుతో ప్రారంభమైన పనులను విస్తరించి పిల్లల ఆటస్థలం, వాకింగ్ ట్రాక్, గార్డెన్, బోర్లు వేయడం వంటి పనులు చేపట్టినట్లు తేలిందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బతుకమ్మకుంట పేరుతో గేట్లు ఏర్పాటు చేసి నిర్దిష్ట వేళల్లో ప్రజలకు ప్రవేశం కల్పిస్తూ దాన్ని పార్కుగా మార్చినట్లుగా ఉందని వెల్లడించింది.
ఈ చర్యలన్నిటితో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని తేల్చి చెప్పింది. అనంతరం ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఈ నెల 15న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. హైడ్రా తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ హైడ్రా డ్రైనేజీ పనుల పేరుతో వాటిని ఉల్లంఘించినట్లు హైకోర్టు గుర్తించిందని.. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చింది? ఆ తర్వాత హైడ్రా చేపట్టిన పనులేంటి? అనే విషయాలపై నాలుగు వారాల్లో సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 29కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం