Share News

తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ కొట్లాట?

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:37 AM

తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ కొట్లాట(జల వివాదం) అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాదాపుగా ఐదేళ్లుగా సుప్రీంకోర్టులోనే వివాదం నడుస్తోందని వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణలకు కృష్ణా జలాలను.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా కేటాయించాలని తొలుత నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ కొట్లాట?

  • కృష్ణా జల వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ కొట్లాట(జల వివాదం) అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాదాపుగా ఐదేళ్లుగా సుప్రీంకోర్టులోనే వివాదం నడుస్తోందని వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణలకు కృష్ణా జలాలను.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా కేటాయించాలని తొలుత నిర్ణయించారు. దీని ప్రకారం తొలుత బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం-1956లోని సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీ చేపట్టాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీనిపై చాలాకాలం తర్వాత కేంద్రం బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీని సెక్షన్‌ 3 ప్రకారం చేపట్టాలని ఆదేశించింది. అయితే.. ట్రైబ్యునల్‌కు కేంద్రం జారీ చేసిన సెక్షన్‌ 3 టీవోఆర్‌ను రద్దుచేయాలని 2023 అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏపీకి తీవ్ర నష్టం కలిగే అవకాశముందని తన పిటిషన్‌లో పేర్కొంది. కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీ జలవివాద చట్టం ప్రకారం బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని తెలిపింది. .


రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులకు రక్షణ ఉందని, ఇప్పటికే సెక్షన్‌ 89 ఏ, బీ అంశాల కింద బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని ప్రాజెక్టులవారీగా కేటాయించే అంశాన్ని పరిశీలిస్తుండగా కొత్త అంశాలు చేర్చడం తగదని పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ఏపీ దాఖలు చేసిన రెండు రిట్‌ పిటిషన్లను (772/2021, 1230/2023).. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, సీఎస్‌ వైద్యనాథన్‌ తదితరులు హాజరయ్యారు. తొలుత, రిట్‌ పిటిషన్‌ 1230/2023కు సంబంధించిన విచారణ జరిగింది. ఏపీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఆ పిటిషన్‌కుసంబంధించి 2023 నవంబరులోనే నోటీసులు జారీ అయ్యాయని, అప్పటి సీజేఐ ధర్మాసనం ముందు విచారణ ప్రారంభమైందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ విచారణ పూర్తి కాలేదని తెలిపారు. ఈ కేసులో తుది తీర్పునకు లోబడి ట్రైబ్యునల్‌ విచారణలో ఏపీ పాల్గొనవచ్చునని గతంలో సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రైబ్యునల్‌ ఎదుట ఏపీ వాదనలు ముగింపు దశలో ఉన్నాయని.. కాబట్టి ఈ కేసును త్వరితగతిన విచారించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం అక్టోబరు 13కు వాయిదా వేసింది. అనంతరం, మరో రిట్‌ పిటిషన్‌ 772/2021 అంశాన్ని సైతం ఏపీ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ధర్మాసనం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ జల వివాదాలని ప్రశ్నించింది. ‘‘ఎప్పుడూ ఎందుకీ కొట్లాటలు? సానుకూల వాతావరణంలో సమస్యల పరిష్కారమే ఉత్తమమైన మార్గం’’ అని వ్యాఖ్యానించింది. విచారణను2027 జనవరికి వాయిదా వేసింది

Updated Date - Sep 11 , 2026 | 04:37 AM