Share News

అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తోంది!

ABN , Publish Date - May 15 , 2026 | 04:14 AM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), కమిషనర్ల నియామక ప్రక్రియ తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ప్రశ్నించారు.

అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తోంది!

  • సీఈసీ ఎంపిక విషయంలో ప్రధానితో కేంద్ర మంత్రి విభేదిస్తారా?

  • ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీలో అలంకారప్రాయంగా ప్రతిపక్ష నేత

  • స్వతంత్రంగా ఉన్నట్లు ‘షో’ ఎందుకు?

  • సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కమిటీలో సీజేఐ ఉన్నప్పుడు సీఈసీకి కూడా ఉండాలిగా?

  • సీఈసీ నియామకంపై సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 14: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), కమిషనర్ల నియామక ప్రక్రియ తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ప్రశ్నించారు. అన్ని విషయాల్లో కార్యనిర్వాహక వర్గం నియంత్రణ పెరిగిపోయిందని పేర్కొంటూ ఎన్నికల కమిషనర్‌ నియామకం స్వతంత్రంగా జరుగుతున్నట్లు ‘షో’ చేయడం ఎందుకని వ్యాఖ్యానించారు. సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా ఆయన కీలక ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం ప్రధాని, ప్రతిపక్ష నేత, క్యాబినెట్‌ మంత్రితో కూడిన ఎంపిక కమిటీ సీఈసీ, ఈసీల నియామకంపై నిర్ణయం తీసుకుంటుండగా.. ఈ కమిటీ కూర్పును జస్టిస్‌ దత్తా ప్రశ్నించారు. ‘ప్రధాని ఒక వ్యక్తిని ఎంపిక చేస్తే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత మరొకరిని సూచిస్తారు. ఇలా ఏకాభిప్రాయం కుదరనప్పుడు మూడో వ్యక్తిగా ఉన్న క్యాబినెట్‌ మంత్రి ప్రధానిని కాదని ప్రతిపక్ష నేతకు మద్దతు తెలుపుతారా?’ అని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణిని అడిగారు. ఆచరణలో అన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చని ఆయన సమాధానమిచ్చారు. అలాంటప్పుడు కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తున్నట్లు కదా అని జస్టిస్‌ దత్తా పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయాన్ని క్యాబినెట్‌ మంత్రి వ్యతిరేకించే అవకాశం లేనందున 2ః1 మెజారిటీతో నియామకం జరిగిపోతోందన్నారు. ప్రతిపక్ష నాయకుడి పాత్రను ‘అలంకారప్రాయం’గా మార్చేశారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పనిచేయడమే కాదు, అది స్వతంత్రంగా ఉన్నట్లు ప్రజలకు కనిపించాలి కూడా అని సూచించారు. సీబీఐ డైరెక్టర్‌ నియామక ప్యానెల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నప్పుడు.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఉద్దేశించిన ఎన్నికల సంఘం విషయంలో మాత్రం ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. సీజేఐ కాకపోతే స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని అడిగారు. ఎన్నికల కమిషనర్ల ఎంపికకు ఉద్దేశించిన చట్టంతో పాటు ప్రస్తుత సీఈసీ, కమిషనర్ల నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు.

Updated Date - May 15 , 2026 | 04:14 AM