ఈగను చంపడానికి.. సుత్తిని వాడతారా?
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:52 AM
సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ట్రాఫిక్ రాకపోకలను పూర్తిగా నిషేధించడం, మెట్రోస్టేషన్లను మూసివేయడం, రైళ్ల సేవలు నిలిపివేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది.
నిరసనలు ఆపడానికి ప్రజాజీవితాన్ని స్తంభింపజేస్తారా?
పోలీసుల చర్యలు అవసరానికి మించి ఉన్నట్టు కనిపిస్తున్నాయి
తగిన నియంత్రణలతో ఢిల్లీలో మెట్రో రైళ్లు నడపండి
పోలీసులకు సుప్రీం ఆదేశాలు
నిరసనలు ఆపడానికి ప్రజా జీవితాన్ని స్తంభింపజేయడం సరికాదు: సుప్రీం
న్యూఢిల్లీ, అక్టోబరు 9: సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ట్రాఫిక్ రాకపోకలను పూర్తిగా నిషేధించడం, మెట్రోస్టేషన్లను మూసివేయడం, రైళ్ల సేవలు నిలిపివేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్య రావొచ్చనే ముందస్తు అంచనాలతో ప్రజా జీవితాన్ని స్తంభింపజేయవద్దని పేర్కొంది. ఇది ఈగను చంపడానికి సుత్తిని వాడుతున్నట్టు ఉందని వ్యాఖ్యానించింది. సీఈసీ రాజీనామా డిమాండ్‌తో సీజేపీ ఆందోళన నేపథ్యంలో 57 మెట్రోస్టేషన్లను శుక్రవారం అర్ధరాత్రి నుంచి మూసివేయాలని, న్యూఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లకు తాత్కాలికంగా రైళ్ల సేవల నిలిపివేత, జంతర్‌మంతర్ పరిసరాల్లో ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ.. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, ప్రశాంత్ భూషణ్, బృందా గ్రోవర్ తదితరులు వాదనలు వినిపించారు. ఆంక్షలతో లక్షలాది మంది సాధారణ ప్రజలు ఇబ్బందిపడతారన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా వాదిస్తూ.. శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు వివరించారు. దీనిపై సీజేఐ ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసుల చర్యలు అవసరానికి మించి ఉన్నట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీనిపై తుషార్ మెహతా స్పందిస్తూ.. ఆంక్షల అంశంలో ధర్మాసనం సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అయితే వీటి అమలు విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టవచ్చనే దానిపై కచ్చితమైన హామీ ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఇదిలా ఉండగా, దేశ రాజధానిలో శాంతియుత నిరసనల కోసం జంతర్‌మంతర్‌కు ప్రత్యామ్నాయంగా మరో ప్రదేశాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ ధర్మాసనం సూచించింది. నిరసనకారులకు అనువైన, కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండే వేదికను గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్